ఏపీపీఎస్సీ కీలక ప్రకటన.. గ్రూప్-1, గ్రూప్-2 ఉద్యోగాలకు నోటిఫికేషన్ తేదీ ఖరారు

APPSC To Issue Preliminary Notification For Job Recruitment in AP on Sep 15

ఆంధ్రప్రదేశ్‌లో ప్రభుత్వ ఉద్యోగాల కోసం ఎదురుచూస్తున్న నిరుద్యోగులకు శుభవార్త. వివిధ శాఖల్లో ఖాళీగా ఉన్న పోస్టుల భర్తీకి ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ (ఏపీపీఎస్సీ) సిద్ధమవుతోంది. ప్రత్యక్ష నియామకాలకు సంబంధించి ప్రిలిమినరీ/షెడ్యూల్ నోటిఫికేషన్‌ను 2026 సెప్టెంబర్ 15న విడుదల చేసేందుకు కమిషన్ ఏర్పాట్లు చేస్తోంది. ప్రభుత్వ ఉత్తర్వులు, కోర్టు తీర్పుల ఆధారంగా గత గ్రూప్-1 నియామకాల ఎంపిక జాబితాలో అవసరమైన మార్పులు చేయడంతో పాటు కొత్త నియామక ప్రక్రియకు శ్రీకారం చుట్టనుంది.

దాదాపు 899 పోస్టులకు నోటిఫికేషన్

తొలిదశలో వివిధ ప్రభుత్వ శాఖల్లో కలిపి సుమారు 899 ఖాళీలను భర్తీ చేసేందుకు APPSC షెడ్యూల్ సిద్ధం చేసినట్లు సమాచారం. ఇందులో గ్రూప్-1లో 149 పోస్టులు, గ్రూప్-2లో 750 ఖాళీలు ఉన్నట్లు తెలుస్తోంది. సెప్టెంబర్ 15న ప్రాథమిక నోటిఫికేషన్ విడుదల చేసిన అనంతరం అదే నెల మూడో వారం నుంచి అభ్యర్థుల నుంచి ఆన్‌లైన్ దరఖాస్తులను స్వీకరించే అవకాశం ఉంది.

గ్రూప్-1, గ్రూప్-2 పోస్టులకు సంబంధించిన స్క్రీనింగ్ టెస్ట్ (ప్రిలిమ్స్)ను అక్టోబర్ 18, 2026న నిర్వహించేలా ప్రాథమికంగా షెడ్యూల్ రూపొందించినట్లు సమాచారం. అయితే తుది తేదీలు అధికారిక నోటిఫికేషన్‌లో స్పష్టమవుతాయి.

గ్రూప్-1 ఎంపిక జాబితాలో మార్పులు

గతంలో వెలువడిన కోర్టు తీర్పులు, రోస్టర్ కేటాయింపు నిబంధనలను అనుసరించి గ్రూప్-1 సర్వీసుల ఎంపిక జాబితాను APPSC పునఃపరిశీలించింది. ఈ ప్రక్రియలో 87 మంది అభ్యర్థులకు తుది ఎంపిక స్థానాలను ఖరారు చేసినట్లు సమాచారం.

సవరించిన ఎంపికలో వివిధ కేటగిరీలకు చెందిన పోస్టులు ఉన్నాయి. వాటిలో డిప్యూటీ కలెక్టర్ (Executive) 9, అసిస్టెంట్ కమిషనర్ (State Tax) 17, డీఎస్పీ (Civil) 25, ప్రాంతీయ రవాణా అధికారి (RTO) 6, డిప్యూటీ రిజిస్ట్రార్ (Cooperative) 6 పోస్టులు ఉన్నాయి. వీటితో పాటు MPDO, ఇతర విభాగాలకు సంబంధించిన పోస్టులు కూడా ఉన్నాయి.

రిజర్వేషన్లకు ప్రాధాన్యం

ప్రభుత్వ నిబంధనలకు అనుగుణంగా కొత్త నియామకాల్లో రిజర్వేషన్ విధానాన్ని అమలు చేయనున్నారు. మహిళలకు 33⅓ శాతం హారిజాంటల్ రిజర్వేషన్ వర్తించనుంది. అలాగే BC, SC, ST, EWS వర్గాలకు నిబంధనల ప్రకారం వర్టికల్ రిజర్వేషన్లు అమలు చేస్తారు.

దివ్యాంగులకు (PwBD) 4 శాతం, మాజీ సైనికోద్యోగులకు 2 శాతం చొప్పున రిజర్వేషన్ వర్తించే అవకాశం ఉంది. ఖాళీల భర్తీలో ప్రభుత్వం అమలు చేస్తున్న రిజర్వేషన్ నిబంధనలను APPSC అనుసరించనుంది.

జోన్ల వారీగా గ్రూప్-2 పోస్టులు

గ్రూప్-1 పోస్టులు రాష్ట్రస్థాయి, మల్టీ-జోనల్ ప్రాతిపదికన భర్తీ చేయనుండగా.. గ్రూప్-2 ఖాళీలను జోన్ల వారీగా విభజించనున్నారు. ప్రాథమికంగా నాలుగు జోన్లలో ఖాళీల పంపిణీ ఈ విధంగా ఉన్నట్లు సమాచారం.

జోన్-1: శ్రీకాకుళం, విజయనగరం, విశాఖపట్నం, అల్లూరి, అనకాపల్లి, పార్వతీపురం జిల్లాలను కలుపుకుని సుమారు 185 పోస్టులు.

జోన్-2: తూర్పు గోదావరి, పశ్చిమ గోదావరి, కాకినాడ, కోనసీమ, ఏలూరు, కృష్ణా, ఎన్టీఆర్ జిల్లాల్లో సుమారు 210 ఖాళీలు.

జోన్-3: గుంటూరు, బాపట్ల, పల్నాడు, ప్రకాశం, నెల్లూరు జిల్లాలకు కలిపి సుమారు 175 పోస్టులు.

జోన్-4: చిత్తూరు, తిరుపతి, అన్నమయ్య, వైఎస్సార్ కడప, అనంతపురం, శ్రీసత్యసాయి, కర్నూలు, నంద్యాల జిల్లాల్లో సుమారు 180 ఖాళీలు ఉన్నట్లు ప్రాథమికంగా తెలుస్తోంది.

అయితే జిల్లాలు, జోన్ల వారీగా ఖాళీల సంఖ్యలో తుది మార్పులు ఉండే అవకాశం ఉంది. అధికారిక నోటిఫికేషన్‌లోనే పూర్తి వివరాలు వెల్లడికానున్నాయి.

సెప్టెంబర్ 15న పూర్తి వివరాలు

ఏపీపీఎస్సీ సెప్టెంబర్ 15న తన అధికారిక వెబ్‌సైట్ psc.ap.gov.inలో నోటిఫికేషన్, పోస్టుల వారీగా ఖాళీల వివరాలు, అర్హతలు, దరఖాస్తు విధానం, పరీక్షకు సంబంధించిన షెడ్యూల్‌ను అందుబాటులోకి తీసుకురానుంది. ఉద్యోగార్థులు అధికారిక ప్రకటన వెలువడిన తర్వాతే పోస్టుల సంఖ్య, పరీక్ష తేదీలు, ఇతర నిబంధనలను నిర్ధారించుకోవాలని అధికారులు సూచిస్తున్నారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here