జూరాలకు ఆలమట్టి నీళ్లు.. కర్ణాటక ముఖ్యమంత్రికి సీఎం రేవంత్ రెడ్డి కృతజ్ఞతలు

CM Revanth Reddy Thanks Karnataka Chief Minister DK Shivakumar For Krishna Water Support To Telangana

తెలంగాణ ముఖ్యమంత్రి ఎనుముల రేవంత్ రెడ్డి సూచనలతో ఉమ్మడి మహబూబ్‌నగర్ జిల్లాకు చెందిన మంత్రులు జూపల్లి కృష్ణారావు, వాకిటి శ్రీహరి నేతృత్వంలోని ప్రజాప్రతినిధుల బృందం బెంగళూరులో కర్ణాటక ముఖ్యమంత్రి డీకే శివకుమార్‌తో వరుసగా రెండో రోజూ కీలక సమావేశం నిర్వహించింది. పాలమూరు ఆయకట్టు పరిధిలో ఎల్ నినో పరిస్థితుల వల్ల నీటి కొరత ఏర్పడి పంటలు ఎండిపోతున్న విషయాన్ని తెలంగాణ బృందం ఆయన దృష్టికి తీసుకెళ్లింది.

10 రోజుల పాటు వారాబందీ పద్ధతిలో నీటి విడుదల

తెలంగాణ మంత్రుల వినతిపై కర్ణాటక సీఎం స్పందిస్తూ, ఆల్మట్టి మరియు నారాయణపూర్ జలాశయాల నుంచి జూరాల ప్రాజెక్టుకు పది రోజుల పాటు ‘ఆన్ అండ్ ఆఫ్’ (వారాబందీ) పద్ధతిలో నీటిని విడుదల చేయడానికి సానుకూలంగా అంగీకరించారు. కర్ణాటకలోనూ నీటి నిల్వలు తక్కువగా ఉన్నప్పటికీ, తెలంగాణ రైతుల సంక్షేమాన్ని దృష్టిలో ఉంచుకుని 3 టీఎంసీల నీటిని అందించేందుకు నిర్ణయం తీసుకున్నారు. ఇందుకు సంబంధించి తక్షణమే చర్యలు చేపట్టాలని ఆ రాష్ట్ర సాగునీటి శాఖ అధికారులను ఆయన ఆదేశించారు.

సీఎం రేవంత్ రెడ్డి కృతజ్ఞతలు – ఊరట పొందిన రైతాంగం

తెలంగాణ అభ్యర్థనను మన్నించి నీటి విడుదలకు అంగీకరించిన కర్ణాటక సీఎం డీకే శివకుమార్‌కు తెలంగాణ ముఖ్యమంత్రి ఎనుముల రేవంత్ రెడ్డి ‘ఎక్స్’ (ట్విట్టర్) వేదికగా ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు.

“మా రాష్ట్రానికి కృష్ణా నదీ జలాలను విడుదల చేయాలన్న మా అభ్యర్థనను మన్నించినందుకు, కర్ణాటక ముఖ్యమంత్రి శ్రీ డి.కె. శివకుమార్ గారికి తెలంగాణ ప్రజల తరపున హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. ఇది రెండు వేర్వేరు రాష్ట్రాల మధ్య ఉన్న సత్సంబంధాలకు ఒక గొప్ప ఉదాహరణగా నిలవడమే కాకుండా, భారత ప్రజల మధ్య ఉన్న ప్రేమ మరియు సోదరభావాన్ని చాటిచెబుతుంది.” అని సీఎం రేవంత్ పేర్కొన్నారు.

ఈ నిర్ణయంతో జూరాల, భీమా, నెట్టెంపాడు మరియు కోయిల్ సాగర్ ఆయకట్టు పరిధిలోని రైతుల సాగునీటి మరియు తాగునీటి కష్టాలకు ఊరట లభించింది. లభ్యమయ్యే నీటిని సద్వినియోగం చేసుకోవడంపై ప్రజాప్రతినిధులు, అధికారులతో తదుపరి సమావేశం నిర్వహించనున్నారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here