బీజేపీని ఢీ కొట్టండి ఇలా.. కాంగ్రెస్ కార్య‌క‌ర్త‌ల‌కు శిక్ష‌ణ

Rahul gandhi, PM Modi, BJP, Congress, Lok sabha elections, lok sabha, Indian Prime Minister Narendra Modi,Indian PM Narendra Modi,Narendra Modi,PM Narendra Modi, Narendra modi Latest News and Updates, Indian Political News, National Political News, Mango News Telugu, Mango News
Rahul gandhi, PM Modi, BJP, Congress, Lok sabha elections

ముచ్చ‌ట‌గా మూడోసారి అధికారంలోకి వ‌చ్చేందుకు భార‌తీయ జ‌న‌తా పార్టీ చాలా కాన్ఫిడెంట్ గా ఉంది. ఇటీవ‌ల జ‌రిగిన వ‌రుస ఎన్నిక‌ల్లో విజ‌యాలు, చేప‌డుతున్న కార్య‌క్ర‌మాలు, అయోధ్య నిర్మాణం.. ఈ అంశాల‌న్నీ ఆ పార్టీకి క‌లిసి వ‌చ్చేలా ఉన్నాయి. ఆ న‌మ్మ‌కంతోనే.. ఇటీవ‌ల ప్ర‌ధాన‌మంత్రి న‌రేంద్ర మోడీ మాట్లాడుతూ.. ఎన్‌డీఏ గెలుపు ఖాయ‌మ‌న్నారు. సొంతంగానే బీజేపీకి 370 సీట్లు వ‌స్తాయ‌ని, కూట‌మి 400 సీట్లు సాధిస్తుంద‌ని చెప్పారు. కాంగ్రెస్ గురించి మాట్లాడుతూ.. ఆ పార్టీకి క‌నీసం 40 సీట్ల‌యినా రావాల‌ని కోరుకుంటున్న‌ట్లు వ్యంగ్యాస్త్రాలు సంధించారు. వాస్త‌వానికి ప్ర‌స్తుత ప‌రిస్థితులు దేశంలో ఎన్‌డీఏకు ఇంకా అనుకూలంగానే ఉన్న‌ట్లు క‌నిపిస్తున్నాయి. ఈ క్ర‌మంలో కాంగ్రెస్ పార్టీ తీవ్ర‌మైన స్థాయిలో మేధోమ‌ధ‌నం చేస్తోంది. గెల‌వాలంటే ఎలా అని త‌ర్జ‌న‌భ‌ర్జ‌న ప‌డుతోంది.

ఇండియా పేరుతో విప‌క్ష పార్టీల‌న్నీ జ‌త క‌ట్టినా, జోడో, న్యాయ యాత్ర‌ల పేరుతో రాహుల్ గాంధీ దేశ‌మంతా తిరుగుతున్నా.. కాంగ్రెస్ లో ఆశించిన స్థాయిలో జోష్ పెర‌గ‌డం లేదు. ఈ నేప‌థ్యంలో పార్టీ భిన్న త‌ర‌హాలో ఆలోచిస్తోంది. లోక్‌సభ ఎన్నికల నేపథ్యంలో 15 రాష్ట్రాల్లోని వంద నియోజకవర్గాల్లో భావసారూప్యత, వామపక్ష భావజాలం కలిగిన పౌర సంఘాల సహాయం తీసుకోవాలని కాంగ్రెస్‌ పార్టీ భావిస్తోంది. వివిధ సామాజిక ఉద్యమాలకు నేతృత్వం వహిస్తున్న ఎన్జీవోలు, నేతల ద్వారా కేడర్‌కు శిక్షణ ఇప్పించాలని యోచిస్తోంది. కాంగ్రెస్‌తో కలసి పనిచేయడానికి పౌర సంఘాల సమాఖ్య అయిన భారత్‌ జోడో అభియాన్‌ (బీజేఏ) నోడల్‌ ప్లాట్‌ఫాంగా ఉంటుంది. దీనికి యోగేంద్ర యాదవ్‌ కన్వీనర్‌గా వ్యవహరిస్తున్నారు. అరుణా రాయ్‌, ప్రశాంత్‌ భూషణ్‌, తుషార్‌ గాంధీ, సయీదా హమీద్‌, హర్ష్‌ మందిర్‌ తదితర అనేకమంది పౌర సంఘాల ప్రముఖులు ఈ ప్రణాళికకు మెంటార్లుగా వ్యవహరించనున్నారు.

వీరిలో కొందరు 2004 నుంచి 2014 వరకూ కాంగ్రెస్‌ నేతృత్వంలోని యూపీఏ-1, 2 ప్రభుత్వాల హయాంలో కీలక పదవులు నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ఎలాంటి ఆటంకాలు లేకుండా చూడాలని, బీజీఏ బృందాలకు పూర్తిగా సహకరించాలని అన్ని రాష్ట్రాల కాంగ్రెస్‌ విభాగాలకు ఆ పార్టీ ప్రధాన కార్యదర్శి కేసీ వేణుగోపాల్‌ గత నెలలో లేఖలు రాశారు. గ‌తంలోని గుణ‌పాఠాల‌నే.. పాఠాలుగా కార్య‌క‌ర్త‌ల‌కు బోధించాల‌ని ప్ర‌య‌త్నాలు చేస్తున్నారు. అనేక రాష్ట్రాలలో జరిగిన ఎన్నికలలో కాంగ్రెస్ ఓడిపోయినా, ప్రతిపక్షంలో ఉన్నా అక్కడ ప్రత్యేకంగా ఏమీ చేయలేకపోయింది. ఈ జాబితాలో ఉత్తర భారతంలో చాలా రాష్ట్రాలు ఉన్నాయి. ఈ ప్రాంతాల్లో కాంగ్రెస్ పార్టీ నుంచి కొంత కరిష్మాను ప్రజలు ఆశించారు. 2019 ఎన్నిక‌ల్లో రాహుల్ గాంధీ ప్రచారం చేసినా ఉపయోగం లేకపోయింది.

రాహుల్ గాంధీ ఇప్పుడు కాంగ్రెస్ అధ్యక్షుడిగా లేరు. కానీ పార్టీ మొత్తం గాంధీ కుటుంబం చుట్టూనే తిరుగుతోంది. కాంగ్రెస్ పార్టీ రాజస్థాన్,ఛత్తీస్‌గఢ్‌లలో అధికారం కోల్పోయింది. మధ్యప్రదేశ్‌లో ఘోరంగా ఓడిపోయింది. అదే సమయంలో మిజోరంలో ఒకే ఒక సీటుకు పరిమితమైంది. అయితే తెలంగాణలో మాత్రం బీఆర్ఎస్ పార్టీని ఓడించి చరిత్రాత్మక విజయాన్ని కాంగ్రెస్ సాధించింది. రాజస్థాన్, చత్తీస్‌గఢ్, మధ్యప్రదేశ్, తెలంగాణ ఎన్నికల ప్రచారంలో ప్రధాని నరేంద్ర మోదీ ప్రచారంలో ముందుంటే, కేంద్ర మంత్రులు ఆయన వెనుక ఉన్నారు. అదే కాంగ్రెస్ విషయానికొస్తే, ఆయా రాష్ట్రాలలో కాంగ్రెస్ రాష్ట్ర నాయకులు ప్రచారంలో ముందుంటే, రాహుల్ వారి వెనుక ఉన్నారు. రాజస్థాన్‌లో రాహుల్ చాలా తక్కువగా ప్రచారం చేశారు. కానీ తెలంగాణలో మాత్రం ఎక్కువగా చేశారు.

రాహుల్ గాంధీ ఇచ్చిన నినాదాలను తెలంగాణలో తప్ప మిగిలిన రాష్ట్రాలలో ఆ పార్టీ నేతలు విరివిగా వినియోగించలేదు. ఛత్తీస్‌గఢ్‌‌లో భూపేష్ బఘేల్, రాజస్థాన్‌లో అశోక్ గెహ్లోత్ తమ ప్రభుత్వ విజయాలనే ప్రచారం చేశారు. మధ్యప్రదేశ్‌లో మాజీ సీఎం కమల్‌నాథ్ మొత్తం ఎన్నికల బాధ్యతలను తీసుకున్నారు. తెలంగాణలో ఎన్నికల బాధ్యతలను పీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి భుజాన మోశారు. ఇవ‌న్నింటినీ బేరీజు వేసుకుని లోక్ స‌భ ఎన్నిక‌ల‌కు సిద్ధం కావాల‌ని జాతీయ కాంగ్రెస్ పున‌రాలోచ‌న చేస్తోంది. త‌మ‌కు స‌హ‌క‌రించే అన్ని పార్టీల‌, సంఘాల స‌హ‌కారం కోరుతోంది. కొత్త‌గా బీజేఏ ఇవ్వ‌బోయే ఈ శిక్ష‌ణ‌.. బీజేపీని అడ్డుకునేందుకు ఎంత వ‌ర‌కు దోహ‌దం ప‌డుతుందో వేచి చూడాలి.

మ్యాంగో న్యూస్ లింక్స్:

టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial

గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN

ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xE