తెలంగాణలో పలు ప్రాంతాల్లో విద్యుత్ సరఫరాకు అంతరాయాలు ఏర్పడుతుండటంపై ముఖ్యమంత్రి ఎ. రేవంత్ రెడ్డి తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. కోట్లాది రూపాయలు ఖర్చు చేస్తున్నప్పటికీ పరిస్థితుల్లో మార్పు రాకపోవడంపై ఇంధన శాఖ అధికారులను నిలదీశారు. రైతులకు సాగునీరు, విద్యుత్ సక్రమంగా అందించాలని పదేపదే సూచించినా క్షేత్రస్థాయిలో ఆశించిన ఫలితాలు కనిపించకపోవడంపై ఆగ్రహం వ్యక్తం చేశారు.
నైని, మహానది తదితర ప్రాంతాల నుంచి తగినంత బొగ్గు అందుబాటులో ఉన్నప్పటికీ విద్యుత్ ఉత్పత్తిని ఎందుకు పెంచడం లేదని అధికారులను సీఎం ప్రశ్నించారు. యాదాద్రి థర్మల్ పవర్ ప్లాంట్ పూర్తి సామర్థ్యంతో విద్యుత్ ఉత్పత్తి చేయకపోవడానికి కారణాలేమిటని ఆరా తీశారు. విద్యుత్ ఉత్పత్తి, సరఫరా విషయంలో నిర్లక్ష్యాన్ని సహించబోమని స్పష్టం చేశారు.
విధుల పట్ల అలసత్వం ప్రదర్శిస్తే ఇంధన శాఖ స్పెషల్ చీఫ్ సెక్రటరీ, జెన్కో సీఎండీతో పాటు సంబంధిత ఐఏఎస్ అధికారులపైనా సస్పెన్షన్ చర్యలు తీసుకోవాల్సి వస్తుందని హెచ్చరించారు.
రానున్న రోజులు వ్యవసాయ రంగానికి కీలకమైనవని సీఎం పేర్కొన్నారు. రైతులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా నాణ్యమైన విద్యుత్ను నిరంతరంగా అందించాలని ఆదేశించారు. రోజువారీ వివరణలతో సరిపెట్టకుండా, వచ్చే ఏడాది జూన్ వరకు ఎదురయ్యే అవసరాలను అంచనా వేసి సమగ్ర కార్యాచరణ ప్రణాళిక రూపొందించాలని అధికారులకు స్పష్టం చేశారు.










































