హైడ్రా కమిషనర్ రంగనాథ్‌కు తెలంగాణ హైకోర్టులో ఊరట లభించింది. శాంతా శ్రీరామ్ కన్స్ట్రక్షన్కు సంబంధించిన కేసులో గతంలో సింగిల్ బెంచ్ ఇచ్చిన ఉత్తర్వులను హైకోర్టు డివిజన్ బెంచ్ తాత్కాలికంగా సస్పెండ్ చేసింది. రంగనాథ్‌ను హైడ్రా కమిషనర్ పదవి నుంచి తప్పించి మరో అధికారిని నియమించాలని సింగిల్ జడ్జి ఇచ్చిన ఆదేశాల అమలుపై డివిజన్ బెంచ్ స్టే విధించింది.
ఈ కేసుపై తదుపరి విచారణను నవంబర్ 3వ తేదీకి వాయిదా వేసిన న్యాయస్థానం, అప్పటి వరకు సింగిల్ బెంచ్ ఉత్తర్వులపై తాత్కాలిక సస్పెన్షన్ కొనసాగుతుందని స్పష్టం చేసింది. దీంతో ప్రస్తుతానికి హైడ్రా కమిషనర్‌గా రంగనాథ్ కొనసాగేందుకు మార్గం సుగమమైంది.
సింగిల్ బెంచ్ తీర్పును సవాల్ చేసిన రంగనాథ్
శాంతా శ్రీరామ్ కన్స్ట్రక్షన్ కేసులో రంగనాథ్‌ను తప్పించి మరో అధికారిని నియమించాలని గతంలో సింగిల్ జడ్జి తీర్పునిచ్చారు. ఈ ఉత్తర్వులను సవాల్ చేస్తూ హైడ్రా కమిషనర్ రంగనాథ్ హైకోర్టు డివిజన్ బెంచ్‌ను ఆశ్రయించారు.
అప్పీల్ పిటిషన్‌పై జరిగిన విచారణలో రంగనాథ్ తరఫున హిమాచల్ ప్రదేశ్ హైకోర్టు మాజీ ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ రాజీవ్ శక్దర్ వాదనలు వినిపించారు. ఇరుపక్షాల వాదనలు విన్న డివిజన్ బెంచ్, సింగిల్ బెంచ్ ఇచ్చిన ఉత్తర్వుల అమలును తాత్కాలికంగా నిలిపివేస్తూ కీలక ఆదేశాలు జారీ చేసింది.
లోతుకుంట భూముల విషయంలో కీలక ఆదేశాలు
ఈ వివాదానికి సంబంధించిన లోతుకుంట భూముల విషయంలో తదుపరి ఉత్తర్వులు వెలువడే వరకు ఎలాంటి చర్యలు తీసుకోవద్దని హైకోర్టు స్పష్టం చేసింది. భూముల విషయంలో జోక్యం చేసుకోవద్దంటూ సంబంధిత వర్గాలకు సూచనలు చేసింది.
నవంబర్ 3న జరగనున్న తదుపరి విచారణలో ఈ కేసుపై మరింత స్పష్టత వచ్చే అవకాశం ఉంది. సింగిల్ బెంచ్ ఇచ్చిన ఆదేశాలపై డివిజన్ బెంచ్ తీసుకునే తుది నిర్ణయం హైడ్రా కమిషనర్ రంగనాథ్ భవిష్యత్‌పై ప్రభావం చూపే అవకాశం ఉండటంతో ఈ కేసుపై ఆసక్తి నెలకొంది.








































