తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కాంగ్రెస్ పార్టీలోని కొందరు శాసనసభ్యుల (ఎమ్మెల్యేల) పనితీరు మరియు వైఖరిపై తీవ్రస్థాయిలో అసంతృప్తి వ్యక్తం చేశారు. గాంధీభవన్‌లో శుక్రవారం అత్యంత ఉత్కంఠభరితంగా జరిగిన టీపీసీసీ రాజకీయ వ్యవహారాల కమిటీ (పీఏసీ), సలహా కమిటీల ఉమ్మడి సమావేశంలో ఆయన పాల్గొని మాట్లాడారు. ఈ సందర్భంగా నియోజకవర్గాల్లో కొందరు ఎమ్మెల్యేలు ప్రవర్తిస్తున్న తీరును తప్పుబడుతూ గట్టి చురకలు అంటించారు. కొందరు ఎమ్మెల్యేలు తమ నియోజకవర్గాలకు జమీందార్ల లాగా వ్యవహరిస్తున్నారని మండిపడ్డారు.
గతంలో కాంగ్రెస్ పార్టీ ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ప్రాణాలకు తెగించి, సోషల్ మీడియాలో వారియర్ల లాగా పోరాడిన కార్యకర్తలను.. ఇప్పుడు కొందరు ఎమ్మెల్యేలు కేవలం తమ వ్యక్తిగత ప్రచారానికి మాత్రమే పరిమితం చేస్తున్నారని కుండబద్దలు కొట్టారు. ఎమ్మెల్యే కూర్చున్నా, నిలబడినా, ఎక్కడైనా టెంకాయ కొట్టినా.. ఆ ఫొటోలను సోషల్ మీడియాలో పెట్టడానికే కార్యకర్తలను వాడుకుంటున్నారే తప్ప, ప్రభుత్వం మరియు పార్టీ అందిస్తున్న ప్రజా సంక్షేమ కార్యక్రమాలను జనాల్లోకి తీసుకెళ్లకుండా అడ్డుకుంటున్నారని తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు.
ఎస్ఐఆర్ సమగ్ర సవరణకు అంతా సిద్ధం కావాలి
కేంద్ర ఎన్నికల సంఘం జూన్ నెలలో తెలంగాణవ్యాప్తంగా ప్రతిష్టాత్మకంగా చేపట్టనున్న ఓటరు జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ (ఎస్ఐఆర్) కార్యక్రమంపై పార్టీ నేతలంతా పూర్తి అవగాహన పెంచుకోవాలని సీఎం రేవంత్ రెడ్డి స్పష్టం చేశారు. ఈ ఎస్ఐఆర్ ప్రక్రియ సరైన పద్ధతిలో జరగకపోతే గ్రామీణ ప్రాంతాల్లోని ఆదివాసీలు, లంబాడాలు, వలస కార్మికులతో పాటు దళితులు, మైనారిటీలు, మహిళల ఓట్లు భారీగా తొలగించబడే ప్రమాదం ఉందని నేతలు ఆందోళన వ్యక్తం చేశారు.
దీనిని సమర్థవంతంగా ఎదుర్కొనేందుకు గతంలో కాంగ్రెస్ పార్టీ చేపట్టిన డిజిటల్ మెంబర్షిప్ తరహాలోనే, ప్రతి అసెంబ్లీ మరియు లోక్‌సభ నియోజకవర్గానికి ప్రత్యేక ఇన్ఛార్జ్లను నియమించాలని టీపీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్‌కు సీఎం రేవంత్ రెడ్డి సూచించారు. బూత్ స్థాయి ఎన్‌రోలర్ల సాయంతో వలస వెళ్లిన వారి ఓట్లు కూడా పోకుండా ప్రతి ఒక్క అర్హత గల ఓటును కాపాడాలని పిలుపునిచ్చారు.
అయితే, ఎస్ఐఆర్కు సంబంధించి హైదరాబాద్ జిల్లాలోని 15 నియోజకవర్గాల్లో నాయకుల సన్నద్ధత అత్యంత పేలవంగా ఉండటంపై ముఖ్యమంత్రి తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేస్తూ.. ఇన్ఛార్జ్ మంత్రి పొన్నం ప్రభాకర్ ఈ 15 నియోజకవర్గాల్లో విడివిడిగా ప్రత్యేక సమావేశాలు నిర్వహించాలని ఆదేశించారు.
నాకూ ఒక నియోజకవర్గం ఇవ్వండి.. మంత్రులకు డ్యూటీలు
పార్టీ బలోపేతం కోసం మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు మరియు కార్పొరేషన్ల చైర్మన్లు అంతా నియోజకవర్గాల వారీగా ప్రత్యేక డ్యూటీలు వేసుకుని క్షేత్రస్థాయిలో పనిచేయాలని సీఎం రేవంత్ రెడ్డి ఆదేశించారు. ప్రతి ఒక్కరూ వారానికి ఒకరోజు చొప్పున.. నెలలో మొత్తం నాలుగు రోజులు ప్రభుత్వ అధికారిక పనులకు సెలవు పెట్టి, పూర్తిగా పార్టీ కార్యక్రమాలకే సమయం కేటాయించాలని నిబంధన పెట్టారు.
“ఈ పద్ధతిని నేనే ముందుండి ప్రారంభిస్తాను. నాకూ ఒక నియోజకవర్గాన్ని కేటాయించండి, తానూ నెలలో నాలుగు రోజులు ముఖ్యమంత్రి పనులను పక్కన పెట్టి పార్టీ కోసం క్షేత్రస్థాయికి వెళ్తాను” అని ప్రకటించి నేతల్లో జోష్ నింపారు. నాయకులు క్షేత్రస్థాయికి వెళితేనే కార్యకర్తల్లో నమ్మకం కలిగి బూత్ స్థాయికి వెళ్తారని చెప్పారు. మిగిలిపోయిన నామినేటెడ్ పోస్టులను కూడా త్వరలోనే పూర్తి చేస్తామని హామీ ఇచ్చారు.
పార్టీలో కార్యకర్తలు సంతోషంగా లేరు: నేతల ఆవేదన
ఈ సమావేశంలో టీపీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ మాట్లాడుతూ.. ఎస్ఐఆర్ పేరుతో పశ్చిమ బెంగాల్‌ను టార్గెట్ చేసిన బీజేపీ, ఇప్పుడు తదుపరి లక్ష్యంగా పంజాబ్, తెలంగాణ రాష్ట్రాలను ఎంచుకుందని హెచ్చరించారు. అందువల్ల డీసీసీ అధ్యక్షులు స్థానిక నేతలతో సమన్వయం చేసుకుని బూత్ స్థాయి అధికారుల (బీఎల్ఓ) జాబితాలను సిద్ధం చేయాలన్నారు.
మరోవైపు, పార్టీ కోసం పదేళ్లుగా కష్టపడి నష్టపోయిన అసలైన కాంగ్రెస్ కార్యకర్తలు ప్రస్తుతం అంత సంతోషంగా లేరని ఎంపీ రేణుకాచౌదరి, మంత్రి శ్రీధర్ బాబు, వి.హన్మంతరావు, ఈరవత్రి అనిల్ వంటి సీనియర్ నేతలు ముఖ్యమంత్రి దృష్టికి తీసుకెళ్లారు. మొదటి నుంచి పార్టీని నమ్ముకున్న పాత నాయకులకు పదవుల భర్తీలో అన్యాయం జరుగుతోందని, కొత్తగా పార్టీలోకి వచ్చిన వారికే ప్రాధాన్యం దక్కుతోందని అసంతృప్తి వ్యక్తం చేసిన రేణుకా చౌదరి, నష్టపోయిన పాత కార్యకర్తలను వెంటనే ఆదుకోవాలని సీఎం రేవంత్ రెడ్డిని కోరారు.





































