వాహనదారులకు షాక్.. మోటారు వాహనాల చట్టంలో కేంద్రం కీలక మార్పులు

Centre Plans Key Changes in Motor Vehicles Act, Likely To No Fuel For Uninsured Vehicles at Petrol Pumps

బీమా లేకుండా వాహనాలను రోడ్లపై నడిపేవారికి, తరచూ ట్రాఫిక్ నిబంధనలను ఉల్లంఘించే వాహనదారులకు కళ్లెం వేసేందుకు కేంద్ర ప్రభుత్వం కఠిన చర్యల దిశగా కసరత్తు చేస్తోంది. ట్రాఫిక్ నియమాలను ఎంత ఎక్కువగా ఉల్లంఘిస్తే ఆ వాహన బీమా ప్రీమియం అంతగా పెరిగేలా మోటారు వాహనాల చట్టంలో మార్పులు తీసుకురావాలని కేంద్ర రోడ్డు రవాణా సంస్థ యోచిస్తున్నట్లు జాతీయ మీడియా నివేదించింది.

దీనితో పాటు బీమా లేని కార్లు, ద్విచక్రవాహనాలకు పెట్రోల్ బంకుల్లో ఇంధనం నింపకుండా నిషేధించే అంశాన్ని కూడా పరిశీలిస్తోంది. ఈ విధానంలో భాగంగా పెట్రోల్ బంకుల్లో ఆటోమేటెడ్ నంబర్ ప్లేట్ రికగ్నిషన్ (ఏఎన్‌పీఆర్ – ANPR) వ్యవస్థను ప్రవేశపెట్టాలని నిర్ణయించారు.

వాహనం ఇంధనం కోసం బంకుకు రాగానే ప్రత్యేక కెమెరాలు నంబర్ ప్లేటును రికార్డు చేసి కంప్యూటర్‌కు పంపుతాయి. ఆ కంప్యూటర్ వాహనాల డేటాబేస్‌ను తక్షణమే పరిశీలించి సదరు వాహనానికి చెల్లుబాటు అయ్యే బీమా ఉందో లేదో గుర్తిస్తుంది; బీమా ఉంటేనే ఇంధనం నింపేలా ఈ వ్యవస్థ పనిచేస్తుంది.

రోడ్డు భద్రతపై సుప్రీంకోర్టు నియమించిన కమిటీ ఇటీవల బీమా లేని వాహనాలకు ఇంధనం అందకుండా చర్యలు తీసుకోవాలని కేంద్ర పెట్రోలియం, రోడ్డు రవాణా శాఖలకు సూచించింది. తొలుత దీన్ని పైలట్ ప్రాజెక్టుగా అమలు చేయాలని కోరడంతో, హరియాణా, ఉత్తరప్రదేశ్‌లలో 5 చొప్పున పెట్రోల్ బంకుల్లో ఏఎన్‌పీఆర్ వ్యవస్థను ఏర్పాటు చేసి పరీక్షించాలని నిర్ణయించారు.

ఈ నిబంధనలను ఎప్పటి నుంచి అమలులోకి తీసుకురావాలనే అంశంపై ఇంకా తుది నిర్ణయం తీసుకోనప్పటికీ, వాహన యజమానులు, డ్రైవర్లలో జవాబుదారీతనాన్ని పెంచేలా కచ్చితమైన చర్యలు తీసుకోవాలని ప్రభుత్వం సంకల్పించింది. పైలట్ ప్రాజెక్టు ఫలితాలను బట్టి భవిష్యత్తులో దీన్ని విస్తరించే అవకాశాలు ఉన్నాయి.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here