కేంద్రమంత్రి కిషన్ రెడ్డి పాదయాత్ర రెండో రోజు.. మద్దతు తెలిపిన మెగాస్టార్ చిరంజీవి

Megastar Chiranjeevi Backs Union Minister Kishan Reddy's Nasha Mukt Bharat Drive

2029 నాటికి ‘డ్రగ్ ఫ్రీ ఇండియా’ నిర్మాణమే లక్ష్యంగా కేంద్ర ప్రభుత్వం సంకల్పించగా, డ్రగ్స్ రహిత సమాజం కోసం ప్రధాని నరేంద్ర మోదీ ఇచ్చిన పిలుపునకు అనుగుణంగా కేంద్ర మంత్రి జి. కిషన్ రెడ్డి హైదరాబాద్‌లో ‘నషా ముక్త్ భారత్’ పాదయాత్ర నిర్వహిస్తున్నారు. బుధవారం అంబర్‌పేటలో ప్రారంభమైన ఈ మూడు రోజుల పాదయాత్ర గురువారం (నవంబర్ 26) రెండో రోజుకు చేరుకుంది. రెండో రోజు యాత్ర ముషీరాబాద్ నుంచి అమీర్‌పేట్ వైపు కొనసాగుతుండగా, శుక్రవారం (నవంబర్ 27) మూడో రోజు జూబ్లీహిల్స్‌లో పాదయాత్ర ముగియనుంది.

అయితే, కేంద్రమంత్రి పాదయాత్రకు పలువురు సినీ ప్రముఖులు తమ మద్దతును తెలియజేస్తున్నారు. నిన్నటి ప్రారంభ కార్యక్రమానికి స్టార్ హీరో విక్టరీ వెంకటేష్ హాజరై సంఘీభావం తెలిపిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో తాజాగా దీనిపై టాలీవుడ్ అగ్ర నటుడు, మెగాస్టార్ చిరంజీవి కూడా తన పూర్తి మద్దతు ప్రకటించారు. సోషల్ మీడియా వేదికగా ప్రత్యేక వీడియో సందేశం విడుదల చేశారు.

అందులో కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి నిర్వహిస్తున్న నషా ముక్త్ భారత్ యాత్రలో యువత పెద్ద ఎత్తున పాల్గొనాలని, మత్తుపదార్థాలకు దూరంగా ఉండి ఉజ్వల భవిష్యత్తును నిర్మించుకోవాలని పిలుపునిచ్చారు. భవిష్యత్ తరాల భద్రత కోసం సాగుతున్న ఈ మహత్తర ప్రజా ఉద్యమంలో ప్రతి ఒక్కరూ భాగస్వాములు కావాలని ఆయన కోరారు.

సమాజాన్ని, ముఖ్యంగా యువత భవిష్యత్తును నాశనం చేస్తున్న డ్రగ్స్ మహమ్మారిని తరిమికొట్టాల్సిన అవసరం ఉందని చిరంజీవి స్పష్టం చేశారు. అలాగే, ఇటీవల కిషన్ రెడ్డితో కలిసి యాత్రకు సంబంధించిన ప్రత్యేక టీ-షర్టులను ఆవిష్కరించిన సందర్భంగా కూడా చిరంజీవి మాట్లాడుతూ, ఇలాంటి సామాజిక చైతన్య కార్యక్రమాలకు తాము ఎల్లప్పుడూ ముందుండి చేయి కలుపుతామని, ఈ ఉద్యమంలో యూత్ అంతా భాగస్వామ్యం కావాలని మరోసారి ఉద్ఘాటించారు.

కాగా, మాదకద్రవ్యాల వినియోగం వల్ల కలిగే అనర్థాలపై యువత, విద్యార్థుల్లో విస్తృత అవగాహన కల్పించి, రాబోయే తరాలను మత్తు ఉచ్చు నుంచి కాపాడటమే ప్రధాన లక్ష్యంగా కిషన్ రెడ్డి ఈ పాదయాత్ర చేస్తున్నారు.

నగరంలోని ప్రముఖ ప్రాంతాలు, కూడళ్ల మీదుగా సాగుతున్న ఈ యాత్రలో విద్యార్థులు, యువత, స్థానిక ప్రజలు పెద్ద సంఖ్యలో పాల్గొంటూ మద్దతు తెలుపుతున్నారు. 2029 నాటికి దేశాన్ని డ్రగ్స్ రహిత భారత్‌గా తీర్చిదిద్దే దిశగా ఈ ప్రచార ర్యాలీ కీలక ముందడుగుగా నిలుస్తోందని రాజకీయ విశ్లేషకులు, పలువురు సామాజికవేత్తలు పేర్కొంటున్నారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here