18వ బ్రిక్స్ శిఖరాగ్ర సదస్సు నేటినుండి ప్రారంభమవుతోంది. భారత్ అధ్యక్షతన రెండు రోజుల పాటు జరుగుతున్న ఈ సదస్సుకు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అధ్యక్షత వహిస్తున్నారు. న్యూఢిల్లీలోని భారత్ మండపంలో అట్టహాసంగా జరుగనున్న ఈ అత్యున్నత సమావేశానికి పలువురు ప్రపంచ దేశాల అధినేతలు హాజరుకానున్నారు. ‘‘స్థిరత్వం, ఆవిష్కరణలు, సహకారం మరియు సుస్థిరత కోసం నిర్మాణం’’ అనే ఇతివృత్తంతో సమావేశాలు కొనసాగుతున్నాయి. ‘‘మానవత్వమే ప్రథమం’’ అనే దృక్పథంతో భారత్ ఈ సదస్సును నిర్వహిస్తోంది.
బ్రిక్స్ విస్తరణ తర్వాత జరుగుతున్న కీలక సమావేశం కావడంతో ఈ శిఖరాగ్ర సదస్సుకు ప్రత్యేక ప్రాధాన్యత ఏర్పడింది. 11 సభ్య దేశాలు, 10 భాగస్వామ్య దేశాలతో పాటు 11 అంతర్జాతీయ సంస్థల ప్రతినిధులు ఇందులో పాల్గొంటున్నారు. రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్, చైనా అధ్యక్షుడు షీ జిన్పింగ్, ఇరాన్ అధ్యక్షుడు మసౌద్ పెజెష్కియాన్, దక్షిణాఫ్రికా అధ్యక్షుడు సిరిల్ రామఫోసా, ఈజిప్టు అధ్యక్షుడు అబ్దుల్ ఫతా అల్సిసీతో పాటు ఐక్యరాజ్యసమితి ప్రధాన కార్యదర్శి ఆంటోనియో గుటెర్రెస్ తదితరులు సమావేశాల్లో పాల్గొంటున్నారు.
ఈ సదస్సులో ప్రపంచ ఆర్థిక వ్యవస్థకు సంబంధించిన పలు కీలక అంశాలపై విస్తృత చర్చలు జరగనున్నాయి. అంతర్జాతీయ ఆర్థిక వ్యవస్థలో సంస్కరణలు, బహుళ ధ్రువ ప్రపంచ ఆర్థిక వ్యవస్థ, డాలర్ ఆధిపత్యం, స్థానిక కరెన్సీల్లో పరస్పర వాణిజ్యం వంటి అంశాలు ప్రధాన చర్చకు రానున్నాయి. డిజిటల్ పరివర్తన, కృత్రిమ మేధ (AI) వినియోగం, ఆహార-ఇంధన భద్రత, ప్రపంచవ్యాప్తంగా సరఫరా వ్యవస్థల్లో ఎదురవుతున్న సవాళ్లపైనా నేతలు చర్చించనున్నారు.
అంతర్జాతీయ భద్రతకు సంబంధించిన అంశాలు కూడా సదస్సులో ప్రాధాన్యత సంతరించుకోనున్నాయి. రష్యా-ఉక్రెయిన్ యుద్ధం, ఇరాన్ పరిస్థితులు, పశ్చిమాసియా సంక్షోభం, ఇంధన సరఫరాలపై భౌగోళిక రాజకీయ పరిణామాల ప్రభావం వంటి అంశాలపై సభ్య దేశాల నేతలు తమ అభిప్రాయాలను పంచుకోనున్నారు.
ఇక సదస్సు సందర్భంగా భారత్-చైనా సంబంధాలపైనా ప్రత్యేక దృష్టి నెలకొంది. ప్రధాని నరేంద్ర మోదీ, చైనా అధ్యక్షుడు షీ జిన్పింగ్తో ద్వైపాక్షిక భేటీ నిర్వహించనున్నారు. ఈ సమావేశంలో వాస్తవాధీన రేఖ (LAC) వద్ద పరిస్థితులు, రెండు దేశాల మధ్య సంబంధాల సాధారణీకరణ, వాణిజ్య అంశాలపై చర్చ జరిగే అవకాశం ఉంది. రష్యా అధ్యక్షుడు పుతిన్, ఇరాన్ అధ్యక్షుడు పెజెష్కియాన్తోనూ ప్రధాని మోదీ ద్వైపాక్షిక సమావేశాలు నిర్వహించనున్నారు.
ప్రపంచ దేశాల అధినేతలు ఢిల్లీకి చేరుకోవడంతో భద్రతా ఏర్పాట్లను కట్టుదిట్టం చేశారు. ఢిల్లీ పోలీసులు భారీగా బలగాలను మోహరించడంతో పాటు కీలక ప్రాంతాల్లో ప్రత్యేక భద్రతా చర్యలు చేపట్టారు. ట్రాఫిక్ రద్దీని నియంత్రించేందుకు పలు ప్రాంతాల్లో ప్రత్యేక ఆంక్షలు అమలు చేస్తున్నారు. రెండు రోజుల పాటు జరిగే ఈ సమావేశాల్లో తీసుకునే నిర్ణయాలు ప్రపంచ ఆర్థిక వ్యవస్థ, వాణిజ్యం, భద్రతా సహకారంపై ప్రభావం చూపే అవకాశం ఉంది.









































