భాగ్యనగరంలో ప్రసిద్ధి చెందిన బాలాపూర్ గణేశుడి లడ్డూ వేలం మరోసారి సంచలనం సృష్టించింది. వినాయక నిమజ్జనోత్సవాల సందర్భంగా నిర్వహించిన బహిరంగ వేలంలో బాలాపూర్ లడ్డూ ప్రసాదం రూ.39 లక్షల రికార్డు ధర పలికింది. తీవ్ర ఉత్కంఠ మధ్య సాగిన వేలంలో వనస్థలిపురం సాహెబ్ నగర్ వాసి, ప్రముఖ వ్యాపారవేత్త, భక్తుడు సామ ప్రణీత్ రెడ్డి అత్యధిక ధరకు లడ్డూను దక్కించుకున్నారు.
ఈసారి కళ్ళు చెదిరే ధర పలికిన లడ్డూ
బాలాపూర్ గణేశుడి లడ్డూ వేలం కేవలం నగరంలోనే కాకుండా రెండు తెలుగు రాష్ట్రాలలో ప్రతి ఏడాది ఆసక్తిని రేకెత్తిస్తుంది. దీనికి తగ్గట్టే ఈ ఏడాది కూడా వేలాదిగా భక్తులు, స్థానికులు వేలంలో ఉత్కంఠగా పాల్గొన్నారు. పోటీ పెరుగుతూ చివరకు లడ్డూ ధర రూ.39 లక్షలకు చేరింది.
కాగా, గత ఏడాది బాలాపూర్ లడ్డూ రూ.35 లక్షలకు విక్రయమైంది. ఈసారి ఏకంగా మరో రూ.4 లక్షలు అధికంగా ధర పలకడం విశేషం. దీంతో గత ఏడాది నమోదైన ధరను అధిగమించి సరికొత్త రికార్డు నమోదైంది.
రూ.450 నుంచి రూ.39 లక్షల వరకు..
బాలాపూర్ లడ్డూ వేలం సంప్రదాయం మూడు దశాబ్దాలుగా కొనసాగుతోంది. 1994లో కేవలం రూ.450తో ప్రారంభమైన ఈ వేలం.. ఏటేటా ధర పెరుగుతూ వచ్చింది. ప్రస్తుతం లడ్డూ ధర లక్షల రూపాయలకు చేరుకోవడంతో బాలాపూర్ గణేశుడి నిమజ్జనోత్సవాల్లో ఈ వేలం ప్రత్యేక ఆకర్షణగా మారింది.
లడ్డూను దక్కించుకోవడం వల్ల కుటుంబానికి ఐశ్వర్యం, శుభం కలుగుతాయని భక్తుల్లో విశ్వాసం ఉంది. ఈ నమ్మకంతో ప్రతి ఏడాది వేలంలో పాల్గొనే వారి సంఖ్య, పోటీ రెండూ పెరుగుతున్నాయి.
సామాజిక కార్యక్రమాలకు వేలం ఆదాయం
బాలాపూర్ లడ్డూ వేలం ద్వారా వచ్చిన మొత్తాన్ని నిర్వాహకులు వివిధ అభివృద్ధి, సామాజిక కార్యక్రమాలకు వినియోగిస్తున్నారు. ముఖ్యంగా బాలాపూర్ ప్రాంతంలోని దేవాలయాల నిర్వహణ, మౌలిక వసతుల అభివృద్ధి, ఇతర సంక్షేమ కార్యక్రమాలకు ఈ నిధులను ఖర్చు చేస్తారు.
బాలాపూర్లో పండగ వాతావరణం
రూ.39 లక్షలకు లడ్డూ వేలం ముగియడంతో బాలాపూర్లో పండగ వాతావరణం నెలకొంది. కొత్త రికార్డు నమోదవడంతో భక్తులు, స్థానికులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. ప్రతి ఏడాది ప్రత్యేక ఆకర్షణగా నిలిచే బాలాపూర్ లడ్డూ వేలం.. ఈసారి కూడా భారీ ధరతో వార్తల్లో నిలిచింది.







































