కొడంగల్ ఎత్తిపోతల పనులను వేగవంతం చేయాలి: సీఎం రేవంత్ రెడ్డి

CM Revanth Reddy Directs Officials To Accelerate Kodangal Lift Irrigation Works

కొడంగల్ నియోజకవర్గంలో నిర్మాణంలో ఉన్న సాగునీటి ప్రాజెక్టుల పనులను వేగవంతం చేయాలని అధికారులకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆదేశించారు. మక్తల్-నారాయణపేట్-కొడంగల్ ఎత్తిపోతల పథకం పనుల పురోగతిపై నీటిపారుదల శాఖ ఉన్నతాధికారులతో ఆయన సమీక్షా సమావేశం నిర్వహించారు. ప్రాజెక్టుల నిర్మాణంలో ఎలాంటి ఆటంకాలు రాకుండా ముందస్తు ప్రణాళికలు రూపొందించాలని, ప్రతి సంవత్సరానికి అవసరమయ్యే బడ్జెట్ అంచనాలు మరియు నిధుల ప్రతిపాదనలతో కూడిన పూర్తి నివేదికను తనకు అందించాలని సీఎం స్పష్టం చేశారు.

గత సమీక్షా సమావేశంలో ఇచ్చిన ఆదేశాల మేరకు ప్రాజెక్టుకు సంబంధించిన పంప్‌హౌస్ పనుల్లో పురోగతి కనిపిస్తోందని అధికారులు ఈ సందర్భంగా ముఖ్యమంత్రికి వివరించారు. దీనిపై స్పందించిన సీఎం రేవంత్ రెడ్డి, ఎత్తిపోతల పథకానికి సంబంధించిన ఫేజ్-2 పనులకు వీలైనంత త్వరగా టెండర్లు పిలవాలని ఆదేశించారు. అలాగే ప్రాజెక్టు నిర్మానానికి అవసరమైన పెండింగ్ భూసేకరణ ప్రక్రియను త్వరితగతిన పూర్తి చేసి, రైతులకు న్యాయమైన నష్టపరిహారం అందించాలని స్పష్టం చేశారు.

ప్రాజెక్ట్ పనుల్లో భూసేకరణ, టెండర్ల ప్రక్రియ మరియు నిర్మాణ పనులను వివిధ శాఖల అధికారులు సమన్వయంతో నిర్వహించాలని, నిర్ణీత గడువులోగా పనులను పూర్తి చేయాలని సీఎం నిర్దేశించారు. ఈ సమీక్షలో అధికారులు స్పందిస్తూ.. మక్తల్-నారాయణపేట్-కొడంగల్ ఎత్తిపోతల ఫేజ్-1 పనులను డిసెంబర్ 2027 నాటికి, ఫేజ్-2 పనులను అక్టోబర్ 2028 నాటికి పూర్తి చేసేలా ప్రణాళికలతో పనిచేస్తున్నామని ముఖ్యమంత్రికి వెల్లడించారు.

ఈ నిర్ణీత డెడ్‌లైన్లను దృష్టిలో ఉంచుకుని క్షేత్రస్థాయిలో పనుల వేగాన్ని మరింత పెంచాలని సీఎం అధికారులను పురమాయించారు. కొడంగల్ ప్రాంతానికి సాగునీరు అందించడమే లక్ష్యంగా చేపట్టిన ఈ ప్రాజెక్టు ద్వారా వేలాది ఎకరాలకు సాగునీరు అందుతుందని, పనుల్లో ఏమాత్రం నిర్లక్ష్యం వహించవద్దని నీటిపారుదల శాఖ అధికారులకు సూచించారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here