మెగా డీఎస్సీపై మాజీ సీఎం జగన్‌తో బహిరంగ చర్చకు నేను సిద్ధం – మంత్రి నారా లోకేశ్

Minister Nara Lokesh Dares Ex CM YS Jagan For Open Debate on Mega DSC Recruitment

ఆంధ్రప్రదేశ్‌లో నిర్వహించిన మెగా డీఎస్సీ ఉపాధ్యాయ నియామకాలపై వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి చేసిన ఆరోపణలను రాష్ట్ర మానవ వనరుల అభివృద్ధి, ఐటీ శాఖ మంత్రి నారా లోకేశ్ తీవ్రంగా ఖండించారు. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు నాయకత్వంలోని కూటమి ప్రభుత్వం డీఎస్సీ నియామకాలను అత్యంత పారదర్శకంగా, నిబంధనలకు అనుగుణంగా నిర్వహించిందని ఆయన స్పష్టం చేశారు. నిరుద్యోగ యువతను తప్పుదోవ పట్టించేలా అసత్య ప్రచారం చేయడం మానుకోవాలని, మెగా డీఎస్సీపై చేసిన ఆరోపణలకు వైఎస్ జగన్ బహిరంగంగా క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు.

దమ్ముంటే బహిరంగ చర్చకు రండి

కృష్ణా జిల్లా కంకిపాడులో నిర్వహించిన పెనమలూరు నియోజకవర్గ టీడీపీ కార్యకర్తల సమావేశంలో మాట్లాడిన మంత్రి నారా లోకేశ్, మెగా డీఎస్సీపై ఎలాంటి సందేహాలు ఉన్నా బహిరంగ చర్చకు సిద్ధమని ప్రకటించారు. తేదీ, సమయం వైఎస్ జగన్ నిర్ణయిస్తే తాను ఒక్కడినే చర్చకు వస్తానని సవాల్ విసిరారు. డీఎస్సీ నియామకాలు వర్టికల్, హారిజాంటల్ రిజర్వేషన్ల నిబంధనలకు అనుగుణంగా జరిగాయని, ఈ ప్రక్రియను అడ్డుకునేందుకు సుమారు 150 కోర్టు కేసులు వేసినా న్యాయస్థానాలు ప్రభుత్వ వైఖరినే సమర్థించాయని గుర్తు చేశారు. కష్టపడి పరీక్షలు రాసి మెరిట్ ఆధారంగా ఉద్యోగాలు సాధించిన 16 వేల మంది అభ్యర్థుల ప్రతిభను అవమానించేలా మాట్లాడటం తగదని అన్నారు.

వైఎస్సార్‌సీపీ పాలనపై విమర్శలు

గత వైఎస్సార్‌సీపీ ప్రభుత్వం ఐదేళ్ల పాలనలో ఒక్క ఉపాధ్యాయ పోస్టును కూడా భర్తీ చేయలేకపోయిందని లోకేశ్ విమర్శించారు. మరోవైపు కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన 150 రోజుల్లోనే 16 వేల ఉపాధ్యాయ పోస్టులను భర్తీ చేసి నిరుద్యోగ యువతకు ఉద్యోగ అవకాశాలు కల్పించిందని తెలిపారు. డీఎస్సీపై నిరాధార ఆరోపణలు చేయడం కంటే, గత ప్రభుత్వ హయాంలో చోటుచేసుకున్న లిక్కర్, భూ కుంభకోణాలపై కూడా చర్చకు సిద్ధమా అని వైఎస్ జగన్‌ను ప్రశ్నించారు. గూగుల్, ఆర్సెలార్ మిత్తల్, రాయల్ ఎన్‌ఫీల్డ్ వంటి దిగ్గజ సంస్థల పెట్టుబడులను కూడా తమ ఖాతాలో వేసుకోవాలని ప్రయత్నించడం ప్రతిపక్షాల వైఖరిని తెలియజేస్తోందని విమర్శించారు.

నిరుద్యోగులకు భరోసా.. పారదర్శక నియామకాలు కొనసాగుతాయి

రాష్ట్రంలో అర్హులైన ప్రతి అభ్యర్థికి న్యాయం జరిగేలా ప్రభుత్వం భవిష్యత్తులో కూడా నియామక ప్రక్రియలను పూర్తిస్థాయి పారదర్శకతతో కొనసాగిస్తుందని మంత్రి నారా లోకేశ్ హామీ ఇచ్చారు. జాబ్ క్యాలెండర్ ప్రకారం మరో 10 వేల పోస్టుల భర్తీ ప్రక్రియను కూడా త్వరలో చేపడతామని వెల్లడించారు. రాజకీయ ప్రయోజనాల కోసం విద్యా వ్యవస్థపై బురద చల్లే ప్రయత్నాలను యువత, ప్రజలు నమ్మరని పేర్కొంటూ, అభివృద్ధి మరియు ఉపాధి కల్పననే కూటమి ప్రభుత్వ ప్రధాన లక్ష్యమని ఆయన స్పష్టం చేశారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here