ఇరాక్‌లోని ఇరాన్ మద్దతు స్థావరాలపై అమెరికా, సౌదీ ఉమ్మడి వైమానిక దాడులు

US and Saudi Arabia Launch Joint Airstrikes on Iran-Backed Militias in Iraq

ఇరాక్‌లోని ఇరాన్ మద్దతుగల సాయుధ గుంపుల స్థావరాలపై తమ దళాలతో కలిసి సౌదీ అరేబియా దళాలు ఉమ్మడిగా వైమానిక దాడులు నిర్వహించినట్లు అమెరికా సైనిక విభాగమైన యుఎస్ సెంట్రల్ కమాండ్ (CENTCOM) ప్రకటించింది. గత కొన్ని రోజులుగా అమెరికా బలగాలు, సౌదీ చమురు మౌలిక సదుపాయాలను లక్ష్యంగా చేసుకుని ఇరాన్ ఇస్లామిక్ రివల్యూషనరీ గార్డ్ కార్ప్స్ (IRGC) ఆదేశాలతో జరిగిన డ్రోన్ దాడులకు ప్రతిస్పందనగానే ఈ చర్యలు చేపట్టినట్లు వెల్లడించింది.

తూర్పు ఇరాక్‌లో ఖచ్చితమైన దాడులు

గత 72 గంటల్లో ఇరాక్ సరిహద్దుల నుంచి 30కి పైగా డ్రోన్లతో దాడులు జరగడంతో అమెరికా, సౌదీ యుద్ధ విమానాలు తూర్పు ఇరాక్‌లోని సాయుధ మూకల ఆయుధ డిపోలు, లాజిస్టిక్స్ స్థావరాలపై విరుచుకుపడ్డాయి. ఇరాన్ ప్రోద్బలంతో పనిచేస్తున్న ఉగ్రవాద గ్రూపులు తమ దాడులను వెంటనే విరమించుకోవాలని, లేకుంటే తీవ్ర పరిణామాలు ఎదుర్కోవాల్సి వస్తుందని అమెరికా హెచ్చరించింది.

సౌదీ చమురు కేంద్రాలే లక్ష్యంగా…

ఈ దాడులపై సౌదీ అరేబియా రక్షణ మంత్రిత్వ శాఖ స్పందిస్తూ.. తమ దేశంలోని తూర్పు ప్రాంతంలో ఉన్న చమురు శుద్ధి కర్మాగారాలు, ఇంధన కేంద్రాలను లక్ష్యంగా చేసుకుని వచ్చిన పలు డ్రోన్లను తమ వైమానిక దళాలు కూల్చివేసినట్లు తెలిపింది. ఆత్మరక్షణ హక్కు ప్రకారం ఇరాక్ భూభాగం నుండి జరుగుతున్న ఈ దాడులను తిప్పికొట్టేందుకే అమెరికాతో కలిసి ఉమ్మడి వ్యూహాత్మక దాడులు చేసినట్లు స్పష్టం చేసింది.

మిస్సైల్ దాడులను తిప్పికొట్టిన అమెరికా

మరోవైపు మిడిల్ ఈస్ట్‌లోని అమెరికా సైనిక స్థావరాలపై ఇరాన్ క్షిపణులతో మెరుపు దాడికి ప్రయత్నించగా, అమెరికా గగనతల రక్షణ వ్యవస్థలు ఆ క్షిపణులన్నింటినీ సమర్థవంతంగా అడ్డుకున్నాయి. ఇరాక్ భూభాగాన్ని తమ పొరుగు దేశాలపై దాడులకు ఉపయోగించవద్దని ఇరాక్ ప్రభుత్వం హెచ్చరించినప్పటికీ, తీవ్రవాద గ్రూపుల కార్యకలాపాలు ఆగకపోవడం గమనార్హం. ఈ పరిణామాలతో పశ్చిమాసియాలో మరోసారి తీవ్ర ఉద్రిక్తతలు నెలకొన్నాయి.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here