నేను ఈ స్థాయికి ఎదగడానికి ప్రధాన కారణం మా అమ్మే – మంత్రి నారా లోకేష్‌

Minister Nara Lokesh Says, I Learned Discipline From My Parents

తాను ఈ స్థాయికి ఎదగడానికి ప్రధాన కారణం తన తల్లేనని పేర్కొన్నారు విద్యాశాఖ మంత్రి నారా లోకేష్‌. ఈ మేరకు ఆయన తాజాగా విశాఖపట్నం జిల్లా పర్యటనలో భాగంగా భీమిలి నియోజకవర్గంలోని మధురవాడలో ఉన్న చంద్రంపాలెం జిల్లా పరిషత్‌ ఉన్నత పాఠశాలను సందర్శించిన సందర్భంగా విద్యార్థులనుద్దేశించి కీలక ప్రసంగం చేశారు.

అంతకుముందుగా అదే పాఠశాలలో సుమారు రూ.6.50 కోట్ల వ్యయంతో చేపట్టిన పలు అభివృద్ధి పనులను మంత్రి ప్రారంభించారు. దివిస్‌ ల్యాబొరేటరీస్‌ కార్పొరేట్‌ సామాజిక బాధ్యత (CSR) నిధులతో అభివృద్ధి చేసిన నూతన తరగతి గదులు, మౌలిక వసతులను పరిశీలించారు.

విద్యార్థులతో ముచ్చటించిన లోకేష్‌

పాఠశాల సందర్శన సందర్భంగా నారా లోకేష్‌ విద్యార్థులతో నేరుగా మాట్లాడారు. వారు అడిగిన పలు ప్రశ్నలకు సమాధానాలు ఇచ్చారు. విద్యార్థులతో ముచ్చటిస్తూ తన వ్యక్తిగత విషయాలు, జీవితంలో తాను పాటించే విలువలను కూడా పంచుకున్నారు.

తాను ఈ స్థాయికి ఎదగడానికి తన తల్లే ప్రధాన కారణమని లోకేష్‌ తెలిపారు. తల్లిదండ్రుల నుంచే క్రమశిక్షణ నేర్చుకున్నానని చెప్పారు. తనకు క్రికెట్‌ అంటే ఎంతో ఇష్టమని, వారానికి ఒకసారి తన కుమారుడు దేవాన్ష్‌తో కలిసి సమయం గడుపుతానని వెల్లడించారు.

కష్టకాలంలో అండగా నిలిచేవారే నిజమైన స్నేహితులు

కష్టకాలంలో తమకు అండగా నిలిచేవారే నిజమైన స్నేహితులని లోకేష్‌ విద్యార్థులకు సూచించారు. చదువుతో పాటు సామాజిక బాధ్యత, సేవాభావాన్ని కూడా అలవర్చుకోవాలని పిలుపునిచ్చారు.

“సమాజమే దేవాలయం.. ప్రజలే మన దేవుళ్లు” అనే భావనతో ప్రతి ఒక్కరూ ఇతరులకు సహాయం చేసే మనస్తత్వాన్ని పెంపొందించుకోవాలని సూచించారు.

అన్ని ప్రభుత్వ పాఠశాలలను మోడల్‌ స్కూళ్లుగా

చంద్రంపాలెం పాఠశాలలో ఉన్నత ప్రమాణాలతో మౌలిక వసతులు కల్పించిన తరహాలోనే రాష్ట్రంలోని అన్ని ప్రభుత్వ పాఠశాలలను మోడల్‌ స్కూళ్లుగా తీర్చిదిద్దడమే ప్రభుత్వ లక్ష్యమని నారా లోకేష్‌ స్పష్టం చేశారు. విద్యార్థులకు మెరుగైన వాతావరణంలో నాణ్యమైన విద్య అందించేందుకు ప్రభుత్వం చర్యలు తీసుకుంటోందని తెలిపారు.

ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు విద్యారంగానికి ఇస్తున్న ప్రాధాన్యతకు అనుగుణంగా ప్రభుత్వ పాఠశాలల్లో మౌలిక వసతుల అభివృద్ధిపై ప్రభుత్వం ప్రత్యేక దృష్టి సారిస్తోంది.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here