పశ్చిమ గోదావరి జిల్లా మొగల్తూరులో ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు పర్యటించారు. కూటమి ప్రభుత్వం అమలు చేస్తున్న ఎన్టీఆర్ భరోసా పింఛన్ల పంపిణీ కార్యక్రమంలో భాగంగా ఆయన స్వయంగా లబ్ధిదారుల ఇళ్లకు వెళ్లి పింఛన్ సొమ్మును అందజేశారు.
గోదావరి గట్టు సమీపంలోని వార్డులు, పొన్నపల్లి ప్రాంతాల్లో పర్యటించిన సీఎం.. వృద్ధులు, దివ్యాంగులు, ఇతర పింఛన్ లబ్ధిదారులతో ఆత్మీయంగా మాట్లాడారు. వారి కుటుంబ పరిస్థితులు, సంక్షేమ పథకాల ద్వారా అందుతున్న ప్రయోజనాలను అడిగి తెలుసుకున్నారు.
లబ్ధిదారుల ఇళ్లకే వెళ్లిన సీఎం
ఎన్టీఆర్ భరోసా పింఛన్లను అర్హులైన ప్రతి ఒక్కరికీ సకాలంలో అందించడమే ప్రభుత్వ లక్ష్యమని చంద్రబాబు తెలిపారు. పింఛన్ల పంపిణీలో పారదర్శకతకు ప్రాధాన్యం ఇస్తున్నామని, అర్హులైన లబ్ధిదారులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా సంక్షేమ ఫలాలు అందేలా చర్యలు తీసుకుంటున్నామని పేర్కొన్నారు.
ప్రజా వేదికలో సీఎం చంద్రబాబు
పింఛన్ల పంపిణీ అనంతరం మొగల్తూరులో నిర్వహించిన ప్రజా వేదిక కార్యక్రమంలో సీఎం పాల్గొన్నారు. ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలు, అభివృద్ధి కార్యక్రమాలపై ప్రజలకు వివరించారు. అనంతరం పశ్చిమ గోదావరి జిల్లా కూటమి నాయకులు, కార్యకర్తలతో సమావేశమై పలు అంశాలపై చర్చించారు.
ప్రజలకు అందుబాటులో ఉంటూ ప్రభుత్వ పథకాల ప్రయోజనాలను క్షేత్రస్థాయిలో ప్రతి అర్హుడికి చేరేలా పనిచేయాలని పార్టీ శ్రేణులకు సూచించారు. ఈ పర్యటనలో జిల్లా కలెక్టర్ పి. నాగరాణి, స్థానిక ప్రజాప్రతినిధులు, అధికారులు పాల్గొన్నారు.







































