కాంగ్రెస్ పార్లమెంటరీ పార్టీ (CPP) ఛైర్ పర్సన్ సోనియా గాంధీ ప్రముఖ సోషల్ మీడియా వేదిక ఇన్‌స్టాగ్రామ్‌లోకి అధికారికంగా అడుగుపెట్టారు. తన ఇన్స్టాగ్రామ్ అకౌంట్ ద్వారా ఆమె తన తొలి వీడియోను షేర్ చేస్తూ, తన రాబోయే ఆత్మకథ ‘బిలాంగింగ్: ఎ జర్నీ ఆఫ్ లవ్’ (Belonging: A Journey of Love) పుస్తక తొలి లుక్‌ను ప్రజలతో పంచుకున్నారు.
ఈ ప్రకటనతో రాజకీయ వర్గాల్లో మరియు సోషల్ మీడియాలో ఆసక్తికర చర్చ మొదలైంది. ఈ సందర్భంగా సోనియా గాంధీ తన ఇన్స్టాగ్రామ్ పోస్ట్‌లో.. “ఈ క్షణాన్ని మీ అందరితో పంచుకోవడం నాకు చాలా ఆనందంగా ఉంది. ‘బిలాంగింగ్: ఎ జర్నీ ఆఫ్ లవ్’ పుస్తకం తొలి లుక్‌ను విడుదల చేస్తున్నాను” అంటూ తన భావాలను వ్యక్తపరిచారు.
ఇది ప్రేమ, బాధ్యత, వ్యక్తిగత నష్టాలు మరియు ఒక చోట సొంతం కావడానికి పడిన తపనతో కూడిన తన జీవిత కథ అని, దీనిని త్వరలో మీతో పంచుకోవడానికి తాను ఎదురుచూస్తున్నానని ఆమె పేర్కొన్నారు. యుద్ధానంతర ఇటలీలో ఆమె బాల్యం, కేంబ్రిడ్జ్ యూనివర్సిటీలో రాజీవ్ గాంధీతో పరిచయం, వివాహం, ఆ తర్వాత భారత్‌లో ఆమె ప్రయాణం, అత్తగారు ఇందిరా గాంధీ మరియు భర్త రాజీవ్ గాంధీ హత్యల తదనంతరం తన జీవితంలో ఎదురైన భావోద్వేగాలను ఈ ఆత్మకథలో ఆమె పొందుపరిచారు.
అంతర్జాతీయ ప్రచురణ సంస్థ ‘ఆల్ఫ్రెడ్ ఎ నాఫ్’ (Alfred A Knopf) ద్వారా ఈ పుస్తకం నవంబర్ 10న విడుదల కానుంది. ఇక సోనియా గాంధీ ఇన్స్టాగ్రామ్ ఎంట్రీ పట్ల కాంగ్రెస్ శ్రేణులు, నాయకులు హర్షం వ్యక్తం చేస్తున్నారు.







































