ఆంధ్రప్రదేశ్‌లో అభివృద్ధి కార్యక్రమాలకు తామే శ్రీకారం చుట్టి, వాటిని పూర్తి చేస్తున్నామని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అన్నారు. అయితే గత ప్రభుత్వ హయాంలో నిలిచిపోయిన ప్రాజెక్టులకు కూడా ఇప్పుడు క్రెడిట్ తీసుకునే ప్రయత్నాలు జరుగుతున్నాయని ఆయన విమర్శించారు. అనకాపల్లికి గోదావరి జలాలను తీసుకొచ్చిన సందర్భంగా నిర్వహించిన సభలో చంద్రబాబు ప్రతిపక్షంపై తీవ్రస్థాయిలో మండిపడ్డారు.
‘అమరావతినీ తామే కట్టామంటారేమో!’
క్రెడిట్ చోరీ చేయడం ‘గొడ్డలి పార్టీ’కి అలవాటుగా మారిందని చంద్రబాబు ఆగ్రహం వ్యక్తం చేశారు. అమరావతిని గతంలో ఎడారి, శ్మశానం అంటూ విమర్శించి, ఇప్పుడు అభివృద్ధి జరిగితే దాని ఘనత కూడా తమదేనని చెప్పుకునే పరిస్థితి రావచ్చని వ్యాఖ్యానించారు.
భోగాపురం విమానాశ్రయం, వెలిగొండ సొరంగం వంటి ప్రాజెక్టుల విషయంలోనూ ఇదే తరహా ప్రచారం జరుగుతోందని ఆరోపించారు. అనకాపల్లికి గోదావరి జలాలను తీసుకొచ్చిన ఘనతను కూడా తామే సాధించినట్లు సోషల్ మీడియాలో ప్రచారం మొదలుపెట్టే అవకాశం ఉందని ఎద్దేవా చేశారు. పోలవరం ప్రాజెక్టును తాము పూర్తి చేస్తే.. దానిని గతంలో అడ్డుకున్నవారే తామే నిర్మించామని చెప్పుకునే పరిస్థితి వస్తుందని వ్యాఖ్యానించారు.
‘సంకల్పంతోనే అభివృద్ధి’
తాను ముఖ్యమంత్రిగా చేపట్టిన పలు ప్రాజెక్టులను చంద్రబాబు ప్రస్తావించారు. 2015 సెప్టెంబరు 16న పట్టిసీమ ప్రాజెక్టును ప్రారంభించి పూర్తి చేశామని, గోదావరి జలాలను కృష్ణా నదికి అనుసంధానం చేశామని తెలిపారు. 2017 ఆగస్టు 15న పురుషోత్తపట్నం లిఫ్ట్‌ను అందుబాటులోకి తీసుకొచ్చామని చెప్పారు.
2026 సెప్టెంబరు 2న గోదావరి జలాలను అనకాపల్లికి తీసుకొచ్చామని సగర్వంగా ప్రకటించారు. రాబోయే మూడేళ్లలో రూ.35 వేల కోట్లతో 36 ప్రాజెక్టులను పూర్తి చేస్తామని హామీ ఇచ్చారు. ఇప్పటికే గత రెండేళ్లలో వాటిపై రూ.25 వేల కోట్లు ఖర్చు చేసినట్లు తెలిపారు.
పోలవరం, అమరావతికి కేంద్రం సహకారం
ప్రధాని నరేంద్ర మోదీ సహకారంతో పోలవరం, అమరావతి, విశాఖ స్టీల్‌ప్లాంట్‌ను నిలబెట్టామని చంద్రబాబు తెలిపారు. రాష్ట్రానికి రైల్వే జోన్ కూడా సాధించామని పేర్కొన్నారు. 2019లోనే తమ ప్రభుత్వం కొనసాగి ఉంటే ఈ పనులు మరింత ముందుగానే పూర్తయ్యేవని అన్నారు.
రాష్ట్ర అభివృద్ధి శాశ్వతంగా కొనసాగాలంటే ప్రభుత్వాలు స్థిరంగా ఉండాలని చంద్రబాబు అభిప్రాయపడ్డారు. ఏపీ అభివృద్ధి ‘వైకుంఠపాళి’లా ఒకసారి ముందుకు, మరోసారి వెనక్కి వెళ్లకూడదని అన్నారు. ప్రధాని మోదీ వికసిత్ భారత్ లక్ష్యంగా పనిచేస్తున్నారని, రాష్ట్రం తరఫున స్వర్ణాంధ్ర విజన్-2047ను రూపొందించామని తెలిపారు.
ఉత్తరాంధ్ర అభివృద్ధిపై ఫోకస్
గత ప్రభుత్వ పాలనలో ఉత్తరాంధ్రలోని ప్రాజెక్టులకు తగినంత నిధులు ఖర్చు చేయలేదని చంద్రబాబు విమర్శించారు. అదే సమయంలో విశాఖలో రుషికొండపై భారీ వ్యయంతో ప్యాలెస్ నిర్మించారని ఆరోపించారు. ఆ మొత్తంతో నాలుగైదు ప్రాజెక్టులు పూర్తి చేయవచ్చని వ్యాఖ్యానించారు.
విశాఖకు డేటా సెంటర్లు వస్తున్న నేపథ్యంలో నీరు, విద్యుత్ కొరత ఏర్పడుతుందని కొందరు చేస్తున్న ప్రచారంపైనా చంద్రబాబు స్పందించారు. ప్రస్తుతం ఉత్తరాంధ్రకు తీసుకొస్తున్న గోదావరి జలాలు ఐదు డేటా సెంటర్ల అవసరాలకు సరిపోతాయని తెలిపారు. పోలవరం ఎడమ కాలువ ద్వారా భవిష్యత్తులో రోజుకు రెండు టీఎంసీల నీరు వచ్చే అవకాశం ఉందని పేర్కొన్నారు.
‘తెలుగు జాతిని తిరుగులేని శక్తిగా నిలుపుదాం’
అభివృద్ధి కోసం అందరూ కలిసి ముందుకు సాగాలని చంద్రబాబు పిలుపునిచ్చారు. తెలుగు జాతిని తిరుగులేని శక్తిగా నిలపాలని, ఆంధ్రప్రదేశ్‌ను దేశంలోనే నంబర్‌వన్ రాష్ట్రంగా తీర్చిదిద్దాలని ఆకాంక్షించారు. స్వర్ణాంధ్రప్రదేశ్ నిర్మాణానికి ప్రజలంతా భాగస్వాములు కావాలని కోరుతూ.. జై భారత్, జై తెలుగు తల్లి అంటూ తన ప్రసంగాన్ని ముగించారు.








































