స్కిల్ స్కాం కేసులో అరెస్టు అయిన తెలుగుదేశం అధినాయకుడు చంద్రబాబునాయుడు తాత్కాలిక బెయిలుపై ప్రస్తుతం బయటే ఉన్నారు. ఆరోగ్యానికి సంబంధించిన పరీక్షలు చేయించుకుంటున్నారు. తాజాగా కంటికి శస్త్రచికిత్స చేయించుకున్నారు. ప్రాణం బాగోక చంద్రబాబు ఆస్పత్రుల చుట్టూ తిరుగుతుంటే.. మరోవైపు ఏపీ సర్కారు మాత్రం ఆయన చుట్టూ ఉచ్చు బిగిస్తోంది. టీడీపీ హయాంలో నిర్వహించిన ఉచిత ఇసుక విధానం ద్వారా రాష్ట్ర ప్రభుత్వ ఖాజానాకు భారీగా నష్టం వాటిల్లిందని ఏపీ సీఐడీ ఇప్పటికే కేసు నమోదు చేసింది.
అయితే.. ఈకేసులో ముందస్తు బెయిలు కోరుతూ చంద్రబాబు హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. ఆయన తరఫున లాయర్లు వాదించారు. ముందస్తు ఆదేశాల మేరకు చంద్రబాబును ఈ నెల 28 వరకు అరెస్ట్ చేయబోమని సీఐడీ కోర్టుకు తెలిపింది. ఇరుపక్షాల వాదనలు విన్న న్యాయస్థానం తదుపరి విచారణను ఈనెల 22కు వాయిదా వేసింది. దీని సంగతి అలా ఉంచితే.. బెయిల్ పిటిషన్‌లో చంద్రబాబు పేర్కొన్న అంశాలను పరిశీలిస్తే ఎన్నికల వరకు జైలులోనే ఉంచాలన్న లక్ష్యంతో ప్రభుత్వం కేసులు మీద కేసులు పెడుతోందని ఆరోపించడం ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది.
స్కిల్ స్కాం అరెస్ట్‌లో తన ప్రమేయం లేదని, తాను అప్పుడు దేశంలోనే లేనని ఏపీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి పదే పదే చెబుతున్నారు. తనకు వ్యక్తిగత కక్షలు లేవని పేర్కొంటున్నారు. మరి.. అదే నిజమైతే అమరావతి.. ఉచిత కేసులు ఎవరు.. ఎందుకు పెట్టించినట్లు అన్న ప్రశ్నలు సహజంగానే ఉత్పన్నమవుతాయి. రాష్ట్ర ప్రగతికి భంగం వాటిల్లేలా చర్యలు చేపట్టినందుకు ఆయా శాఖలు తీసుకుంటున్న చర్యలే ఇవన్నీ అన్న సమాధానమూ ప్రభుత్వ పెద్దల వద్ద ఉంది. ఈ కేసులను పరిశీలిస్తే.. చంద్రబాబు అన్నట్లుగా ఎన్నికల వరకూ ఆయనను జైలులో ఉంచడమే జగన్ ఉద్దేశమా.. అనే సందేహం సామాన్యులకు కూడా కలగక మానదు.
దీనికి తోడు తాను, తెలుగుదేశం పార్టీని లక్ష్యంగా చేసుకుని సర్కారు ఇబ్బంది పెడుతోందని చంద్రబాబు పేర్కొంటున్నారు. తాజాగా బెయిలు పిటిషన్‌లో కూడా.. ‘2024 సార్వత్రిక ఎన్నికల వరకు నన్ను జ్యుడీషియల్ కస్టడీలో ఉంచాలనే దురుద్దేశంతో 2015-19 మధ్య తీసుకున్న విధానపరమైన నిర్ణయాలపై వరుసగా కేసులు నమోదు చేస్తోంది. దర్యాప్తు సంస్థగా తటస్థ విధానాన్ని పక్కనపెట్టి అధికార వైసీపీ సూచనలకు అనుగుణంగా సీఐడీ నడుచుకుంటోంది. స్కిల్ డెవలప్‌మెంట్ కేసులో కోర్టు ఇచ్చిన మధ్యంతర ఉత్తర్వుల ఉద్దేశం నెరవేరేవరకు మద్యం కేసులో నన్ను అరెస్టు చేయబోమని అడ్వకేట్ జనరల్ అక్టోబరు 31న కోర్టుకు హామీ ఇచ్చారు. ఈ హామీని నమోదు చేసిన కోర్టు విచారణను ఈ నెల 21కి వాయిదా వేసింది. ఈ ఉత్తర్వులు వెలువడిన ఒకరోజు తర్వాత సీఐడీ అధికారులు ఇసుక పాలసీపై కేసు నమోదు చేశారు. గత ప్రభుత్వ విధానాల్లో ఎలాంటి లోపాలు లేనప్పటికీ సీఐడీ వరుస ఎఫ్‌ఐఆర్‌లు నమోదు చేస్తోంది. నన్ను టార్గెట్ చేసేందుకు అధికార యంత్రాంగాన్ని ఎలా ఉపయోగిస్తున్నారనే దానికి వరుస కేసులు నమోదే ఉదాహరణ.’ అని చంద్రబాబు పేర్కొన్నారు.
జరుగుతున్న పరిస్థితులను, చంద్రబాబు ఉదాహరణలతో సహా పిటిషన్‌లో పేర్కొన్న అంశాలను పరిశీలిస్తే జగన్ సర్కారు లక్ష్యం అదేనా అన్న అనుమానాలు కలుగుతున్నాయి. అదే నిజమైతే.. ఆయా కేసులపై న్యాయపోరాటం చేస్తున్న చంద్రబాబు ఎన్నికలలోపు వాటి నుంచి బయటపడతారా లేదా, లేకుంటే.. జైలులో ఉంటే ఎన్నికల సమరాన్ని నడుపుతా అనేది వేచి చూడాలి.
మ్యాంగో న్యూస్ లింక్స్:
టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xE