కేసీఆర్ అసెంబ్లీకి రాకుండా 34 నెలల్లో రూ.2 కోట్ల జీతం తీసుకున్నారు – సీఎం రేవంత్ రెడ్డి

CM Revanth Reddy Criticises BRS Chief KCR Staying Away From Assembly While Drawing Salary

ధనిక రాష్ట్రాన్ని అప్పగిస్తే పదేళ్లలో బీఆర్ఎస్ అధినేత, మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ రూ.8 లక్షల కోట్ల అప్పులు చేశారని తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తీవ్రస్థాయిలో విమర్శించారు. నాగర్ కర్నూలు జిల్లా అచ్చంపేటలో జరిగిన బహిరంగ సభలో ఆయన మాట్లాడుతూ, గత పాలనలో రాష్ట్రం దెబ్బతిందని, తమ ప్రభుత్వం రాష్ట్రాన్ని అభివృద్ధి వైపు నడిపిస్తోందని చెప్పారు.

రైతుబంధుకు రూ.36 వేల కోట్లు, వడ్ల కొనుగోలుకు రూ.90 వేల కోట్లు ఖర్చు చేశామని, ప్రభుత్వ ఉద్యోగులకు సకాలంలో వేతనాలు చెల్లిస్తున్నామని పేర్కొన్నారు. అలాగే 75 వేల ఉద్యోగాలు ఇచ్చామని, ఏడాదిలో మరో 25 వేల ఉద్యోగాలు ఇస్తామని, కోటి మంది మహిళలకు ఇందిరమ్మ చీరలు అందిస్తున్నామని తెలిపారు.

కృష్ణా జలాల్లో తెలంగాణకు అన్యాయం జరిగిందని, పాలమూరు ప్రాజెక్టులను పదేళ్లలో ఎందుకు పూర్తి చేయలేదని బీఆర్ఎస్ నేతలను రేవంత్ రెడ్డి ప్రశ్నించారు. ఏపీ రోజుకు 11 టీఎంసీల నీటిని తరలించుకుపోతోందని ఆరోపిస్తూ, గత పాలకుల వైఖరిపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. కేటీఆర్, హరీష్ రావు, సంతోష్ రావులపై ఘాటు వ్యాఖ్యలు చేసిన ఆయన, బీఆర్ఎస్ నేతల ఆస్తులు, రాజకీయ వైఖరిని తప్పుబట్టారు.

రెండుసార్లు అధికారం అనుభవించిన కేసీఆర్ ఇప్పుడు ఫాంహౌస్‌కే పరిమితమయ్యారని, ఈ 34 నెలల్లో రూ.2 కోట్ల వేతనం తీసుకున్నప్పటికీ అసెంబ్లీకి రావడం లేదని రేవంత్ రెడ్డి విమర్శించారు. విధులకు హాజరుకాని పోలీసులపై చర్యలు తీసుకున్నట్లే అసెంబ్లీకి రాని వారిపై ఏం చర్యలు తీసుకోవాలని ప్రశ్నించారు. మరోవైపు తెలంగాణలో బీజేపీకి భవిష్యత్తు లేదని, రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు సొంత నియోజకవర్గంలో గెలవలేకపోయారని విమర్శించారు.

పాలమూరు నేలను కృష్ణా జలాలతో తడుపుతానని, ఈ ప్రాంత అభివృద్ధి కోసం తన రక్తం ధారపోస్తానని ముఖ్యమంత్రి స్పష్టం చేశారు. అచ్చంపేట బిడ్డగా పాలమూరును తెలంగాణకే ఆదర్శంగా తీర్చిదిద్దుతానని చెప్పారు. ప్రజాస్వామ్యంలో ఓటు హక్కు శక్తిని గుర్తు చేస్తూ, ఇందిరా గాంధీ స్ఫూర్తితో సంక్షేమ కార్యక్రమాలు, విద్యా వ్యవస్థలో మార్పులు తీసుకొస్తున్నామని పేర్కొన్నారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here