తమిళనాడు ప్రభుత్వ ఉద్యోగులకు 15 రోజుల పితృత్వ సెలవులు

CM Vijay Announces, TN Introduces 15 Days of Paternity Leave For Married Male Govt Employees

తమిళనాడు రాష్ట్ర ప్రభుత్వంలోని వివాహిత పురుష ఉద్యోగులకు 15 రోజుల పితృత్వ సెలవులను (Paternity Leave) మంజూరు చేస్తూ ముఖ్యమంత్రి సీ. జోసెఫ్ విజయ్ గురువారం (నవంబర్ 26) కీలక ప్రకటన చేశారు. తమిళనాడు చరిత్రలో తొలిసారిగా పురుష ప్రభుత్వ ఉద్యోగులకు పితృత్వ సెలవుల సౌకర్యాన్ని అందుబాటులోకి తీసుకువస్తున్నట్లు అధికారిక ప్రకటనలో వెల్లడించారు.

ప్రభుత్వ ఉద్యోగుల నుంచి వచ్చిన అభ్యర్థనలను సానుకూలంగా పరిశీలించి ఈ నిర్ణయం తీసుకున్నట్లు ప్రభుత్వం తెలిపింది. నూతన నిబంధనల ప్రకారం, అర్హులైన వివాహిత పురుష ఉద్యోగులు బిడ్డ జననానికి 15 రోజుల ముందు లేదా బిడ్డ పుట్టిన తేదీ నుంచి ఆరు నెలల లోపు ఈ 15 రోజుల సెలవులను వినియోగించుకోవచ్చు.

బిడ్డ జనన సమయం తల్లి, నవజాత శిశువు ఇద్దరికీ అత్యంత కీలకమైనదని, ఆ సమయంలో తల్లికి శారీరక, మానసిక తోడ్పాటు అందించడంతో పాటు శిశువు సంరక్షణలో తండ్రి భాగస్వామ్యం ఎంతో అవసరమని రాష్ట్ర ప్రభుత్వం పేర్కొంది.

తమిళనాడు ప్రభుత్వంలో పనిచేస్తున్న మహిళా ఉద్యోగులకు ప్రస్తుతం 365 రోజుల (సంవత్సరం) ప్రసూతి సెలవులు (Maternity Leave) అందుబాటులో ఉండగా, ఇప్పుడు పురుష ఉద్యోగులకు కూడా పితృత్వ సెలవులు ప్రవేశపెట్టడం కుటుంబ బాధ్యతల సమతుల్యత దిశగా ముఖ్యమైన అడుగుగా నిలిచింది.

దీని ద్వారా తండ్రులు కుటుంబ బాధ్యతల్లో మరింత చురుగ్గా పాల్గొనేందుకు, తల్లి-బిడ్డ ఆరోగ్యం, సంక్షేమానికి మద్దతుగా నిలిచేందుకు అవకాశం లభిస్తుందని అధికారులు తెలిపారు. తాజా ఉత్తర్వులు రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకే వర్తిస్తాయని, వారి సంక్షేమం కోసం ప్రభుత్వం తీసుకున్న ఈ నిర్ణయంపై ఉద్యోగ వర్గాల్లో హర్షం వ్యక్తమవుతోంది.

ఈ నిర్ణయంతో కేరళ, ఉత్తరప్రదేశ్, హరియాణా, సిక్కిం వంటి రాష్ట్రాల సరసన తమిళనాడు కూడా న్నట్టయింది. ఆయా రాష్ట్రాల్లో ప్రభుత్వ ఉద్యోగులకు 10 నుంచి 30 రోజుల వరకు పితృత్వ సెలవుల సౌకర్యం అమల్లో ఉంది.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here