ఘనంగా ప్రారంభమైన టీడీపీ మహానాడు.. సీఎం చంద్రబాబు కీలక ప్రసంగం

TDP Mahanadu 2026 CM Chandrababu Gets Emotional Over Cadre Sacrifices

తెలుగుదేశం పార్టీకి అత్యంత ప్రతిష్టాత్మకమైన ‘మహానాడు’ వేడుకలు నేడు ఘనంగా ఆరంభమయ్యాయి. రెండు రోజుల పాటు నిర్వహించనున్న ఈ మహాసభలు మంగళగిరిలోని పార్టీ కేంద్ర కార్యాలయాన్ని ప్రధాన వేదికగా చేసుకుని, రాష్ట్రవ్యాప్తంగా 1875 క్లస్టర్లలో హైబ్రిడ్‌ విధానంలో కొనసాగుతున్నాయి. కూటమి ప్రభుత్వం ఏర్పడి రెండేళ్లు పూర్తవుతున్న నేపథ్యంలో ఈ మహానాడు రాజకీయంగా మరింత ప్రాధాన్యత సంతరించుకుంది. రాబోయే ఎన్నికల దిశగా పార్టీ వ్యూహాలను ఖరారు చేయడంతో పాటు, స్థానిక సంస్థల ఎన్నికలకు శ్రేణులను సిద్ధం చేసే దిశగా నాయకత్వం ప్రత్యేక దృష్టి సారించింది.

ఈసారి మహానాడు మరో కారణంతో ప్రత్యేక ఆకర్షణగా మారింది. పార్టీ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌గా బాధ్యతలు స్వీకరించిన తర్వాత మంత్రి నారా లోకేశ్‌ పాల్గొంటున్న తొలి మహానాడు కావడంతో ఆయన ప్రసంగంపై పార్టీ వర్గాల్లో ఆసక్తి నెలకొంది. భవిష్యత్ కార్యాచరణ, యువతకు అవకాశాలు, పార్టీ బలోపేతంపై లోకేశ్ కీలక సందేశం ఇవ్వనున్నట్లు తెలుస్తోంది.

ఈ సందర్భంగా ముఖ్యమంత్రి, టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడు మంగళగిరిలోని తెలుగుదేశం పార్టీ కేంద్ర కార్యాలయంలో కేడర్‌ను ఉద్దేశించి ప్రసంగించారు. “తెలుగుదేశం పార్టీ దేశంలోనే ‘విజన్ పాలిటిక్స్‌’కు సరికొత్త నాంది పలికిందని స్పష్టం చేశారు. టీడీపీ పుట్టుక, ప్రయాణం, ప్రస్థానం అన్నీ ఒక అద్భుతమని, పార్టీ వేసే ప్రతి అడుగు ఒక సంచలనమని ఆయన అభివర్ణించారు. ‘సమాజమే దేవాలయం – ప్రజలే దేవుళ్లు’ అనే నినాదంతో 44 ఏళ్ల క్రితం ఆవిర్భవించిన తెలుగుదేశం పార్టీ, నాటి నుంచి నేటి వరకు దేశానికి సంక్షేమం, అభివృద్ధి, సుపరిపాలనను పరిచయం చేస్తూనే ఉందన్నారు.

వాహనాల హోరు తగ్గినా.. కార్యకర్తల జోరు తగ్గలేదు!

పశ్చిమాసియాలో నెలకొన్న యుద్ధ వాతావరణం కారణంగా ఇంధన పొదుపు, వ్యయ నియంత్రణ చర్యల్లో భాగంగా ఈసారి మహానాడును ‘హైబ్రిడ్ మోడ్’ (డిజిటల్ విధానంలో) నిర్వహిస్తున్నట్లు చంద్రబాబు నాయుడు వెల్లడించారు. రాష్ట్రవ్యాప్తంగా మొత్తం 1,875 క్లస్టర్ల వేదికలను సాంకేతికతతో అనుసంధానించి ఈ వర్చువల్ మహానాడును సక్సెస్‌ఫుల్‌గా నడిపిస్తున్నామని చెప్పారు.

“ఈ డిజిటల్ పద్ధతి వల్ల వాహనాల హోరు తగ్గిందేమో కానీ, మన తెలుగు తమ్ముళ్లలో, కార్యకర్తలలో జోరు మాత్రం అస్సలు తగ్గలేదు” అని ప్రశంసించారు. కేవలం మీటింగ్ మోడల్ మారిందే తప్ప మహానాడు నిర్వహించే విధానం, ఆ సాంప్రదాయం మారలేదని స్పష్టం చేశారు. ఏ తీర్మానానికి ఎంతమంది ఆమోదం తెలిపారో రియల్ టైమ్‌ డేటా ద్వారా డిజిటల్‌గా స్క్రీన్‌లపైకి వస్తోందని, యువత కోసం బెస్ట్ టెక్నాలజీ ప్లస్‌ను రాష్ట్రానికి తీసుకువస్తామని ప్రకటించారు.

చంద్రయ్య వంటి కార్యకర్తల స్ఫూర్తి కలకాలం నిలుస్తుంది

గత వైకాపా ప్రభుత్వ హయాంలో టీడీపీ నేతలు, కార్యకర్తలపై తీవ్రమైన దాడులు, హింస, హత్యా రాజకీయాలు, అక్రమ కేసులు, వేధింపులు ఎదురైనా ఎవరూ వెనకడుగు వేయకుండా పసుపు జెండాను గుండెలకు హత్తుకున్నారని చంద్రబాబు నాయుడు భావోద్వేగానికి గురయ్యారు. “నరహంతకులు పీకలు కోస్తున్నా మన కార్యకర్తలు జెండాను వీడలేదు. చంద్రయ్య లాంటి నమ్మకమైన కార్యకర్తను నరుకుతున్నా.. ‘జై చంద్రబాబు, జై తెలుగుదేశం’ అంటూ నినదించి అమరుడయ్యారు. ఆయన త్యాగం, స్ఫూర్తి పార్టీలో కలకాలం నిలిచి ఉంటుంది” అని కొనియాడారు.

తనను అక్రమంగా జైల్లో పెట్టినా, లోకేశ్‌ యువగళం పాదయాత్రను అడ్డుకున్నా, బాధితులనే నిందితులుగా మార్చినా ప్రజాస్వామ్యం కోసం టీడీపీ పోరాడి గెలిచిందని గుర్తుచేశారు. ప్రస్తుతం ఏపీ పునర్నిర్మాణం కోసం బీజేపీ, జనసేనలతో కలిసి కూటమిగా ఏర్పడి అగ్రెసివ్‌గా, ప్రోగ్రెసివ్‌గా పాలన సాగిస్తున్నట్లు తెలిపారు.

మహిళలకు 33 శాతం రిజర్వేషన్లు సాధించే వరకు పోరాటం

తెలుగుదేశం పార్టీ ఎల్లప్పుడూ జెండర్ ఈక్వాలిటీ మరియు మహిళా సాధికారత కోసమే పనిచేస్తుందని చంద్రబాబు నాయుడు స్పష్టం చేశారు. స్థానిక సంస్థల్లో మహిళలకు రిజర్వేషన్లు కల్పించడంతో పాటు చట్టసభల్లో వారికి 33 శాతం రిజర్వేషన్లు సాధించే వరకు టీడీపీ వారికి అండగా నిలబడుతుందని ఆయన హామీ ఇచ్చారు.

గతంలో ఉన్న ‘ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్’ విధానాన్ని ఇప్పుడు ‘స్పీడ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్’గా మార్చామని, ఈ వేగాన్ని చూసే తాను చిన్నప్పుడు ఇష్టంగా నడిపిన రాయల్ ఎన్‌ఫిల్డ్ సంస్థ కూడా ఇప్పుడు రాష్ట్రానికి పెట్టుబడులతో తరలివచ్చిందని సంతోషం వ్యక్తం చేశారు. జాతీయ జెండా దేశానికి గౌరవమైతే, పసుపు జెండా తెలుగువారి ఆత్మవిశ్వాసమని, ప్రజలకు ఈ జెండానే శ్రీరామరక్ష అని ఆయన ఉద్ఘాటించారు.

కాగా, మహానాడులో మొత్తం 20 కీలక తీర్మానాలను ప్రవేశపెట్టనున్నారు. వీటిలో ఆంధ్రప్రదేశ్‌కు సంబంధించినవి 10, తెలంగాణకు సంబంధించినవి 4, ఉమ్మడి అంశాలపై 4, అండమాన్‌ నుంచి ఒక తీర్మానం ఉండగా, మరోటి రాజకీయ పరమైన అంశంపై ఉండనుంది. రాష్ట్ర అభివృద్ధి, సంక్షేమం, వ్యవసాయం, ఉపాధి, సామాజిక సాధికారత వంటి అంశాలు ఈ తీర్మానాల్లో ప్రధానంగా ఉండనున్నాయి.

ఈ ఏడాది మహానాడును ‘స్త్రీశక్తి’ ప్రధానాంశంగా నిర్వహిస్తున్నారు. మహిళల ఆర్థిక, సామాజిక సాధికారతకు పార్టీ తీసుకున్న చర్యలు, మహిళా సంక్షేమం కోసం అమలు చేసిన పథకాలు, భవిష్యత్‌లో చేపట్టనున్న కార్యక్రమాలపై ప్రత్యేక చర్చ జరగనుంది. మహిళలకు రాజకీయంగా మరింత ప్రాధాన్యత కల్పించే దిశగా పార్టీ కార్యాచరణను కూడా ఈ వేదికపై ప్రకటించే అవకాశముంది.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here