ఏపీసీసీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల తన కుమార్తె వివాహ ఆహ్వానంపై సోషల్ మీడియాలో జరుగుతున్న రాజకీయ ప్రచారంపై తీవ్రంగా స్పందించారు. వైఎస్సార్సీపీ అధినేత, మాజీ సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డిని కలవడం వెనుక ఎలాంటి రాజకీయ ప్రాధాన్యత లేదా తెరవెనుక ఒప్పందాలు లేవని, కేవలం కుటుంబ శుభకార్యానికి సంబంధించిన ఆహ్వానం మాత్రమేనని ఆమె తేల్చి చెప్పారు.
విశ్లేషణలపై ఆగ్రహం
తన పర్యటనలు మరియు భేటీలపై సోషల్ మీడియాలో జరుగుతున్న ప్రచారంపై స్పందిస్తూ, “నేను ఎవరినో కలిసినట్లు, ఎక్కడో చేరిపోతున్నట్లు నా మీద సోషల్ మీడియాలో అల్లుతున్నవి కట్టుకథలు. చేస్తున్న విశ్లేషణలు పూర్తిగా నిరాధారం. జరుగుతున్న ప్రచారం శుద్ధ అబద్ధం” అని తీవ్రంగా ఖండించారు. గిట్టని వాళ్లు పస లేని ఆరోపణలు చేస్తున్నారని మండిపడ్డారు.
చివరిసారిగా కలిసింది అప్పుడే
తన కుమారుడు వైఎస్ రాజారెడ్డి వివాహానికి ఆహ్వానించిన సమయంలోనే చివరిసారిగా వైఎస్ జగన్ మోహన్ రెడ్డిని కలిశానని, మళ్లీ ఇప్పుడు కుమార్తె వైఎస్ అంజిలి రెడ్డి వివాహ ఆహ్వాన పత్రికను అందించడానికి మాత్రమే కలవనున్నానని స్పష్టం చేశారు. “కన్న కూతురు వివాహాన్ని అడ్డుపెట్టుకొని తెర వెనుక రాజకీయాలు చేసుకొనే ఖర్మ వైఎస్సార్ బిడ్డగా నాకు లేదు” అని పేర్కొన్నారు. అన్ని రాజకీయ పార్టీల అధినేతలను తన బిడ్డ పెళ్లికి రావాలని, దీవించాలని ఆహ్వానిస్తానని, ఇందులో వింతేమీ లేదని తెలిపారు.
విశ్వసనీయతను దెబ్బతీస్తే ఊరుకోనని హెచ్చరిక
ఒక శుభకార్యానికి, రాజకీయానికి లింకులు పెట్టి తన విశ్వసనీయతను, రాజకీయ ప్రామాణికతను మరియు ప్రజలు తనపై పెట్టుకున్న నమ్మకాన్ని దెబ్బతీసే ప్రయత్నం చేస్తే ఊరుకునేది లేదని హెచ్చరించారు. నా బిడ్డ వైఎస్ అంజిలి రెడ్డి మరియు సోమల రఘురామ్ రెడ్డిల వివాహ మహోత్సవానికి తెలుగు ప్రజలందరూ హాజరై, ఒక్కటి కాబోతున్న నవదంపతులకు హృదయపూర్వక ఆశీస్సులు అందించాలని కోరారు.
నేను ఎవరినో కలిసినట్లు, ఎక్కడో చేరిపోతున్నట్లు, నా మీద సోషల్ మీడియాలో అల్లుతున్నవి కట్టుకథలు. చేస్తున్న విశ్లేషణలు పూర్తిగా నిరాధారం. జరుగుతున్న ప్రచారం శుద్ధ అబద్ధం. గిట్టని వాళ్ళవి పస లేని ఆరోపణలు. ఇది నేను తీవ్రంగా ఖండిస్తున్నా.
వైసీపీ అధ్యక్షులు జగన్ మోహన్ రెడ్డి గారిని… pic.twitter.com/FlcYeXRP2f
— YS Sharmila (@realyssharmila) September 22, 2026






































