జైలుకు పంపినా, ప్రాణాలు తీసినా.. బంగ్లాదేశ్‌కు తిరిగి వెళ్తా – మాజీ ప్రధాని షేక్ హసీనా

Exiled PM Sheikh Hasina Says, She Want To Go Back Bangladesh in December

తనపై ఎటువంటి కేసులు నమోదైనా, ఆఖరికి అరెస్టు చేసి జైల్లో పెట్టినా లేదా ప్రాణహాని తలెత్తినా డిసెంబరు నెలలో కచ్చితంగా బంగ్లాదేశ్‌కు తిరిగి వెళ్తానని సంచలన ప్రకటన చేశారు ఆ దేశ మాజీ ప్రధానమంత్రి షేక్ హసీనా. ఈ మేరకు తాజాగా న్యూఢిల్లీలోని ఫోారిన్ కరస్పాండెంట్స్ క్లబ్ (FCC) ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ఆడియో ప్రెస్ మీట్‌లో మాట్లాడుతూ, 1971 డిసెంబరు తమ దేశానికి ‘విజయ మాసం’ అని, అందుకే ఆ నెలలోనే స్వదేశంలో అడుగుపెట్టాలని నిర్ణయించుకున్నట్లు స్పష్టం చేశారు.

2024లో తన అధికారాన్ని కోల్పోయిన అనంతరం తొలిసారిగా అంతర్జాతీయ మీడియాతో నేరుగా మాట్లాడిన ఆమె, తన పునరాగమనం కేవలం అధికారం కోసం కాదని, బంగ్లాదేశ్‌ను తిరిగి అభివృద్ధి, శాంతి మరియు ప్రజాస్వామ్య మార్గంలో పయనించేలా చేయడమే తన ఏకైక లక్ష్యమని వెల్లడించారు.

తన రాజకీయ జీవితంలో ఎన్నో సవాళ్లను ఎదుర్కొన్నానని, ఇప్పటివరకు 19 సార్లు తనపై హత్యాయత్నాలు జరిగాయని ఆమె గుర్తుచేశారు. 2024 జులై, ఆగస్టు నెలల్లో జరిగిన విద్యార్థుల ఆందోళనలు కేవలం నిరసనలు కావని, అదొక పక్కా ప్రణాళికతో సాగిన అధికార మార్పిడి కుట్ర అని ఆరోపించారు. ప్రస్తుతం బంగ్లాదేశ్‌లో అవామీ లీగ్‌పై విధించిన నిషేధాన్ని తక్షణమే ఎత్తివేయాలని కోరారు.

రాజ్యాంగ వ్యవస్థలను పునరుద్ధరించాలని, రాజకీయ ఖైదీలను విడుదల చేయడంతో పాటు పత్రికా స్వేచ్ఛను పునరుద్ధరించాలని ఆమె డిమాండ్ చేశారు. ఈ విలేకరుల సమావేశంలో పాల్గొన్న ఆమె కుమారుడు సజీబ్ వాజెద్ జాయ్ మాట్లాడుతూ, అంతర్జాతీయ వేదికలపై ప్రచారంలో ఉన్న మరణాల గణాంకాలపై ప్రశ్నలు లేవనెత్తుతూ, అవామీ లీగ్ నేతలపై జరుగుతున్న హింసాకాండను తప్పుబట్టారు.

ఈ ప్రెస్ మీట్‌పై బంగ్లాదేశ్ తాత్కాలిక ప్రభుత్వం తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. ఢిల్లీ వేదికగా ప్రకటనలు చేయడానికి అవకాశం ఇవ్వడం ఇరు దేశాల దౌత్య సంబంధాలపై ప్రతికూల ప్రభావం చూపుతుందని బంగ్లాదేశ్ విదేశాంగ శాఖ వ్యాఖ్యానించింది. అయితే, ఈ విలేకరుల సమావేశం ఒక ప్రైవేట్ మీడియా సంస్థ నిర్వహించినదని, దీనితో భారత ప్రభుత్వానికి ఎటువంటి సంబంధం లేదని కేంద్ర విదేశాంగ శాఖ ముందే స్పష్టత ఇచ్చింది.

బంగ్లాదేశ్‌లో శాంతిభద్రతలు, ప్రజాస్వామ్య వ్యవస్థల పునరుద్ధరణ కేవలం ఆ దేశానికే కాకుండా దక్షిణాసియా ప్రాంతీయ భద్రతకు, బంగాళాఖాతం ప్రాంత అభివృద్ధికి అత్యంత కీలకమని, అంతర్జాతీయ సమాజం బంగ్లాదేశ్ ప్రజల ప్రజాస్వామ్య పోరాటానికి మద్దతుగా నిలవాలని ఆమె పిలుపునిచ్చారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here