వెలిగొండ ప్రాజెక్ట్‌కి శంకుస్థాపన చేసిందీ నేనే.. ప్రారంభించిందీ నేనే – సీఎం చంద్రబాబు

CM Chandrababu Naidu Inaugurates Veligonda Project Phase-1, Dedicates To The Nation

మూడు దశాబ్దాల క్రితం వెలిగొండ ప్రాజెక్ట్‌కి శంకుస్థాపన చేసింది తానేనని, ఇప్పుడు ప్రారంభించిందీ తానేనని గర్వంగా ప్రకటించారు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు. ఈ మేరకు ఉమ్మడి ప్రకాశం, మార్కాపురం, నెల్లూరు మరియు వైఎస్సార్ కడప జిల్లాల ప్రజల ముప్పై ఏళ్ల కలను సాకారం చేస్తూ ఆయన నేడు ‘పూల సుబ్బయ్య వెలిగొండ ప్రాజెక్టు’ తొలి దశను ప్రారంభించి, నల్లమల సాగర్‌కు కృష్ణా జలాలను విడుదల చేశారు.

‘వెలుగుల దివ్వె వెలిగొండ-అభివృద్ధికి రెక్కలు’ నినాదంతో మార్కాపురం జిల్లా దోర్నాల మండలం గంటవానిపల్లి వద్ద ఈ చారిత్రాత్మక కార్యక్రమం నిర్వహించబడింది. ఈ నేపథ్యంలో కార్యక్రమానికి సంప్రదాయబద్ధంగా పంచెకట్టుతో హాజరైన సీఎం వెలిగొండ ప్రాజెక్టు ఫీడర్ కెనాల్ వద్ద పూజా కార్యక్రమాల్లో పాల్గొని, కృష్ణమ్మకు జలహారతి ఇచ్చి సారె సమర్పించారు.

కృష్ణమ్మకు సాష్టాంగ ప్రణామం

అనంతరం పవిత్ర కృష్ణా జలాలను తలపై చల్లుకుని, జలహారతి అనంతరం కెనాల్ ఒడ్డున కృష్ణమ్మకు సాష్టాంగ ప్రణామం చేశారు. సీఎం భక్తిశ్రద్ధలను చూసి అక్కడికి చేరుకున్న రైతులు, మహిళలు పెద్ద ఎత్తున హర్షధ్వానాలు వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన బహిరంగ సభలో సీఎం చంద్రబాబు స్థానిక ప్రజలనుద్దేశించి భావోద్వేగ ప్రసంగం చేశారు.

పైలాన్ ఆవిష్కరణ & నల్లమల సాగర్‌కు నీటి విడుదల

ఈ క్రమంలో ప్రత్యేక పూజలు చేసిన తర్వాత సీఎం చంద్రబాబు వెలిగొండ ప్రాజెక్ట్ స్మారక పైలాన్‌ను ఆవిష్కరించి, ప్రాజెక్టును జాతికి అంకితం చేశారు. వేదికపై ఉన్న స్థానిక రైతులతో స్వయంగా బటన్ నొక్కించి ఫీడర్ కెనాల్ వద్ద గేట్లను ఎత్తించారు. గేట్లు ఎత్తిన మరుక్షణమే కృష్ణా జలాలు పరవళ్లు తొక్కుతూ నల్లమల సాగర్ వైపు పరుగులు తీశాయి.

మంగళకరమైన వాతావరణంలో జరిగిన ఈ నీటి విడుదల కార్యక్రమంతో వెలిగొండ ఆయకట్టు పరిధిలోని రైతుల్లో మరియు ప్రజల్లో ఆనందోత్సాహాలు వెల్లివిరిశాయి. ఈ చారిత్రాత్మక ఘట్టంలో ఏపీ బీజేపీ అధ్యక్షుడు మాధవ్, రాష్ట్ర మంత్రులు కందుల దుర్గేష్, నిమ్మల రామానాయుడుతో పాటు పలువురు ప్రజాప్రతినిధులు మరియు అధికారులు పాల్గొన్నారు.

శంకుస్థాపన నుంచి ప్రారంభోత్సవం వరకు.. చారిత్రాత్మక ఘట్టం

ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా నారా చంద్రబాబు నాయుడు 1996 మార్చి 5న ఈ ప్రతిష్టాత్మక ప్రాజెక్టుకు శంకుస్థాపన చేశారు. సరిగ్గా ముప్పై ఏళ్ల తర్వాత, మళ్లీ ఆయన చేతుల మీదుగానే ఈ ప్రాజెక్టు తొలి దశ ప్రారంభం కావడం విశేషం.

  • నీటి విడుదల: శ్రీశైలం రిజర్వాయర్ నుంచి గ్రావిటీ ద్వారా నల్లమల సాగర్‌కు 10.70 టీఎంసీల కృష్ణా జలాలను విడుదల చేశారు.

  • పరిహారం వేగం: ప్రాజెక్ట్ నిర్వాసితులకు కేవలం 48 రోజుల్లోనే రూ. 768 కోట్ల మేర పునరావాస పరిహారం అందించడం ద్వారా కూటమి ప్రభుత్వం పనులను వేగవంతం చేసి తొలి దశను అందుబాటులోకి తెచ్చింది.

సాగు, తాగునీటి ప్రయోజనాలు

కరవు పీడిత ప్రాంతాలు, ఫ్లోరైడ్ రహిత నీటి కోసం దశాబ్దాలుగా ఎదురుచూస్తున్న పడమటి ప్రకాశం మరియు పరిసర ప్రాంతాలకు వెలిగొండ ఒక ప్రాణధారగా మారనుంది.

  • తొలి దశ లబ్ధి: తొలి దశ ద్వారా దాదాపు 1.19 లక్షల ఎకరాలకు సాగునీరు అందించడంతో పాటు 4 లక్షల మంది ప్రజలకు సురక్షిత తాగునీరు అందుతుంది.

  • మొత్తం ఆయకట్టు: ప్రాజెక్ట్ పూర్తిస్థాయిలో అందుబాటులోకి వస్తే 30 మండలాల పరిధిలో 4.47 లక్షల ఎకరాలకు సాగునీరు మరియు 23 లక్షల మందికి తాగునీరు అందుతుంది.

వ్యవసాయ, పారిశ్రామిక రంగానికి కొత్త ఊపు

వెలిగొండ జలాల రాకతో ఈ ప్రాంతంలో భూగర్భ జలమట్టాలు మెరుగుపడి వ్యవసాయ రంగానికి కొత్త ఊపు వస్తుందని ప్రభుత్వం భావిస్తోంది. ముఖ్యంగా ఉద్యానవన పంటలు, అగ్రో ప్రాసెసింగ్ రంగాల అభివృద్ధికి నీటి లభ్యత కీలకంగా మారనుంది.

దొనకొండ, కనిగిరి వంటి ప్రాంతాల్లో పారిశ్రామిక అభివృద్ధికి కూడా నీటి వసతి తోడ్పడే అవకాశం ఉంది. పరిశ్రమలు విస్తరించడం ద్వారా స్థానిక యువతకు ఉపాధి అవకాశాలు పెరిగి, ఇతర ప్రాంతాలకు వలస వెళ్లే పరిస్థితులు తగ్గుతాయని ప్రభుత్వం ఆశాభావం వ్యక్తం చేస్తోంది. ముప్పై ఏళ్ల కలను సాకారం చేసిన వెలిగొండ ప్రాజెక్టు తొలి దశ ప్రారంభం, ఈ ప్రాంత అభివృద్ధిలో కొత్త అధ్యాయానికి నాంది పలికిందని సీఎం చంద్రబాబు పేర్కొన్నారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here