కనకదుర్గమ్మ ఆలయంలో ‘లడ్డూ ఏటీఎం’.. క్యూలైన్లు లేకుండా క్షణాల్లో ప్రసాదం!

Vijayawada Kanaka Durga Temple Installs AP's First Laddu Prasadam ATM Machine

విజయవాడ ఇంద్రకీలాద్రిపై వేంచేసియున్న శ్రీ దుర్గా మల్లేశ్వర స్వామి వార్ల దేవస్థానంలో భక్తుల సౌకర్యార్థం అత్యంత అధునాతన సాంకేతికతతో కూడిన ‘లడ్డూ ప్రసాదం ఏటీఎం’ (వెంకటింగ్ మెషిన్) సేవలు ప్రారంభమయ్యాయి. రాష్ట్రంలోనే ప్రథమంగా ప్రవేశపెట్టిన ఈ ఆటోమేటెడ్ డిజిటల్ యంత్రాన్ని దేవాదాయ శాఖ కమిషనర్ కే. రామచంద్ర మోహన్, దేవస్థానం చైర్మన్ బొర్రా రాధాకృష్ణ (గాంధీ) మరియు ఈఓ వి.కే. సీనా నాయక్‌లతో కలిసి ఇంద్రకీలాద్రి దిగువన ఉన్న సెంట్రల్ ఇన్ఫర్మేషన్ సెంటర్ (అర్జున వీధి ప్రవేశ మార్గం) వద్ద ప్రారంభించారు.

యూపీఐ ద్వారా క్షణాల్లో ప్రసాదం పొందే వెసులుబాటు

ఈ లడ్డూ ప్రసాదం ఏటీఎం ద్వారా భక్తులు క్యూలైన్లలో గంటల తరబడి వేచి ఉండాల్సిన అవసరం లేకుండానే క్షణాల్లో ప్రసాదాన్ని పొందవచ్చు. డిజిటల్ లావాదేవీలకు ప్రాధాన్యత ఇస్తూ రూపొందించిన ఈ యంత్రంలో, భక్తులు తమకు కావలసిన లడ్డూల సంఖ్యను ఎంచుకుని స్క్రీన్‌పై కనిపించే క్యూఆర్ (QR) కోడ్‌ను ఫోన్‌పే, గూగుల్ పే లేదా ఇతర యూపీఐ (UPI) యాప్‌ల ద్వారా స్కాన్ చేసి నగదు చెల్లించాల్సి ఉంటుంది.

చెల్లింపు పూర్తయిన కేవలం 40 నుండి 50 సెకన్ల వ్యవధిలోనే ప్రసాదం బాక్స్ ఆటోమేటిక్‌గా వెండింగ్ మెషిన్ ద్వారా బయటకు వస్తుంది. రూ. 100 ధరకు 6 లడ్డూలు ఉన్న ప్రసాదం బాక్సులను ఈ ఏటీఎం ద్వారా పంపిణీ చేస్తున్నారు.

పైలట్ ప్రాజెక్ట్‌గా పరిశీలన – డిజిటలైజేషన్‌కు ప్రాధాన్యత

దేవస్థానంలో క్యూలైన్ల రద్దీని తగ్గించడం, సిబ్బంది ప్రమేయం లేకుండా పారదర్శకంగా ప్రసాద విక్రయాలు జరపడమే ఈ లడ్డూ ఏటీఎం ప్రధాన ఉద్దేశమని అధికారులు తెలిపారు. దసరా శరన్నవరాత్రి ఉత్సవాలను దృష్టిలో ఉంచుకుని పైలట్ ప్రాజెక్ట్‌గా ప్రారంభించిన ఈ యంత్ర పనితీరును పరిశీలించిన అనంతరం, భక్తుల రద్దీ ఎక్కువగా ఉండే ఇతర ప్రాంతాలలో కూడా మరిన్ని లడ్డూ ఏటీఎంలను ఏర్పాటు చేయాలని పాలకమండలి భావిస్తోంది.

అదేవిధంగా నకిలీ పూజా టికెట్లు, మధ్యవర్తుల మోసాల పట్ల భక్తులు అప్రమత్తంగా ఉండాలని, కేవలం అధికారిక వెబ్‌సైట్ మరియు కౌంటర్ల ద్వారానే సేవలని పొందాలని దేవాదాయ శాఖ కమిషనర్ సూచించారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here