తెలంగాణను అంతర్జాతీయ విద్యా కేంద్రంగా అభివృద్ధి చేయాలనే లక్ష్యంతో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నేతృత్వంలోని ‘తెలంగాణ రైజింగ్’ ప్రతినిధి బృందం యూకే పర్యటనలో భాగంగా ప్రముఖ ఆక్స్‌ఫర్డ్ విశ్వవిద్యాలయాన్ని సందర్శించింది. ఈ సందర్భంగా ఆక్స్‌ఫర్డ్ ఆచార్యులు, విద్యా రంగ నిపుణులతో తెలంగాణలో ఉన్నత విద్య, పరిశోధన, ఎగ్జిక్యూటివ్ ఎడ్యుకేషన్ అవకాశాలపై విస్తృతంగా చర్చించారు.
హైదరాబాద్‌లో ఆక్స్‌ఫర్డ్ కేంద్రం ఏర్పాటుపై చర్చ
బ్లావత్నిక్ స్కూల్ ఆఫ్ గవర్నమెంట్‌కు చెందిన ప్రొఫెసర్ మాయా ట్యూడర్, బాలియోల్ కాలేజీ ప్రొఫెసర్ ఫైసల్ దేవ్‌జీలతో తెలంగాణ ప్రతినిధి బృందం సమావేశమైంది. ఆక్స్‌ఫర్డ్ నిర్వహించే ఎగ్జిక్యూటివ్ ఎడ్యుకేషన్ ప్రోగ్రామ్‌లు, పరిశోధన సామర్థ్యాలను హైదరాబాద్‌కు విస్తరించే అవకాశాలను ఈ సందర్భంగా చర్చించారు.
హైదరాబాద్‌లో ప్రత్యేక కేంద్రాన్ని ఏర్పాటు చేసే అంశాన్ని పరిశీలించాలని తెలంగాణ ప్రభుత్వం ఆక్స్‌ఫర్డ్ ప్రతినిధులను కోరింది. జాతీయ విద్యా విధానం (NEP) కింద విదేశీ విశ్వవిద్యాలయాలకు అందుబాటులో ఉన్న అవకాశాలు, హైదరాబాద్‌లో విద్యా సంస్థల ఏర్పాటుకు ఉన్న అనుకూల పరిస్థితులను ప్రభుత్వ సలహాదారు కె. రామకృష్ణారావు ప్రజెంటేషన్ ద్వారా వివరించారు. దీనిపై ఆక్స్‌ఫర్డ్ ప్రతినిధులు సానుకూలంగా స్పందించినట్లు సమాచారం.
తెలంగాణ రైజింగ్ గ్లోబల్ సమ్మిట్‌కు ఆహ్వానం
ఈ చర్చల కొనసాగింపుగా డిసెంబర్ 2026లో హైదరాబాద్‌లో నిర్వహించనున్న ‘తెలంగాణ రైజింగ్ గ్లోబల్ సమ్మిట్’కు హాజరుకావాలని ఆక్స్‌ఫర్డ్ ప్రతినిధి బృందాన్ని సీఎం రేవంత్‌రెడ్డి ఆహ్వానించారు. తెలంగాణలో విద్య, పరిశోధన, నైపుణ్యాభివృద్ధికి అంతర్జాతీయ సంస్థల భాగస్వామ్యాన్ని పెంచే దిశగా ఈ సమావేశం కీలకంగా మారే అవకాశం ఉంది.
సోమర్‌విల్ కాలేజీలో ఇందిరాగాంధీ చిత్రపటం సందర్శన
ఆక్స్‌ఫర్డ్ పర్యటనలో భాగంగా సీఎం రేవంత్‌రెడ్డి సోమర్‌విల్ కాలేజీని కూడా సందర్శించారు. అక్కడ ప్రదర్శిస్తున్న భారత మాజీ ప్రధాని స్వర్గీయ ఇందిరాగాంధీ చిత్రపటాన్ని ఆయన తిలకించారు.
తెలంగాణలో ప్రపంచస్థాయి క్రీడా వసతులపై చర్చ
అనంతరం జీఎంఆర్ గ్రూప్ నిర్వహిస్తున్న ‘యుటిలిటా బౌల్’ స్పోర్ట్స్ కాంప్లెక్స్‌ను సీఎం సందర్శించారు. ఈ సందర్భంగా జీఎంఆర్ గ్రూప్ ఛైర్మన్ కిరణ్‌కుమార్ గ్రాంధితో తెలంగాణలో ప్రపంచస్థాయి క్రీడా మౌలిక వసతుల అభివృద్ధిపై చర్చలు జరిపారు.
తెలంగాణలో విద్య, క్రీడలు, నైపుణ్యాభివృద్ధి రంగాల్లో అంతర్జాతీయ ప్రమాణాలను తీసుకురావడమే తమ ప్రభుత్వ లక్ష్యమని సీఎం రేవంత్‌రెడ్డి స్పష్టం చేశారు. ముఖ్యంగా సామాన్య కుటుంబాలకు చెందిన విద్యార్థులకు కూడా ప్రపంచస్థాయి విద్య అందుబాటులో ఉండేలా చర్యలు తీసుకుంటామని తెలిపారు.




































