నేటి నుంచే మహిళల టీ20 ప్రపంచకప్ సమరం.. భారత్‌-పాక్‌ మధ్య ఆదివారం హై వోల్టేజ్ మ్యాచ్

ICC Women's T20 World Cup 2026 Begins Today, Team India To Face Arch-rivals Pakistan on Sunday

అంతర్జాతీయ క్రికెట్ కౌన్సిల్ (ICC) అత్యంత ప్రతిష్టాత్మకంగా నిర్వహించే మహిళల టీ20 ప్రపంచకప్ – 2026 సమరానికి కౌంట్‌డౌన్ ముగిసింది. ఇంగ్లాండ్ వేదికగా శుక్రవారం (జూన్ 12) నుంచి ఈ పొట్టి కప్పు క్రికెట్ పండుగ అధికారికంగా ప్రారంభం కానుంది. గత ఏడాది సొంతగడ్డపై జరిగిన వన్డే ప్రపంచకప్‌లో అద్భుత ప్రదర్శనతో విశ్వవిజేతగా నిలిచిన భారత మహిళల జట్టు, ఈసారి టీ20 ప్రపంచకప్‌లోనూ అదే జోరును కొనసాగించి మరో ఐసీసీ ట్రోఫీని ముద్దాడాలనే పట్టుదలతో బ్రిటీష్ గడ్డపై అడుగుపెట్టింది. ఈ సుదీర్ఘ మెగా టోర్నమెంట్‌లో మొత్తం 12 దేశాల జట్లు విశ్వవిజేత కిరీటం కోసం హోరాహోరీగా తలపడనున్నాయి.

గ్రూపుల విభజన – సెమీస్ చేరాలంటే కఠిన సవాలే

టోర్నీ ఫార్మాట్:

  • టోర్నీలో పాల్గొంటున్న 12 జట్లను లీగ్ దశ కోసం రెండు గ్రూపులుగా విభజించారు. గ్రూప్-1లో భారత్, పాకిస్థాన్, ఆస్ట్రేలియా, దక్షిణాఫ్రికా, బంగ్లాదేశ్, నెదర్లాండ్స్ జట్లు ఉన్నాయి.

  • గ్రూప్-2లో ఇంగ్లాండ్, శ్రీలంక, న్యూజిలాండ్, వెస్టిండీస్, ఐర్లాండ్, స్కాట్లాండ్ జట్లు చోటు దక్కించుకున్నాయి.

  • రౌండ్ రాబిన్ పద్ధతిలో జరిగే ఈ లీగ్ దశలో ప్రతి జట్టు తన గ్రూప్‌లోని మిగతా ఐదు జట్లతో ఒక్కో మ్యాచ్ ఆడుతుంది. రెండు గ్రూపుల్లో అగ్రస్థానాల్లో నిలిచే మొదటి రెండు జట్లు నేరుగా సెమీఫైనల్స్‌కు అర్హత సాధిస్తాయి.

  • మొత్తం 33 మ్యాచ్‌లతో సాగనున్న ఈ లీగ్ దశ జూన్ 29తో ముగుస్తుంది. జూన్ 30న మొదటి సెమీస్, జూలై 2న రెండో సెమీస్ మరియు జూలై 5న ప్రతిష్టాత్మకమైన ఫైనల్ మ్యాచ్ జరగనుంది.

  • భారత్ ఉన్న గ్రూప్ కొంచెం కఠినంగా ఉండటంతో ఆస్ట్రేలియా, దక్షిణాఫ్రికా లాంటి బలమైన జట్లలో ఒకదానిని వెనక్కి నెడితేనే హర్మన్‌ప్రీత్ సేనకు సెమీస్ లైన్ క్లియర్ అవుతుంది.

ఆరంభ మ్యాచ్‌:

  • ఇంగ్లాండ్‌లోని బర్మింగ్‌హామ్ వేదికగా శుక్రవారం రాత్రి 11 గంటలకు ప్రారంభం కానున్న మెగా టోర్నీ తొలి లీగ్ మ్యాచ్‌లో ఆతిథ్య ఇంగ్లాండ్ జట్టుతో శ్రీలంక తలపడనుంది.

  • ఇంగ్లాండ్‌కు నాట్ సీవర్ బ్రంట్ సారథ్యం వహిస్తుండగా, చమరి ఆటపట్టు నేతృత్వంలోని శ్రీలంక జట్టు గట్టి పోటీనిచ్చేందుకు సిద్ధమైంది.

ఆదివారం పాకిస్థాన్‌తో భారత్ ఢీ

  • ఇక అత్యంత ఆసక్తికరమైన పోరులో భారత జట్టు ఆదివారం (జూన్ 14) తన తొలి లీగ్ మ్యాచ్‌లో చిరకాల ప్రత్యర్థి పాకిస్థాన్‌తో తలపడనుంది.

  • ఈ టోర్నీ మ్యాచ్‌లు భారత క్రీడాభిమానుల కోసం స్టార్ స్పోర్ట్స్ (Star Sports) ఛానళ్లలో ప్రత్యక్ష ప్రసారం కానున్నాయి.

సమష్టిగా సత్తా చాటనున్న భారత్ – తెలుగమ్మాయిలపై భారీ అంచనాలు

బలమైన జట్టుతో ఉమెన్ ఇన్ బ్లూ:

  • భారత జట్టు బ్యాటింగ్, బౌలింగ్ విభాగాల్లో సమతుల్యంగా కనిపిస్తోంది. స్టార్ ఓపెనర్ స్మృతి మంధాన, యువ సంచలనం షెఫాలి వర్మ ఇచ్చే పవర్‌ప్లే ఆరంభాలపై జట్టు విజయావకాశాలు ఆధారపడి ఉన్నాయి.

  • మిడిలార్డర్‌లో జెమీమా రోడ్రిగ్స్, కెప్టెన్ హర్మన్‌ప్రీత్ కౌర్, ఫినిషర్ రిచా ఘోష్, ఆల్‌రౌండర్ దీప్తి శర్మలతో బ్యాటింగ్ లైనప్ పటిష్టంగా ఉంది.

  • పేస్ విభాగంలో అనుభవజ్ఞురాలు రేణుక సింగ్‌తో పాటు డబ్ల్యూపీఎల్ స్టార్ నందిని శర్మ, తెలుగమ్మాయి అరుంధతి రెడ్డి, క్రాంతి గౌడ్ కీలకం కానున్నారు. ఇక స్పిన్ విభాగంలో కడపకు చెందిన తెలుగు క్రీడాకారిణి శ్రీ చరణిపై భారీ అంచనాలు ఉన్నాయి. శ్రేయాంక పాటిల్, రాధా యాదవ్ కూడా స్పిన్ వనరులుగా ఉన్నారు.

  • ఇప్పటివరకు జరిగిన 9 ప్రపంచకప్‌లలో ఆస్ట్రేలియా రికార్డు స్థాయిలో 6 సార్లు ఛాంపియన్‌గా నిలవగా.. ఇంగ్లాండ్, వెస్టిండీస్, న్యూజిలాండ్ (డిఫెండింగ్ ఛాంపియన్) జట్లు చెరోసారి కప్పు గెలిచాయి. భారత్ ఈసారి సమష్టిగా రాణిస్తే తొలిసారి పొట్టి కప్పును ముద్దాడటం అసాధ్యమేమీ కాదు.

భారత్‌ మ్యాచ్‌ల షెడ్యూల్‌

తేదీ         ప్రత్యర్థి         వేదిక

జూన్‌ 14 – పాకిస్థాన్‌ – బర్మింగ్‌హామ్‌

జూన్‌ 17 – నెదర్లాండ్స్‌ – లీడ్స్‌

జూన్‌ 21 – దక్షిణాఫ్రికా – మాంచెస్టర్‌

జూన్‌ 25 – బంగ్లాదేశ్‌ – మాంచెస్టర్‌

జూన్‌ 28 – ఆస్ర్టేలియా – లండన్‌

మ్యాచ్‌లన్నీ రాత్రి 7 గంటల నుంచి ప్రారంభం కానున్నాయి.

భారత జట్టు: హర్మన్‌ప్రీత్ కౌర్ (కెప్టెన్), స్మృతి మంధాన (వైస్ కెప్టెన్), షఫాలీ వర్మ, జెమీమా రోడ్రిగ్స్, భారతీ ఫుల్మాలి, దీప్తి శర్మ, రిచా ఘోష్(వికెట్ కీపర్), శ్రీ చరణి, యాస్తిక భాటియా (వికెట్ కీపర్), నందనీ శర్మ, అరుంధతి రెడ్డి, రేణుకా సింగ్, క్రాంతి గౌడ్, శ్రేయాంక పాటిల్, రాధా యాదవ్.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here