ఆ జీవోను వెంటనే రద్దు చేయాలి.. సీఎం రేవంత్ రెడ్డికి కల్వకుంట్ల కవిత బహిరంగ లేఖ

Kalvakuntla Kavitha Open Letter to CM Revanth Reddy For Demanding Cancellation of GO 317

తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కి తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత బహిరంగ లేఖ రాశారు. వివాదాస్పద జీవో నం.317 వల్ల ఇబ్బందులు పడుతున్న ఉద్యోగులు, ఉపాధ్యాయులకు తక్షణమే ‘వన్‌టైమ్ రిలీఫ్’ కల్పించి, వారిని స్వస్థలాలకు బదిలీ చేయాలని ఆమె డిమాండ్ చేశారు. 2021లో జారీ అయిన ఈ జీవో కారణంగా వేలాది మంది తమ సొంత జిల్లాలకు దూరమై మానసిక క్షోభ అనుభవిస్తున్నారని తెలిపారు.

వారిని స్థానికత ఆధారంగా తిరిగి సొంత ప్రాంతాలకు పంపాల్సిన బాధ్యత ప్రభుత్వంపై ఉందని ఆమె లేఖలో పేర్కొన్నారు. గతంలో పీసీసీ అధ్యక్షుడి హోదాలో ఉన్నప్పుడు ఇదే అంశంపై రేవంత్ రెడ్డి కూడా అప్పటి ప్రభుత్వానికి లేఖ రాసిన విషయాన్ని కవిత గుర్తు చేశారు. 2023 అసెంబ్లీ ఎన్నికల సమయంలో కాంగ్రెస్ పార్టీ తమ మేనిఫెస్టోలో జీవో 317ను సమీక్షించి బాధితులకు న్యాయం చేస్తామని స్పష్టమైన హామీ ఇచ్చిందని ఆమె వివరించారు.

ప్రస్తుత మంత్రివర్గంలోని పలువురు నేతలు కూడా గతంలో బాధితులకు అండగా ఉంటామని చెప్పారని, ఇప్పుడు అధికారంలోకి వచ్చాక ఆ మాట నిలబెట్టుకోవాల్సిన సమయం వచ్చిందని ఆమె ఉద్ఘాటించారు. ఉద్యోగుల స్థానికతను గుర్తించే నిబంధనల్లో సమూల మార్పులు చేయాలని, ఏళ్ల తరబడి ఒకే చోట పనిచేస్తూ పరాయి జిల్లాలకు వెళ్లిన వారికి న్యాయం చేయాలని కవిత కోరారు.

మానవతా దృక్పథంతో ఆలోచించి, జీవో 317 బాధిత కుటుంబాల్లో వెలుగులు నింపేలా తక్షణమే బదిలీ ఉత్తర్వులు జారీ చేయాలని ముఖ్యమంత్రిని డిమాండ్ చేశారు. రాజకీయాలకు అతీతంగా ఈ సమస్యను పరిష్కరించి, ఉద్యోగుల ఆవేదనను దూరం చేయాలని ఆమె తన లేఖ ద్వారా విజ్ఞప్తి చేశారు. జీవో 317 అంశంపై తెలంగాణలో చాలా కాలంగా ఉపాధ్యాయ సంఘాలు పోరాటం చేస్తున్న నేపథ్యంలో, కవిత రాసిన ఈ లేఖ రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here