ద్వేషం నిండిన హృదయాలకు ప్రేమ తెలియదు – బీజేపీ విమర్శలపై రాహుల్ గాంధీ కౌంటర్

LoP Rahul Gandhi Hits Back BJP and RSS Critics With Shiva-Parvati Temple Sculpture Photo

భారతీయ జనతా పార్టీ (బీజేపీ) మరియు రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్ (ఆర్ఎస్ఎస్) నేతలకు లోక్‌సభ ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ గట్టిగా బదులిచ్చారు. బీజేపీ, ఆర్ఎస్ఎస్ మద్దతుదారుల హృదయాలు ద్వేషంతో నిండిపోయాయని, అందువల్లే వారు స్వచ్ఛమైన ప్రేమను, ఆప్యాయతను అనుభూతి చెందలేకపోతున్నారని ఆయన మండిపడ్డారు. ఈ మేరకు మంగళవారం (నవంబర్ 17) సోషల్ మీడియా వేదిక ‘ఎక్స్’ (X) లో పార్వతీదేవి శివుడి ఒడిలో కూర్చున్న పురాతన ఆలయ శిల్పం ఫొటోను రాహుల్ గాంధీ పంచుకున్నారు.

కాగా, తన తల్లిదండ్రులు రాజీవ్ గాంధీ, సోనియా గాంధీ మధ్య ఉన్న అన్యోన్య అనుబంధాన్ని ఉద్దేశించి తాను చేసిన వ్యాఖ్యలపై విమర్శలు గుప్పించిన నేపథ్యంలో రాహుల్ తీవ్రంగా ప్రతిస్పందించారు. ఈ వివాదానికి సోమవారం ఢిల్లీలో జరిగిన సోనియా గాంధీ ఆత్మకథ ‘బిలాంగింగ్: ఎ జర్నీ ఆఫ్ లవ్’ (Belonging: A Journey of Love) పుస్తకావిష్కరణ సభ వేదికైంది.

ఈ కార్యక్రమంలో పాల్గొన్న రాహుల్ గాంధీ తన చిన్ననాటి జ్ఞాపకాలను గుర్తు చేసుకుంటూ.. భోజనం చేసే సమయంలో నాన్న (రాజీవ్ గాంధీ), అమ్మ (సోనియా గాంధీ) ఎంతో కలివిడిగా, అన్యోన్యంగా ఉండేవారని, చిన్నతనంలో తాను దాన్ని చాలా సాధారణ విషయంగా భావించేవాడినని భావోద్వేగంగా వివరించారు. కుటుంబంలోని ఆప్యాయతను తెలిపే క్రమంలో ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు.

అయితే, రాహుల్ గాంధీ చేసిన ఈ వ్యాఖ్యలపై బీజేపీ నేతలు తీవ్రస్థాయిలో విమర్శలు గుప్పించారు. ముఖ్యంగా అస్సాం ముఖ్యమంత్రి హిమంత బిశ్వ శర్మ స్పందిస్తూ.. తన తల్లి జీవితంలో ఎంతో ప్రత్యేకమైన పుస్తకావిష్కరణ రోజున కూడా రాహుల్ గాంధీ తన వ్యాఖ్యలతో ఆమెను ఇబ్బందికర పరిస్థితికి గురి చేశారని ఎద్దేవా చేశారు. పలువురు బీజేపీ నేతలు కూడా సోషల్ మీడియా వేదికగా రాహుల్ ప్రసంగంలోని అంశాలను ప్రస్తావిస్తూ విమర్శనాస్త్రాలు సంధించారు.

బీజేపీ నేతల విమర్శల నేపథ్యంలో రాహుల్ గాంధీ భారతీయ సంస్కృతి, శిల్పకళలో ప్రేమకు ఉన్న ప్రాధాన్యతను చాటిచెప్పేలా శివపార్వతుల శిల్పం చిత్రాన్ని పోస్ట్ చేస్తూ రాజకీయంగా ఎదురుదాడికి దిగారు. ప్రేమ, ఆప్యాయతల విలువ తెలియని వారే తన మాటలను వక్రీకరిస్తున్నారని ఆయన పేర్కొనడంతో, ప్రస్తుతం ఈ అంశం జాతీయ రాజకీయాల్లో, సోషల్ మీడియాలో తీవ్ర చర్చనీయాంశంగా మారింది.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here