జనసేన పార్టీ యువజన విభాగం ‘జై కొట్టు’ నినాదంతో కొత్త కార్యక్రమాలకు శ్రీకారం చుట్టింది. యువత ఆశలు, ఆకాంక్షలు, ఆలోచనలకు అనుగుణంగా యువజన విభాగం పనిచేస్తుందని జనసేన రాజకీయ వ్యవహారాల కమిటీ చైర్మన్, మంత్రి నాదెండ్ల మనోహర్ తెలిపారు. పార్టీ ప్రయాణంలో యువతదే కీలక పాత్ర అని పేర్కొంటూ.. రాబోయే స్థానిక ఎన్నికల్లో యువత, మహిళలకు ప్రాధాన్యం కల్పిస్తామని స్పష్టం చేశారు. ఎన్నికల్లో వంద శాతం స్ట్రయిక్ రేట్‌తో విజయాన్ని సాధించాలని పార్టీ శ్రేణులకు పిలుపునిచ్చారు.
పిఠాపురంలో ‘జై కొట్టు’ లోగో ఆవిష్కరణ
జనసేన అధినేత, డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ పుట్టినరోజు సందర్భంగా కాకినాడ జిల్లా పిఠాపురంలో బుధవారం నిర్వహించిన కార్యక్రమంలో నాదెండ్ల మనోహర్ యువజన విభాగం ‘జై కొట్టు’ లోగోను ఆవిష్కరించారు. కార్యక్రమంలో భాగంగా గీతాన్ని విడుదల చేయడంతో పాటు జనసేన 12 ఏళ్ల ప్రస్థానంపై రూపొందించిన ఏవీలను ప్రదర్శించారు. అనంతరం కేక్ కట్ చేశారు.
ఈ కార్యక్రమాన్ని రాష్ట్రంలోని 175 అసెంబ్లీ నియోజకవర్గాల్లో ఎల్ఈడీ స్క్రీన్ల ద్వారా వీక్షించేలా ఏర్పాట్లు చేశారు.
యువత ఆలోచనలకు వారధిగా యువజన విభాగం
పవన్ కల్యాణ్ ఆలోచన ఎప్పుడూ యువత భవిష్యత్తు గురించే ఉంటుందని మనోహర్ తెలిపారు. యువత ఆలోచనల నుంచే జనసేన పార్టీ ఆవిర్భవించిందని, ఇప్పుడు ప్రత్యేకంగా యువజన విభాగం ఏర్పాటైందని చెప్పారు. యువజన విభాగం యువత ఆలోచనలు, ఆకాంక్షలకు పార్టీకి మధ్య వారధిగా నిలవాలని ఆకాంక్షించారు.
యువత రాజకీయాల వైపు అడుగులు వేయాలని పిలుపునిచ్చిన ఆయన.. ప్రజలకు మేలు చేసే కార్యక్రమాల్లో జనసేన ముందుండాలని సూచించారు. 2019 ఎన్నికల అనంతరం అప్పటి ప్రభుత్వ హయాంలో జనసేనపై జరిగిన దాడులు, ఒత్తిళ్లను యువత ఎదుర్కొని పార్టీకి అండగా నిలిచిందని గుర్తుచేశారు.
50 వేల నుంచి 21.52 లక్షలకు క్రియాశీలక సభ్యులు
జనసేన క్రియాశీలక సభ్యుల సంఖ్య గణనీయంగా పెరిగిందని నాదెండ్ల మనోహర్ తెలిపారు. 50 వేల నుంచి ప్రస్తుతం 21.52 లక్షల మంది వరకు క్రియాశీలక సభ్యత్వం చేరిందని చెప్పారు. ఇది పార్టీ పట్ల యువతలో పెరుగుతున్న ఆదరణకు నిదర్శనమని పేర్కొన్నారు.
‘‘మాతృభూమికి జై కొడదాం.. రాష్ట్రాన్ని అభివృద్ధి దిశగా నడిపి కూటమి పాలనకు జై కొడదాం.. పవన్ కల్యాణ్ ఆశయాలకు జై కొడదాం.. జనసేనకు జై కొడదాం.. భరతమాతకు జై కొడదాం’’ అంటూ పార్టీ శ్రేణులకు మనోహర్ పిలుపునిచ్చారు.
యువతకు పవన్ కల్యాణ్ ఆడియో సందేశం
కేరళలో చికిత్స పొందుతున్న జనసేన అధినేత, డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ తన సందేశాన్ని ఆడియో రూపంలో పంపించారు. యువత కోసం, వారి భవిష్యత్తు కోసం పోరాడాలని ఆయన పిలుపునిచ్చారు.
ఇన్నాళ్లూ నాయకులు, పార్టీలు, ఓట్ల కోసం నినాదాలు చేశామని.. ఇక యువత భవిత కోసం ‘జై కొట్టు’ అని పవన్ కల్యాణ్ తన సందేశంలో పేర్కొన్నారు. దేశం కోసం పోరాడే పిడికిళ్లు కావాలని, ప్రజల కోసం నిలబడే జనసేనకు జై కొట్టాలని పిలుపునిచ్చారు.
ఈ కార్యక్రమంలో కాకినాడ ఎంపీ తంగెళ్ల ఉదయశ్రీనివాస్, కాకినాడ రూరల్ ఎమ్మెల్యే పంతం నానాజీ, జనసేన కాకినాడ జిల్లా అధ్యక్షుడు తుమ్మల బాబు, పలువురు ప్రజాప్రతినిధులు, పార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.









































