ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు సారథ్యంలోని కూటమి ప్రభుత్వం రాష్ట్రంలో విద్యా, ఉద్యోగ రంగాల అభివృద్ధికి కట్టుబడి ఉంటే.. విపక్షాలు మాత్రం నిరుద్యోగుల జీవితాలతో ఆడుకుంటున్నాయని ఏపీ మంత్రి నారా లోకేశ్ తీవ్రంగా మండిపడ్డారు. మంగళగిరిలోని తెలుగుదేశం పార్టీ (టీడీపీ) కేంద్ర కార్యాలయంలో బుధవారం జరిగిన ‘మహానాడు-2026’ వేడుకల్లో ఆయన పాల్గొని ప్రసంగించారు.
ఈ సందర్భంగా వైసీపీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డిపై ఆయన తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. జగన్ తన సొంత తల్లిని, చెల్లిని మెడపెట్టి గెంటేశారని ఆరోపించారు. మాజీ మంత్రి, జగన్ సొంత బాబాయి అయిన వైఎస్ వివేకానందరెడ్డిని గొడ్డలితోనే కదా దారుణంగా చంపారని.. అందుకే ఆ పార్టీని తాము ‘గొడ్డలి పార్టీ’ అని పిలుస్తున్నామని విమర్శించారు. గత మహానాడులో మనం 6 కీలక శాసనాలను ప్రవేశపెట్టామని, పార్టీ శ్రేణులంతా వీటిని ఎల్లప్పుడూ గుర్తుపెట్టుకుని ప్రజల్లోకి తీసుకెళ్లాలని సూచించారు.
డీఎస్సీపై చేసే కుట్రలను తిప్పి కొట్టాలి
ఉద్యోగాల భర్తీ విషయంలో గొడ్డలి పార్టీ నిరంతరం చేస్తున్న కుట్రలను టీడీపీ కేడర్ ఎప్పటికప్పుడు గమనిస్తూ ఉండాలని మంత్రి నారా లోకేశ్ పిలుపునిచ్చారు. ఉపాధ్యాయ పోస్టుల భర్తీ కోసం కూటమి ప్రభుత్వం మెగా డీఎస్సీ ప్రక్రియను చేపడుతుంటే, జగన్ అండ్ కో దానిని అడ్డుకోవాలని చూస్తోందని, వారి కుట్రలను క్షేత్రస్థాయిలో తిప్పికొట్టాలని పిలుపునిచ్చారు. గత వైసీపీ ఐదేళ్ల హయాంలో ఒక్క టీచర్ పోస్టును కూడా భర్తీ చేయలేదని, కానీ తమ ప్రభుత్వం పారదర్శకంగా మెగా డీఎస్సీ నిర్వహిస్తోందని స్పష్టం చేశారు.
“పదోతరగతి పేపర్ లీక్ చేసిన చరిత్ర జగన్ ది.. అదే ప్రపంచ ప్రఖ్యాత స్టాన్‌ఫర్డ్ యూనివర్సిటీలో చదివిన చరిత్ర నాది” అని లోకేశ్ ఉద్ఘాటించారు. గత టీడీపీ ప్రభుత్వ హయాంలో ప్రభుత్వ పాఠశాలల టీచర్లను మరింత మెరుగైన శిక్షణ కోసం సింగపూర్ పంపించామని, కానీ వైసీపీ హయాంలో ఉపాధ్యాయులను తీసుకెళ్లి మద్యం షాపుల ముందు కాపలా పెట్టించారని తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు.
పార్టీలో సంస్కరణలు.. కార్యకర్తలకు పెద్దపీట
సమాజంలో నిజం గడపదాటే లోపల అబద్ధం ప్రపంచాన్ని చుట్టేస్తోందని, విపక్షాల అబద్ధపు ప్రచారాలను తిప్పికొట్టాల్సిన బాధ్యత కార్యకర్తలపై ఉందని మంత్రి నారా లోకేశ్ అభిప్రాయపడ్డారు. తెలుగుదేశం పార్టీలో అనేక సంస్కరణలు తీసుకురావడానికి తాము ఎంతో పోరాటం చేశామని గుర్తుచేశారు. ఒకప్పుడు కేవలం జిల్లాస్థాయికే పరిమితమైన రాజకీయ ముఖచిత్రాన్ని మార్చి, పార్లమెంటరీ నియోజకవర్గాల స్థాయికి పార్టీ ఆర్గనైజేషన్ వ్యవస్థను పటిష్టంగా తీసుకువచ్చామని వివరించారు.
నిబద్ధతతో పనిచేసే సాధారణ కార్యకర్తలకు టీడీపీ ఎల్లప్పుడూ గుర్తింపునిస్తుందని చెప్పడానికి.. ఒక సాధారణ మండల పార్టీ అధ్యక్షురాలైన శ్రీదేవితో పాటు, ధనుంజయ్‌లను నేరుగా పార్టీ అత్యున్నత విభాగమైన పొలిట్‌బ్యూరోలోకి తీసుకురావడమే నిదర్శనమని మంత్రి నారా లోకేశ్ స్పష్టం చేశారు.








































