బ్యాంకింగ్ రంగంలో నెలకొన్న సమ్మె సమయానికి ముందు కేంద్ర ఆర్థిక మంత్రిత్వ శాఖ కీలక నిర్ణయం తీసుకుంది. యునైటెడ్ ఫోరమ్ ఆఫ్ బ్యాంక్ యూనియన్స్ (UFBU) సెప్టెంబర్ 28 నుంచి 30 వరకు పిలుపునిచ్చిన మూడు రోజుల దేశవాళీ సమ్మె నేపథ్యంలో, వినియోగదారులకు తీవ్ర ఇబ్బందులు కలగకుండా చూసేందుకు సెప్టెంబర్ 27వ తేదీన (ఆదివారం) అన్ని ప్రభుత్వ రంగ బ్యాంకులు మరియు ప్రాంతీయ గ్రామీణ బ్యాంకులను సాధారణంగా పనిచేయాలని ఉత్తర్వులు జారీ చేసింది.
ఆదివారం కూడా బ్యాంకులు పనిచేయడానికి గల కారణాలు
సెప్టెంబర్ 26వ తేదీన నాల్గవ శనివారం మరియు సెప్టెంబర్ 27న ఆదివారం రావడంతో, దానికి తోడుగా సెప్టెంబర్ 28 నుండి 30 వరకు నిరసన ప్రకటన చేయడంతో వరుసగా ఐదు రోజుల పాటు బ్యాంకింగ్ సేవలు నిలిచిపోయే ప్రమాదం ఏర్పడింది.
సెప్టెంబర్ 30 నాటికి బ్యాంకుల అర్ధవార్షిక ముగింపు (Half-Yearly Closing) ఉన్నందున ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా అత్యవసర లావాదేవీలు నిర్వహించుకోవడానికి రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (RBI) ఆదివారం రోజున కూడా బ్యాంకు శాఖలు, బ్యాంకింగ్ కార్యాలయాలు, ఎటిఎం లింక్డ్ బ్రాంచీలు మరియు కరెన్సీ చెస్ట్‌లు పనిచేయడానికి ముందస్తు అనుమతి ఇచ్చింది.
బ్యాంక్ ఉద్యోగుల సమ్మె డిమాండ్లు
వారంలో 5 రోజుల పనిదినాల (5-Day Banking Week) అమలుతో పాటు పర్ఫార్మెన్స్ లింక్డ్ ఇన్సెంటివ్ (PLI) స్కీమ్ రద్దు చేయాలనే డిమాండ్లపై యజమాన్యంతో జరిపిన చర్చలు విఫలం కావడంతో సమ్మెకు వెళ్లడానికి UFBU సమాయత్తమైంది.
కేంద్ర ప్రభుత్వం ఇప్పటికే ఈ వివాద పరిష్కారానికి కృషి చేస్తోందని, బ్యాంకు సేవలకు భంగం వాటిల్లకుండా చూడటమే తమ ప్రాధాన్యమని ప్రకటనలో తెలిపింది. వినియోగదారులు ఆదివారం రోజున నేరుగా బ్యాంక్ శాఖలకు వెళ్లి తమ కార్యకలాపాలను పూర్తి చేసుకోవచ్చని సూచించారు.





































