ఆంధ్రప్రదేశ్ తీర ప్రాంతాన్ని తుపాన్లు, బలమైన ఈదురు గాలుల నుంచి రక్షించేందుకు ప్రభుత్వం ప్రత్యేక చర్యలు చేపడుతోంది. ఇందులో భాగంగా ‘గ్రేట్ గ్రీన్ వాల్’ ప్రాజెక్టులో భాగంగా తాటి వనాల అభివృద్ధి కార్యక్రమాన్ని ప్రారంభించినట్లు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ తెలిపారు. తీరప్రాంత గ్రామాలకు సహజ రక్షణ కవచాన్ని ఏర్పాటు చేయడమే ఈ కార్యక్రమం ప్రధాన ఉద్దేశమని వెల్లడించారు.
5,499 హెక్టార్లలో తాటి వనాల పెంపకం
రాష్ట్రంలోని తీర ప్రాంతం వెంబడి మొత్తం 5,499 హెక్టార్లలో తాటి వనాలను అభివృద్ధి చేయనున్నట్లు పవన్ కళ్యాణ్ తెలిపారు. ఈ ప్రాజెక్టులో తొలిదశలో మడ అడవుల పెంపకానికి ప్రాధాన్యం ఇవ్వగా.. రెండో దశలో తాటి వనాలను విస్తరించే కార్యక్రమం చేపట్టినట్లు వివరించారు.
ఈ ప్రాజెక్టుకు సుమారు 55 లక్షల తాటి గింజలు అవసరమవుతాయని అంచనా వేయగా, ఇప్పటికే 13 లక్షల గింజలను సేకరించినట్లు తెలిపారు. అందులో 1.65 లక్షల గింజలను నాటినట్లు వెల్లడించారు.
తుపాన్ల నుంచి సహజ రక్షణ
తాటి చెట్లు బలమైన గాలులను తట్టుకుని నిలబడటంతో పాటు వాటి వేర్లు నేలను గట్టిగా పట్టి ఉంచుతాయని పవన్ కళ్యాణ్ పేర్కొన్నారు. దీంతో తీరప్రాంతంలో నేల కోతను తగ్గించడంలో తాటి వనాలు కీలకంగా ఉపయోగపడతాయని తెలిపారు.
తుపాన్లు, సముద్రపు గాలుల ప్రభావాన్ని తగ్గించేందుకు సహజ రక్షణ వ్యవస్థగా ఈ పచ్చదనం ఉపయోగపడేలా ప్రణాళిక రూపొందించినట్లు వెల్లడించారు. పర్యావరణ పరిరక్షణతో పాటు తీరప్రాంత ప్రజలకు భద్రత కల్పించడం కూడా ఈ కార్యక్రమం లక్ష్యాల్లో భాగమని పేర్కొన్నారు.
విశాఖ జూలో 128 కొత్త జీవులు
విశాఖపట్నంలోని ఇందిరా గాంధీ జంతు ప్రదర్శనశాలలో చేపట్టిన సంరక్షణ కార్యక్రమాలపై కూడా పవన్ కళ్యాణ్ స్పందించారు. శాస్త్రీయ పద్ధతులతో చేపట్టిన సంరక్షణ చర్యల ఫలితంగా 12 రకాల జాతులకు చెందిన 128 కొత్త జీవులు జన్మించడం పట్ల ఆయన హర్షం వ్యక్తం చేశారు.
కృత్రిమ ఇంక్యుబేషన్ విధానంలో 10 ఎర్ర అడవి కోడి పిల్లలు, ఒక బ్లూ గోల్డ్ మకావ్ పిల్ల విజయవంతంగా పొదగడం ప్రత్యేకంగా నిలిచిందని తెలిపారు. జీవవైవిధ్య పరిరక్షణలో భాగంగా ఇలాంటి కార్యక్రమాలను మరింత విస్తరించాలని సూచించారు.
అటవీ శాఖ అధికారులు, జూ సిబ్బంది చేస్తున్న కృషిని పవన్ కళ్యాణ్ అభినందించారు. తీరప్రాంత పచ్చదనం పెంపుతో పాటు వన్యప్రాణుల సంరక్షణకు ప్రాధాన్యం ఇవ్వడం ద్వారా పర్యావరణ సమతుల్యతను కాపాడేందుకు ప్రభుత్వం చర్యలు కొనసాగిస్తోందని తెలిపారు.





































