ఢిల్లీలో ‘భజన్ క్లబ్‌’ కార్యక్రమం.. హాజరై సందడి చేసిన ప్రధాని మోదీ

PM Modi Joins Bhajan Clubbing Event in Delhi, Calls It as Spectacular

భారతీయ జనసంఘ్ ప్రముఖ నాయకుడు పండిట్ దీన్‌దయాళ్ ఉపాధ్యాయ్ 110వ జయంతి సందర్భంగా ఢిల్లీలో నిర్వహించిన ‘భజన్ క్లబ్బింగ్’ కార్యక్రమంలో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పాల్గొన్నారు. దీన్‌దయాళ్ ఉపాధ్యాయ్ పార్క్‌లో శుక్రవారం జరిగిన ఈ కార్యక్రమంలో యువతతో కలిసి కూర్చున్న మోదీ భక్తి గీతాలను ఆలకించారు. కళాకారులతో కలిసి చప్పట్లు కొట్టడంతో పాటు చేతి వాద్యాన్ని వాయిస్తూ కార్యక్రమంలో భాగస్వామ్యమయ్యారు.

కార్యక్రమానికి పెద్ద సంఖ్యలో యువత, సాంస్కృతిక ప్రియులు హాజరయ్యారు. సంప్రదాయ భజనలను ఆధునిక సంగీత కచేరీ తరహాలో ప్రదర్శించడం ఈ కార్యక్రమానికి ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. మోదీ ప్రేక్షకులతో ముచ్చటిస్తూ కార్యక్రమాన్ని ఆస్వాదించారు.

కార్యక్రమం అనంతరం ప్రధాని మోదీ తన ఎక్స్ ఖాతాలో “Bhajan Clubbing in Delhi. Spectacular!” అంటూ స్పందించారు.

ఇంతకీ ‘భజన్ క్లబ్బింగ్’ అంటే ఏమిటి?

సంప్రదాయ భజనలు, కీర్తనలు, భక్తి గీతాలను ఆధునిక కచేరీ తరహా వాతావరణంలో ప్రదర్శించే విధానాన్ని ‘భజన్ క్లబ్బింగ్’గా పిలుస్తున్నారు. సాధారణ భజన కార్యక్రమాలకు భిన్నంగా ఇందులో లైవ్ మ్యూజిక్, ఆధునిక వాద్య పరికరాలు, సౌండ్ సిస్టమ్స్, స్టేజ్ లైటింగ్ వంటి అంశాలను ఉపయోగిస్తారు.

భక్తి సంగీతాన్ని ఆస్వాదించేందుకు పెద్ద సంఖ్యలో ప్రజలు ఒకే చోట చేరడం, పాటలకు అనుగుణంగా చప్పట్లు కొట్టడం, పాడటం, నృత్యం చేయడం ఈ ఫార్మాట్‌లో కనిపిస్తుంది. ముఖ్యంగా యువతను ఆకర్షించేలా సంప్రదాయ సంగీతాన్ని ఆధునిక ప్రదర్శన శైలితో మిళితం చేయడం దీని ప్రత్యేకతగా మారింది.

జెన్‌జీకి చేరువైన కొత్త ట్రెండ్

ఇటీవలి కాలంలో భజన్ క్లబ్బింగ్ నగర ప్రాంతాల్లో యువతలో ప్రాచుర్యం పొందుతున్న భక్తి సంగీత రూపంగా మారింది. మ్యూజిక్ కచేరీలను తలపించే వాతావరణంలో భజనలు వినిపించడంతో కొత్త తరం ప్రేక్షకులను కూడా ఈ కార్యక్రమాలు ఆకర్షిస్తున్నాయి.

ఈ ట్రెండ్‌పై ప్రధాని మోదీ గతంలో ‘మన్ కీ బాత్’లో కూడా మాట్లాడారు. 2026 జనవరి ప్రసారంలో భక్తి, సంస్కృతి, ఆధ్యాత్మికత, ఆధునికత కలయికగా భజన్ క్లబ్బింగ్‌ను ఆయన పేర్కొన్నారు. యువతలో ఈ తరహా కార్యక్రమాలకు ఆదరణ పెరుగుతోందని అందులో చెప్పుకొచ్చారు.

దీన్‌దయాళ్ ఉపాధ్యాయ్‌కు మోదీ నివాళి

భజన్ క్లబ్బింగ్ కార్యక్రమానికి ముందు పండిట్ దీన్‌దయాళ్ ఉపాధ్యాయ్ జయంతి సందర్భంగా ప్రధాని మోదీ ఆయనకు నివాళులర్పించారు. ఉపాధ్యాయ్ ప్రతిపాదించిన ‘అంత్యోదయ’ భావనను మోదీ ప్రస్తావిస్తూ, సమాజంలోని చివరి వరుసలో ఉన్న వ్యక్తి సంక్షేమాన్ని దేశ నిర్మాణంతో అనుసంధానించిన ఆయన ఆలోచనలు ఇప్పటికీ ప్రేరణనిస్తాయని పేర్కొన్నారు.

దీన్‌దయాళ్ ఉపాధ్యాయ్ భారతీయ జనసంఘ్‌లో ప్రముఖ నాయకుడిగా ఉన్నారు. జనసంఘ్‌నే తరువాత భారతీయ జనతా పార్టీకి పూర్వగామి రాజకీయ సంస్థగా పరిగణిస్తారు. ఆయన జయంతి సందర్భంగా నిర్వహించిన ఈ కార్యక్రమం ద్వారా సంప్రదాయ భక్తి సంగీతాన్ని సమకాలీన ప్రదర్శన విధానంతో మేళవించిన రూపం మరోసారి దేశవ్యాప్తంగా చర్చలోకి వచ్చింది.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here