అటవీశాఖ అధికారులపై సీఎం చంద్రబాబు తీవ్ర ఆగ్రహం

CM Chandrababu Fires on Forest Dept Officials Over Development Hurdles in AP

రాష్ట్రంలో అభివృద్ధి పనులకు అడ్డుతగులుతున్న అటవీశాఖ అధికారుల తీరుపై ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. అమరావతిలో జరిగిన కలెక్టర్ల సదస్సులో ఆయన మాట్లాడుతూ.. అటవీశాఖ అధికారుల ప్రవర్తన అసలు బాగాలేదని, ప్రజలకు ఇబ్బందులు కలిగిస్తే సహించేది లేదని స్పష్టమైన హెచ్చరికలు జారీ చేశారు.

అభివృద్ధికి అడ్డంకులుంటే ఎలా? అటవీ ప్రాంతాల్లో నివసించే గిరిజనులకు కనీస అవసరాలైన ఇళ్లు, నీళ్లు, రోడ్లు మరియు విద్యుత్ సౌకర్యాలు కల్పించడంలో అటవీశాఖ అధికారులు అడ్డంకులు సృష్టించడంపై సీఎం మండిపడ్డారు. “ఏళ్ల తరబడి అక్కడ నివసిస్తున్న వారికి మౌలిక వసతులు కల్పించకపోతే ఎలా? ఇలాంటి వైఖరి వల్లే తీవ్రవాదం వంటి సమస్యలు పుట్టుకొస్తాయి” అని ఆయన వ్యాఖ్యానించారు. ముఖ్యంగా పాపికొండలు, శ్రీశైలం వంటి ప్రాంతాల్లో పనులను అడ్డుకోవడంపై కలెక్టర్లు ఇచ్చిన ఫిర్యాదులపై ఆయన స్పందించారు.

నిర్లక్ష్యం వహిస్తే కఠిన చర్యలు: శ్రీశైలంలో భక్తులను నిలిపివేయడం వల్ల తొక్కిసలాట జరగడం, బద్వేలులో ఆలయ కూల్చివేత వంటి ఘటనలను ప్రస్తావిస్తూ అధికారులకు క్లాస్ పీకారు. పోలీసులు ‘పీపుల్స్ ఫ్రెండ్లీ’గా మారుతుంటే, అటవీశాఖలో మాత్రం మార్పు రావడం లేదని అసహనం వ్యక్తం చేశారు.

  • డీఎఫ్‌వోలు కలెక్టర్ల కింద పనిచేయాల్సిందే: జిల్లాలో కలెక్టర్ కంటే డీఎఫ్‌వో (DFO) పెద్దవాడు కాదని, కలెక్టర్ ఆదేశాలను పాటించాల్సిందేనని స్పష్టం చేశారు.

  • కౌన్సెలింగ్ అవసరమా?: పద్ధతి మార్చుకోకపోతే అధికారులను గంటల తరబడి కూర్చోబెట్టి నేనే కౌన్సెలింగ్ ఇవ్వాల్సి వస్తుందని పీసీసీఎఫ్ చలపతిరావును ఉద్దేశించి వ్యాఖ్యానించారు.

ప్రత్యామ్నాయ మార్గాలపై దృష్టి: అటవీ చట్టాల పేరుతో అభివృద్ధిని ఆపవద్దని, ఏదైనా సమస్య ఉంటే ప్రభుత్వం దృష్టికి తీసుకురావాలని సూచించారు. మైనింగ్ మరియు పారిశ్రామిక ప్రాజెక్టులకు అటవీ భూములకు బదులుగా ప్రత్యామ్నాయ భూములను అన్వేషించాలని అధికారులను ఆదేశించారు. ప్రకృతిని కాపాడుతూనే ప్రజా ప్రయోజనాల కోసం అభివృద్ధి పనులు వేగవంతం చేయాలని సీఎం దిశానిర్దేశం చేశారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here