2 రోజుల్లో మరో 10 బస్తీ దవాఖానాలు ప్రారంభం – మంత్రి తలసాని

basti dawakhanas, Basti Dawakhanas In Telangana, Hyderabad new basti dawakhanas, Minister Talasani Srinivas Yadav, Minister Talasani Srinivas Yadav Review Meeting with Officials on Basti Dawakhanas, new basti dawakhanas, talasani srinivas yadav

ప్రభుత్వ వైద్యాన్ని ప్రజలకు మరింత చేరువ చేసేందుకు ప్రారంభించిన బస్తీ దవాఖానాలను బలోపేతం చేసేందుకు చర్యలు తీసుకుంటామని పశుసంవర్ధక, మత్స్య, పాడి పరిశ్రమ అభివృద్ధి, సినిమాటోగ్రఫీ శాఖల మంత్రీ తలసాని శ్రీనివాస్ యాదవ్ వెల్లడించారు. ఆగస్టు 5, బుధవారం నాడు మాసాబ్ ట్యాంక్ లోని తన కార్యాలయంలో హైదరాబాద్ జిల్లా పరిధిలోని అర్బన్ ప్రైమరీ హెల్త్ సెంటర్ లు, బస్తీ దవాఖానాల పనితీరు, ప్రజలకు అందుతున్న వైద్య సేవలు తదితర అంశాలపై మంత్రి సమీక్ష నిర్వహించారు. ఈ సమావేశంలో జిల్లా కలెక్టర్ శ్వేతా మహంతి, జీహెచ్ఎంసీ కమిషనర్ లోకేష్, అదనపు కమిషనర్ సంతోష్, జిల్లా వైద్యాధికారి వెంకట్రావ్, టిఎస్ఎంఐడిసి ఈఈ చలపతి, ఇతర అధికారులు పాల్గొన్నారు.

ఈ సందర్బంగా మంత్రి తలసాని మాట్లాడుతూ డిల్లీలో మొహాల్ల క్లినిక్ ల పనితీరును పరిశీలించిన ప్రభుత్వం హైదరాబాద్ లో ఏప్రిల్ 2018 లో బస్తీ దవాఖానా పేరుతో 2 దవాఖానాల ను ప్రారంభించిందని తెలిపారు. జీహెచ్ఎంసీ పరిధిలో డివిజన్ కు 2 చొప్పున బస్తీ దవాఖానాలకు ఏర్పాటు చేయాలని మున్సిపల్ శాఖ మంత్రి కల్వకుంట్ల తారక రామారావు ఆదేశాల ప్రకారం హైదరాబాద్ జిల్లాలో 168 బస్తీ దావాఖానా లను ఏర్పాటు చేయాలని నిర్ణయించినట్లు తెలిపారు. 95 బస్తీ దవాఖానల ద్వారా ప్రజలకు వైద్య సేవలు అందుతున్నాయని, 2 రోజుల్లో మరో 10 బస్తీ దవాఖానలను ప్రారంభించనున్నట్లు చెప్పారు. బస్తీ దవాఖానాల ద్వారా అందుతున్న వైద్య సేవలతో ప్రజలు ఎంతో ఆనందం వ్యక్తం చేస్తున్నారని పేర్కొన్నారు. జీహెచ్ఎంసీ పరిధిలో సుమారు 2200 కమిటీ హాల్స్ ఉన్నాయని, అందులో కొన్ని ప్రైవేట్ వ్యక్తుల ఆధీనంలో ఉన్నాయని, వాటిని వెంటనే స్వాధీనం చేసుకునేలా జోనల్ కమిషనర్ లకు ఆదేశాలు జారీ చేయాలని, కమిటీ హాల్ ల లోనే బస్తీ దవాఖానా లు కొనసాగే విధంగా చర్యలు తీసుకోవాలని కమిషనర్ ను ఆదేశించారు. అవసరమైన చోట్ల బస్తీ దవాఖానాల కోసం మొదటి అంతస్తు నిర్మాణాలను చేపట్టేందుకు ప్రతిపాదనలు సిద్దం చేయాలని ఆదేశించారు.

బస్తీ దవాఖానా సిబ్బందికి టాయిలెట్స్ వంటి సౌకర్యాలు కల్పించేలా చూడాలని అన్నారు. బస్తీ దవాఖానా లకు వచ్చే రోగుల సంఖ్య పెరుగుతుందని, ఆశించిన సత్ఫలితాలు వస్తున్నాయని కలెక్టర్ పేర్కొన్నారు. ప్రస్తుతం బస్తీ దవాఖానాలలో మౌలిక వసతులు, పర్నిచర్ కోసం లక్షా 30 వేల రూపాయలు ఇస్త్తున్నారని, అవి సరిపోనందున 2 లక్షలకు పెంచేలా చూడాలని కలెక్టర్ మంత్రిని కోరారు. ప్రస్తుతం 85 అర్బన్ ప్రైమరీ హెల్త్ సెంటర్ లు పనిచేస్తున్నాయని, వీటిలో కొన్ని అద్దె భవనాలలో, మరికొన్ని ఒకే చోట ఒకే భవనంలో 2 నుండి 3 సెంటర్ లు నిర్వహిస్తున్నట్లు సంబంధిత అధికారులు మంత్రి దృష్టికి తీసుకొచ్చారు. దీంతో స్పందించిన మంత్రి అర్బన్ ప్రైమరీ హెల్త్ సెంటర్ ల ఏర్పాటు కు అవసరమైన స్థలాలు గుర్తించాలని జీహెచ్ఎంసీ కమిషనర్, కలెక్టర్, జిల్లా వైద్యాదికారిని ఆదేశించారు. ప్రస్తుతం ఉన్న అంబులెన్స్ లు అవసాన దశలో ఉన్నాయని మంత్రికి అధికారులు వివరించగా, వాటి స్థానంలో నూతన అంబులెన్స్ లను ప్రభుత్వం నుండి కాని, దాతల సహకారంతో కాని ఏర్పాటు చేసేలా చూస్తానని మంత్రి తలసాని వివరించారు.

బస్తీ దవాఖానాలు, అర్బన్ ప్రైమరీ హెల్త్ సెంటర్ ల లో ఉన్న సమస్యలపై ఒక సమగ్ర నివేదిక రూపొందించి అందజేయాలని మంత్రి అన్నారు. ప్రజలకు వైద్య సేవలు అందించేందుకు ఏర్పాటు చేసిన బస్తీ దవాఖానాల నిర్వహణకు ప్రజలు కూడా సహకరించాలని మంత్రి సూచించారు. ప్రైవేట్ ఆసుపత్రుల నిర్వహకులు కరోనా చికిత్స కోసం అధికమొత్తంలో ఫీజులు వసూలు చేస్తున్నారని పిర్యాదులు వస్తున్న తరుణంలో అలాంటి ఆసుపత్రుల పట్ల కఠినంగా వ్యవహరించాలని ఆదేశించారు. కరోనా టెస్ట్ లు, చికిత్స విషయాలలో అప్రమత్తంగా ఉండాలని సూచించారు. వర్షాకాలంలో సీజనల్ వ్యాధుల భారిన పడకుండా తీసుకోవాల్సిన జాగ్రత్తలపై ప్రజలకు అవగాహన కల్పించాలని మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ చెప్పారు.

మ్యాంగో న్యూస్ యాప్ లింక్స్:

గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN

ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJu

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

14 − four =