గ్లాస్గో వేదికగా నేటినుంచి కామన్వెల్త్ గేమ్స్.. టాప్-5లో నిలవడమే లక్ష్యంగా బరిలోకి భారత్

Commonwealth Games 2026 Glasgow Set To Welcome The World, India Aims For Top-5 Finish

స్కాట్లాండ్‌లోని గ్లాస్గో వేదికగా 23వ ఎడిషన్ కామన్వెల్త్ గేమ్స్ ఘనంగా ప్రారంభమయ్యాయి. గత రెండు దశాబ్దాలుగా కామన్వెల్త్ క్రీడల్లో అత్యుత్తమ ప్రదర్శన కనబరుస్తూ టాప్-5లో నిలుస్తున్న భారత్, ఈసారి కూడా తమ పతకాల పరంపరను కొనసాగించాలని పట్టుదలతో ఉంది. అయితే, ఈసారి పోటీలను కేవలం 10 క్రీడాంశాలకే పరిమితం చేయడంతో టోర్నీ కొంత కళతప్పినట్లు కనిపించినా, భారత అథ్లెట్లు మాత్రం పతకాల మోత మోగించేందుకు సిద్ధమయ్యారు.

తగ్గనున్న క్రీడలు – భారత పతకాలపై ప్రభావం

ఆస్ట్రేలియాలోని విక్టోరియా రాష్ట్రం ఆర్థిక కారణాలతో ఆతిథ్య హక్కుల నుంచి తప్పుకోవడంతో, గ్లాస్గో నగరం అత్యవసరంగా ఈ బాధ్యతలను స్వీకరించింది. బడ్జెట్ కుదింపు కారణంగా గతంలో ఉన్న 19 క్రీడలను ఈసారి కేవలం 10కి కుదించారు. ఇందులో భారత్‌కు భారీగా పతకాలు తెచ్చిపెట్టే షూటింగ్, రెజ్లింగ్, బ్యాడ్మింటన్, టేబుల్ టెన్నిస్ వంటి ఆటలను మినహాయించడం మన జట్టుకు పెద్ద ఎదురుదెబ్బగా మారింది. గత బర్మింగ్‌హామ్ గేమ్స్‌లో వచ్చిన 61 పతకాలలో 25 ఈ నాలుగు క్రీడల నుంచే రావడం గమనార్హం.

అథ్లెటిక్స్, బాక్సింగ్, వెయిట్‌లిఫ్టింగ్‌పైనే ఆశలు

క్రీడల సంఖ్య తగ్గడంతో ఈసారి భారత్ 125 మంది సభ్యులతో కూడిన బృందాన్ని రంగంలోకి దించింది. ప్రధానంగా అథ్లెటిక్స్, బాక్సింగ్, వెయిట్‌లిఫ్టింగ్‌పైనే దేశం ఆశలు పెట్టుకుంది.

  • అథ్లెటిక్స్: స్టార్ జావెలిన్ త్రోయర్ నీరజ్ చోప్రాపై భారీ అంచనాలు ఉన్నాయి. అతనితో పాటు మురళీ శ్రీశంకర్, ప్రవీణ్ చిత్రవేల్, సర్వేష్ కుశారేలు పతకాల వేటలో ఉన్నారు.

  • బాక్సింగ్: లవ్లీనా బొర్గోహైన్, జైస్మిన్ లంబోరియా, ప్రీతి పవార్, సచిన్ సివాచ్‌లతో కూడిన పంచ్ బృందం స్వర్ణ పతకాలే లక్ష్యంగా బరిలోకి దిగుతోంది.

  • వెయిట్‌లిఫ్టింగ్: స్టార్ లిఫ్టర్ మీరాబాయి చాను కామన్వెల్త్ గేమ్స్‌లో హ్యాట్రిక్ స్వర్ణం సాధించేందుకు సిద్ధమైంది.

మొత్తంగా 74 కామన్వెల్త్ దేశాల నుంచి దాదాపు 3 వేల మంది అథ్లెట్లు పాల్గొంటున్న ఈ మెగా ఈవెంట్‌లో, పరిమిత అవకాశాల నడుమ కూడా ప్రతికూలతలను అధిగమించి టాప్-5లో స్థానాన్ని నిలబెట్టుకోవాలని భారత్ నిశ్చయంతో ఉంది.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here