కాంగ్రెస్ అగ్రనేత, లోక్‌సభలో ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీని దేశ ప్రధానిగా చూడాలనేదే తన కల అని తెలిపారు తెలంగాణ ముఖ్యమంత్రి ఎ. రేవంత్ రెడ్డి. ఈ మేరకు ఆయన తాజాగా కేరళం రాష్ట్ర ప్రతిష్టాత్మక ‘ఆర్యదాన్ ముహమ్మద్-2026’ బెస్ట్ పబ్లిక్ సర్వెంట్ (ఉత్తమ ప్రజా సేవకుడు) అవార్డు అందుకున్న సందర్భంగా కీలక రాసంగం చేశారు. కాగా,కేరళం దిగ్గజ కాంగ్రెస్ నాయకుడు, దివంగత ఆర్యదాన్ ముహమ్మద్ స్మారకార్థం ఆర్యదాన్ ముహమ్మద్ ఫౌండేషన్ ఈ పురస్కారాన్ని ఏర్పాటు చేసింది.
ఈ నేపథ్యంలో శుక్రవారం ఆర్యదాన్ ముహమ్మద్ నాలుగో వర్ధంతి సందర్భంగా నిలంబూర్‌లో నిర్వహించిన ప్రత్యేక కార్యక్రమంలో ఏఐసీసీ జనరల్ సెక్రటరీ కేసీ వేణుగోపాల్ చేతుల మీదుగా సీఎం రేవంత్ రెడ్డి ఈ పురస్కారాన్ని అందుకున్నారు.
తెలంగాణలో రైతులు, వెనుకబడిన వర్గాలు, పేదల సంక్షేమానికి ముఖ్యమంత్రి చేపట్టిన వివిధ వినూత్న కార్యక్రమాలు, పాలనా సంస్కరణలు మరియు ప్రజాస్వామ్య విలువల పట్ల ఆయనకున్న నిబద్ధతను గుర్తించి జ్యూరీ ఈ అవార్డుకు ఎంపిక చేసింది.
కేరళ బయటి రాష్ట్రానికి చెందిన నాయకుడికి ఈ అవార్డు రావడం ఇదే తొలిసారి కావడం విశేషం. ఈ పురస్కారం కింద రూ. లక్ష నగదు బహుమతి, ప్రశంసా పత్రం మరియు జ్ఞాపికను అందజేశారు. అవార్డు స్వీకరణ అనంతరం మాట్లాడిన సీఎం రేవంత్ రెడ్డి, ఇది కేవలం తనకు వచ్చిన గుర్తింపు కాదని, కాంగ్రెస్ కార్యకర్తగా మరియు ప్రజా సేవకుడిగా భావిస్తున్నానని తెలిపారు.
కేరళ రాజకీయాల్లో ఆర్యదాన్ ముహమ్మద్ ఎనిమిది సార్లు ఎమ్మెల్యేగా, నాలుగు సార్లు మంత్రిగా సేవలు అందించి విశేష ప్రజాదరణ పొందారని సీఎం గుర్తుచేశారు. తెలంగాణ ప్రభుత్వం అమలు చేస్తున్న ఇందిరమ్మ ఇళ్లు, రైతు భరోసా, వెనుకబడిన వర్గాలకు సంక్షేమ పథకాలు వంటి అంశాలను ఈ సందర్భంగా జ్యూరీ ప్రశంసించింది. ఈ కార్యక్రమంలో పలువురు కేరళ కాంగ్రెస్ సీనియర్ నాయకులు, ప్రజాప్రతినిధులు మరియు ఫౌండేషన్ సభ్యులు పాల్గొన్నారు.







































