వచ్చే మూడేళ్లలో 36 సాగునీటి ప్రాజెక్టులు పూర్తి చేస్తాం – సీఎం చంద్రబాబు

CM Chandrababu Aims To Complete 36 Irrigation Projects in Three Years

ఆంధ్రప్రదేశ్‌లో సాగునీటి రంగానికి అత్యంత ప్రాధాన్యత ఇస్తున్నామని ముఖ్యమంత్రి, టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు తెలిపారు. వచ్చే మూడేళ్లలో రూ.35 వేల కోట్లతో రాష్ట్రంలోని 36 సాగునీటి ప్రాజెక్టులను పూర్తి చేసి చరిత్ర సృష్టిస్తామని ప్రకటించారు. టీడీపీ కేంద్ర కార్యాలయంలో నిర్వహించిన లీడర్‌షిప్‌ కాంక్లేవ్‌ రెండో రోజు సమావేశంలో సీఎం చంద్రబాబు ఈ మేరకు కీలక వ్యాఖ్యలు చేశారు.

ప్రతి ఎకరాకూ నీరు అందించడమే లక్ష్యం

వంశధార, గోదావరి, కృష్ణా, తుంగభద్ర, కావేరి, పెన్నా నదులను అనుసంధానం చేస్తే రాష్ట్రంలోని రిజర్వాయర్లను మరింత సమర్థంగా నింపుకునే అవకాశం ఉంటుందని చంద్రబాబు తెలిపారు. వెలిగొండ ప్రాజెక్టులో ఈ సీజన్‌లో 10.7 టీఎంసీల నీటిని నిల్వ చేస్తున్నామని, వచ్చే ఏడాది 50 టీఎంసీల వరకు నిల్వ చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నట్లు చెప్పారు.

పోలవరం ఫేజ్‌-2 పూర్తయితే 190 టీఎంసీల వరకు, బొల్లాపల్లి ప్రాజెక్టు నిర్మాణంతో 350 టీఎంసీల వరకు నీటిని నిల్వ చేసుకునే అవకాశం ఉంటుందని వివరించారు. అన్ని ప్రాజెక్టులు పూర్తయితే రాష్ట్రంలోని రిజర్వాయర్లలో 1,250 నుంచి 1,400 టీఎంసీల వరకు నీటిని నిల్వ చేసుకునే సామర్థ్యం ఏర్పడుతుందని సీఎం తెలిపారు.

గోదావరి నీటిని ఒడిసిపడితే అద్భుతాలు

ఎల్‌నినో ప్రభావం ఉన్నప్పటికీ ఈ ఏడాది గోదావరి నుంచి సుమారు 1,000 టీఎంసీల నీరు సముద్రంలో కలిసిపోయిందని చంద్రబాబు పేర్కొన్నారు. అందులో 300 టీఎంసీలను వినియోగించుకోగలిగితే రాష్ట్రంలో అద్భుతమైన ఫలితాలు సాధించవచ్చని అన్నారు.

రాష్ట్రంలో ప్రస్తుతం 54 శాతం లోటు వర్షపాతం నమోదైందని, గత ఏడాది ఇదే సమయానికి రిజర్వాయర్లలో 737 టీఎంసీల నీరు ఉండగా.. ఈసారి 530 టీఎంసీలు మాత్రమే ఉందని తెలిపారు. భూగర్భ జలాలు కూడా తగ్గుతున్న నేపథ్యంలో నీటి నిర్వహణపై ప్రత్యేక దృష్టి పెట్టాలని ప్రజాప్రతినిధులకు సూచించారు.

ఎల్‌నినోను సమర్థంగా ఎదుర్కోవాలి

ఎల్‌నినో ప్రభావాన్ని సమర్థంగా ఎదుర్కొనేందుకు ప్రభుత్వం, ప్రజాప్రతినిధులు, అధికారులు సమన్వయంతో పనిచేయాలని చంద్రబాబు పిలుపునిచ్చారు. తాగునీటికి మొదటి ప్రాధాన్యత ఇస్తూనే పశువులకు, పరిశ్రమలకు, ఉద్యాన పంటలకు నీటి కొరత లేకుండా చర్యలు చేపట్టాలని సూచించారు.

పట్టిసీమ ద్వారా 36 టీఎంసీల నీటిని ప్రకాశం బ్యారేజీకి తరలించామని, ఈ సీజన్‌లో కృష్ణా డెల్టా ప్రాంతానికి మరో 71 టీఎంసీల నీరు అవసరమని తెలిపారు. రైతులను ప్రత్యామ్నాయ పంటల వైపు ప్రోత్సహించాలని, పీఎండీఎస్‌ విధానాన్ని విస్తృతంగా అమలు చేయాలని సూచించారు.

మూడు ప్రాంతాల అభివృద్ధికి ప్రణాళికలు

ఉత్తరాంధ్ర, కోస్తాంధ్ర, రాయలసీమ మూడు ప్రాంతాల సమగ్ర అభివృద్ధే ప్రభుత్వ లక్ష్యమని సీఎం తెలిపారు. నియోజకవర్గ స్థాయి అభివృద్ధిని రాష్ట్ర స్థూల అభివృద్ధితో అనుసంధానం చేయాలని ప్రజాప్రతినిధులకు సూచించారు.

డేటా సెంటర్ల ద్వారా భారీగా ఉద్యోగ, ఉపాధి అవకాశాలు వస్తాయని, వాటికి అవసరమైన నీటి లభ్యత విషయంలో ఎలాంటి సమస్య ఉండదని చెప్పారు. రాష్ట్రాన్ని దేశంలోనే నంబర్‌ వన్‌గా అభివృద్ధి చేయడమే లక్ష్యమని చంద్రబాబు స్పష్టం చేశారు.

సాగునీటి ప్రాజెక్టులపై గత ప్రభుత్వాల నిర్లక్ష్యాన్ని ప్రజలకు వివరించడంతో పాటు.. ప్రస్తుత ప్రభుత్వం చేపడుతున్న అభివృద్ధి కార్యక్రమాలను క్షేత్రస్థాయిలోకి తీసుకెళ్లాలని ఎమ్మెల్యేలు, ఎంపీలు, ఇన్‌చార్జి మంత్రులకు సూచించారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here