ఆంధ్రప్రదేశ్ పారిశ్రామిక రంగంలో మరో కీలక అడుగు పడింది. ఏసీ తయారీ రంగంలో ప్రపంచ ప్రఖ్యాతి గాంచిన అమెరికాకు చెందిన ప్రముఖ ఎయిర్ కండిషనర్ తయారీ సంస్థ ‘క్యారియర్ గ్లోబల్’ సంస్థ శ్రీసిటీలో తన తయారీ యూనిట్‌ను ఏర్పాటు చేస్తోంది. బుధవారం ఉదయం జరిగిన ప్రత్యేక కార్యక్రమంలో రాష్ట్ర ఐటీ, విద్యా శాఖ మంత్రి నారా లోకేశ్ ఈ భారీ ప్రాజెక్టుకు శంకుస్థాపన చేశారు. సుమారు రూ.1000 కోట్ల పెట్టుబడితో నిర్మిస్తున్న ఈ యూనిట్ ద్వారా రాష్ట్రంలో పారిశ్రామికాభివృద్ధి మరింత వేగం పుంజుకోనుంది.
భారీ పెట్టుబడి – వేల సంఖ్యలో ఉద్యోగ అవకాశాలు
శ్రీసిటీ పరిధిలోని ఆరూరు వద్ద ఈ పరిశ్రమ ఏర్పాటు కోసం ఏపీ ప్రభుత్వం 40 ఎకరాల స్థలాన్ని కేటాయించింది. ఈ ప్రాజెక్టు ద్వారా ప్రత్యక్షంగా 1,000 మందికి, పరోక్షంగా మరో 2,000 మందికి ఉపాధి లభించనుంది. సాధారణంగా ఇళ్లలో వాడే ఏసీలే కాకుండా, డేటా సెంటర్లు మరియు భారీ పారిశ్రామిక సముదాయాలకు అవసరమయ్యే 1,000 టన్నుల నుండి 5,000 టన్నుల సామర్థ్యం కలిగిన భారీ కూలింగ్ సిస్టమ్స్‌ను ఈ యూనిట్‌లో తయారు చేయనున్నారు.
దేశానికే ఏసీ హబ్‌గా శ్రీసిటీ
దక్షిణ భారతదేశంలో ఎయిర్ కండిషన్ల తయారీకి శ్రీసిటీ చిరునామాగా మారింది. ఇప్పటికే ఇక్కడ డైకిన్, ఎల్‌జీ, హ్యావెల్స్, బ్లూస్టార్, అంబర్ ఎంటర్‌ప్రైజెస్ వంటి ప్రముఖ సంస్థలు తమ కార్యకలాపాలను కొనసాగిస్తున్నాయి. వీటితో పాటు 32 విడి భాగాల సరఫరా కంపెనీలు కూడా ఇక్కడ కొలువుదీరడంతో, దేశంలోనే అతిపెద్ద ఏసీ తయారీ హబ్‌గా శ్రీసిటీ అవతరించబోతోంది. మౌలిక సదుపాయాలు మరియు పోర్ట్ ఆధారిత లాజిస్టిక్స్ సేవలు అందుబాటులో ఉండటం వల్ల దిగ్గజ సంస్థలు ఇక్కడ పెట్టుబడులు పెట్టేందుకు మొగ్గు చూపుతున్నాయి.
పెరగనున్న తయారీ వాటా
ప్రస్తుతం దేశంలో తయారవుతున్న ఏసీలలో దాదాపు 40 శాతం వాటా శ్రీసిటీ నుంచే వస్తోంది. ఎల్‌జీ, డైకిన్ వంటి కంపెనీల విస్తరణతో పాటు ఇప్పుడు క్యారియర్ గ్లోబల్ రాకతో, 2028 నాటికి ఈ వాటా 70 శాతానికి పెరిగే అవకాశం ఉందని అంచనా వేస్తున్నారు. ఏపీ ప్రభుత్వ పారిశ్రామిక అనుకూల విధానాల వల్ల అంతర్జాతీయ సంస్థలు రాష్ట్రం వైపు ఆకర్షితులవుతున్నాయి.








































