స్కాట్లాండ్లోని అతిపెద్ద నగరం గ్లాస్గో వేదికగా జరుగుతున్న కామన్వెల్త్ గేమ్స్ 2026లో తెలుగు యువకుడు తన అద్భుత ప్రదర్శనతో భారత్ కీర్తిపతాకాన్ని ఎగురవేశాడు. 2010 ఢిల్లీ కామన్వెల్త్ క్రీడల్లో తండ్రి కాంస్య పతకం సాధించి దేశానికి గర్వకారణంగా నిలిస్తే, సరిగ్గా 16 ఏళ్ల తర్వాత అదే కామన్వెల్త్ పోటీల్లో తనయుడు రజత పతకంతో సంచలనం సృష్టించాడు. పురుషుల 79 కేజీల వెయిట్‌లిఫ్టింగ్ విభాగంలో ఆంధ్రప్రదేశ్, విజయనగరం జిల్లాకు చెందిన 21 ఏళ్ల వల్లూరి అజయ్ బాబు వెండి పతకం కైవసం చేసుకుని తెలుగు ప్రజల గుండెలు గర్వంతో ఉప్పొంగేలా చేశాడు.
Record Start. Silver Finish. 🥈
A 330kg total powers Valluri Ajaya Babu to Silver in the Men's 79kg Weightlifting event. 🏋️♂️
His 149kg snatch briefly stood as a Commonwealth Games record as he finished just 1kg shy of Gold.
Watch the Commonwealth Games Glasgow 2026 LIVE &… pic.twitter.com/WLXUN7R3hu
— Sony Sports Network (@SonySportsNetwk) July 27, 2026
ఒక్క కేజీతో చేజారిన స్వర్ణం
ఆద్యంతం తీవ్ర ఉత్కంఠభరితంగా సాగిన ఈ పోరులో అజయ్ బాబు మొత్తం 330 కేజీల బరువును (స్నాచ్‌లో 149 కేజీలు + క్లీన్ అండ్ జెర్క్‌లో 181 కేజీలు) విజయవంతంగా ఎత్తి రెండో స్థానంలో నిలిచాడు. కేవలం ఒక్క కేజీ స్వల్ప తేడాతో మలేషియా క్రీడాకారుడు ఎర్రీ హిదాయత్ మహమ్మద్ పసిడి పతకాన్ని సొంతం చేసుకోగా, ఇంగ్లండ్‌కు చెందిన క్రిస్ ముర్రే (325 కేజీలు) కాంస్యంతో సరిపెట్టుకున్నాడు. కామన్వెల్త్ గేమ్స్ 2026లో ప్రస్తుతం భారత్‌కు వెయిట్‌లిఫ్టింగ్ విభాగం నుంచి లభించిన ఆరో పతకం ఇది కావడం విశేషం.
తండ్రి బాటలోనే అంతర్జాతీయ విజయాలు
విజయనగరం జిల్లా కొండవెలగాడ గ్రామానికి చెందిన అజయ్ బాబు తండ్రి వల్లూరి శ్రీనివాసరావు కూడా అంతర్జాతీయ వెయిట్‌లిఫ్టరే. శ్రీనివాసరావు 2010 ఢిల్లీ కామన్వెల్త్ గేమ్స్‌లో (56 కేజీల విభాగం) కాంస్య పతకాన్ని గెలుచుకున్నారు. చిన్నతనం నుంచే తండ్రి అందించిన శిక్షణ, ప్రోత్సాహంతో అంతర్జాతీయ స్థాయిలో రాణిస్తున్న అజయ్ బాబు.. తండ్రి కంటే ఒక అడుగు ముందుకు వేసి రజతాన్ని ముద్దాడటం విశేషం. తండ్రి బాటలోనే నడుస్తూ రజత పతకంతో సత్తా చాటిన ఈ తెలుగు కుర్రాడిపై దేశవ్యాప్తంగా ప్రశంసల వర్షం కురుస్తోంది.






































