దేశంలో ఎల్‌పీజీ సరఫరా వ్యవస్థను మరింత బలోపేతం చేసేందుకు కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. సుమారు రూ.7,000 కోట్ల అంచనా వ్యయంతో 1,800 కిలోమీటర్ల మేర కొత్త ఎల్‌పీజీ పైప్‌లైన్ల నిర్మాణానికి పెట్రోలియం అండ్ నేచురల్ గ్యాస్ రెగ్యులేటరీ బోర్డు (PNGRB) రవాణా అనుమతులు మంజూరు చేసింది.
ఈ ప్రాజెక్టులను ప్రభుత్వ రంగ సంస్థ గేల్ (ఇండియా) లిమిటెడ్ చేపట్టనుంది. కొత్త పైప్‌లైన్లు అందుబాటులోకి వస్తే దేశవ్యాప్తంగా ఎల్‌పీజీ సరఫరా మరింత వేగవంతంగా, సమర్థవంతంగా జరిగే అవకాశం ఉంది.
7,700 నుంచి 9,500 కిలోమీటర్లకు
కొత్త విస్తరణతో దేశంలోని కామన్ క్యారియర్ ఎల్‌పీజీ పైప్‌లైన్ నెట్‌వర్క్ ప్రస్తుత 7,700 కిలోమీటర్ల నుంచి దాదాపు 9,500 కిలోమీటర్లకు పెరగనుంది. అంటే నెట్‌వర్క్ సుమారు 23.5 శాతం విస్తరించనుంది.
ఈ కొత్త పైప్‌లైన్ నెట్‌వర్క్ తెలంగాణ, మహారాష్ట్ర, ఉత్తరప్రదేశ్, ఉత్తరాఖండ్, కర్ణాటక, గోవా.. మొత్తం 5 రాష్ట్రాల మీదుగా నిర్మించనున్నారు.
మూడు ప్రధాన పైప్‌లైన్ మార్గాలు
చర్లపల్లి–నాగ్‌పూర్: తెలంగాణలోని చర్లపల్లి నుంచి మహారాష్ట్రలోని నాగ్‌పూర్ వరకు 556 కిలోమీటర్ల మేర పైప్‌లైన్ నిర్మించనున్నారు.
ఝాన్సీ–సితార్‌గంజ్: ఉత్తరప్రదేశ్‌లోని ఝాన్సీ నుంచి ఉత్తరాఖండ్‌లోని సితార్‌గంజ్ వరకు 611 కిలోమీటర్ల పైప్‌లైన్ ఏర్పాటు చేయనున్నారు.
షిక్రాపూర్–గోవా–హుబ్లీ: మహారాష్ట్రలోని షిక్రాపూర్ నుంచి గోవా మీదుగా కర్ణాటకలోని హుబ్లీ వరకు 633 కిలోమీటర్ల పైప్‌లైన్ నిర్మించనున్నారు.
ట్యాంకర్లపై ఆధారపడటం తగ్గే అవకాశం
ఎల్‌పీజీని పైప్‌లైన్ల ద్వారా రవాణా చేయడం వల్ల రోడ్డు మార్గంలో ఎల్‌పీజీ ట్యాంకర్లపై ఆధారపడటం తగ్గనుంది. దీంతో రవాణా ఖర్చులు తగ్గడంతో పాటు సరఫరా వ్యవస్థ మరింత సమర్థవంతంగా మారే అవకాశం ఉంది.
అదే సమయంలో రోడ్డు రవాణా తగ్గడం వల్ల ఇంధన వినియోగం, కార్బన్ ఉద్గారాలు కూడా తగ్గి పర్యావరణానికి మేలు జరుగుతుందని అధికారులు పేర్కొన్నారు.




































