రామజన్మభూమి ట్రస్టులో ప్రక్షాళన.. తాత్కాలిక ప్రధాన కార్యదర్శిగా కృష్ణ మోహన్ నియామకం

Ayodhya Ram Mandir Trust Appointed Krishna Mohan As Interim General Secretary

అయోధ్య శ్రీరామ జన్మభూమి తీర్థ్ క్షేత్ర ట్రస్టులో కీలక మార్పులు చోటుచేసుకున్నాయి. విరాళాల దుర్వినియోగం ఆరోపణల నేపథ్యంలో ట్రస్టు ప్రధాన కార్యదర్శి చంపత్ రాయ్, ట్రస్టు సభ్యుడు అనిల్ మిశ్ర సమర్పించిన రాజీనామాలను ట్రస్టు ఆమోదించింది. అనంతరం ట్రస్టు శాశ్వత సభ్యుడు కృష్ణ మోహన్‌ను తాత్కాలిక ప్రధాన కార్యదర్శిగా నియమిస్తూ కీలక నిర్ణయం తీసుకుంది.

సోమవారం అయోధ్యలోని ఆలయ ప్రాంగణంలోని అతిథి గృహంలో ట్రస్టు ఛైర్మన్ మహంత్ నృత్య గోపాల్ దాస్ అధ్యక్షతన జరిగిన సమావేశంలో ఈ నిర్ణయాలు తీసుకున్నారు. దాదాపు మూడు గంటల పాటు సాగిన సమావేశంలో ట్రస్టు భవిష్యత్ కార్యాచరణ, పరిపాలనలో పారదర్శకత పెంపు, విరాళాల వ్యవహారంపై పలు అంశాలపై విస్తృతంగా చర్చించారు.

కొత్త సీఈవో నియామకానికి కమిటీ

ట్రస్టు పరిపాలనను మరింత సమర్థవంతంగా నిర్వహించేందుకు ప్రత్యేకంగా చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ (సీఈవో) నియామక ప్రక్రియను ప్రారంభించాలని సమావేశంలో నిర్ణయించారు. ఇందుకోసం ముగ్గురు సభ్యులతో ప్రత్యేక కమిటీని ఏర్పాటు చేశారు. సీఈవో ఎంపిక ప్రక్రియను ఈ కమిటీ పర్యవేక్షించనుంది.

ట్రస్టు కోశాధికారి గోవింద్ గిరి మాట్లాడుతూ, విరాళాల దుర్వినియోగం అంశంపై మాజీ ప్రధాన కార్యదర్శి చంపత్ రాయ్ తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారని తెలిపారు. ఈ ఘటనకు బాధ్యులైన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని ఆయన కోరినట్లు వెల్లడించారు. ప్రస్తుతం ఈ వ్యవహారంపై ప్రత్యేక దర్యాప్తు బృందం (సిట్) విచారణ కొనసాగిస్తోందని, నివేదిక వచ్చిన అనంతరం ఈ నెల 22న జరిగే ట్రస్టు సమావేశంలో తదుపరి నిర్ణయాలు తీసుకోనున్నట్లు తెలిపారు.

ఎవరీ కృష్ణ మోహన్?

తాత్కాలిక ప్రధాన కార్యదర్శిగా నియమితులైన 73 ఏళ్ల కృష్ణ మోహన్ ఉత్తర్ ప్రదేశ్‌లోని హర్దోయ్‌కు చెందినవారు. రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్ (ఆర్‌ఎస్‌ఎస్) సీనియర్ సభ్యుడైన ఆయన, ఇండియన్ ఫారెస్ట్ సర్వీస్ (ఐఎఫ్‌ఎస్) మాజీ అధికారిగా కూడా పనిచేశారు. లక్నో విశ్వవిద్యాలయం నుంచి డిగ్రీ పూర్తి చేసిన ఆయన, కేంద్ర ప్రభుత్వ అణుశక్తి విభాగంలో సేవలందించిన అనంతరం మహారాష్ట్ర క్యాడర్ ఐఎఫ్‌ఎస్ అధికారిగా పదవీ విరమణ పొందారు. అనంతరం 2025లో శ్రీరామ జన్మభూమి తీర్థ్ క్షేత్ర ట్రస్టులో శాశ్వత సభ్యుడిగా చేరారు.

రూ.3,264 కోట్ల విరాళాలు.. రూ.2,370 కోట్లు నిర్మాణానికి ఖర్చు

ఈ సందర్భంగా ట్రస్టు ఆలయ నిర్మాణానికి సంబంధించిన ఆర్థిక వివరాలను కూడా వెల్లడించింది. 2020లో ప్రారంభమైన ‘నిధి సమర్పణ్ అభియాన్’ నుంచి ఇప్పటివరకు భక్తుల నుంచి మొత్తం రూ.3,264 కోట్ల విరాళాలు అందినట్లు తెలిపింది. ఇందులో ఆలయ నిర్మాణ పనుల కోసం రూ.2,370 కోట్లు ఖర్చు చేసినట్లు వెల్లడించింది.

అదనంగా ఆలయ నిర్వహణ కోసం రూ.391 కోట్లు వినియోగించగా, మిగిలిన నిధులన్నీ బ్యాంకు ఖాతాల్లో భద్రంగా ఉన్నాయని స్పష్టం చేసింది. ఆలయ ప్రారంభం తర్వాత భక్తులు సమర్పించిన కానుకల రూపంలో మరో రూ.582 కోట్లు అందినట్లు తెలిపిన ట్రస్టు, భక్తులు సమర్పించిన వెండి ఆభరణాలను వెండి కడ్డీలుగా మార్చి పూర్తి భద్రతతో భద్రపరిచినట్లు వెల్లడించింది.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here