నిరుద్యోగులకు ఏపీ ప్రభుత్వం తీపికబురు.. నియామకాల వయోపరిమితి 44 ఏళ్లకు పెంపు

AP Govt Announces Age Relaxation For Non-Uniform Jobs Upto 44

ఆంధ్రప్రదేశ్‌లో ప్రభుత్వ ఉద్యోగాల కోసం ఎదురుచూస్తున్న నిరుద్యోగులకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. ప్రభుత్వ ఉద్యోగ నియామకాల్లో గరిష్ఠ వయోపరిమితిని పెంచుతూ కీలక నిర్ణయం తీసుకుంది. నాన్-యూనిఫామ్ సర్వీస్ పోస్టులకు గరిష్ఠ వయోపరిమితిని 42 ఏళ్ల నుంచి 44 ఏళ్లకు పెంచుతూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది.

ఈ మేరకు రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి జి. సాయిప్రసాద్ ఉత్తర్వులు జారీ చేశారు. సాధారణ పరిపాలన శాఖ జీఓ ఎంఎస్ నంబర్ 187 ద్వారా వయోపరిమితి సడలింపును ప్రకటించింది. ఈ నిర్ణయంతో ఏపీపీఎస్సీతో పాటు ఇతర రిక్రూట్‌మెంట్ ఏజెన్సీల ద్వారా జరిగే డైరెక్ట్ రిక్రూట్‌మెంట్‌లో అర్హత ఉన్న మరింత మంది అభ్యర్థులకు అవకాశం లభించనుంది.

2027 సెప్టెంబర్ 30 వరకు అమలు

ప్రభుత్వం ప్రకటించిన ఈ వయోపరిమితి సడలింపు 2027 సెప్టెంబర్ 30 వరకు అమల్లో ఉండనుంది. నాన్-యూనిఫామ్ సర్వీసులకు సంబంధించిన పోస్టుల భర్తీలో ఈ ఉత్తర్వులు వర్తిస్తాయని ప్రభుత్వం స్పష్టం చేసింది. గతంలో 42 ఏళ్లుగా ఉన్న గరిష్ఠ వయోపరిమితిని 44 ఏళ్లకు పెంచుతూ తుది నిర్ణయం తీసుకున్నట్లు వెల్లడించింది.

అయితే ఈ వయోపరిమితి పెంపు అన్ని ప్రభుత్వ ఉద్యోగాలకు వర్తించదు. పోలీస్, ఎక్సైజ్, ఫైర్, ఫారెస్ట్, ట్రాన్స్‌పోర్ట్ తదితర యూనిఫామ్ సర్వీసులకు సంబంధించిన పోస్టులకు ఈ సడలింపు వర్తించదని ప్రభుత్వం స్పష్టం చేసింది.

అదేవిధంగా రూల్ నంబర్ 12 కింద ఇప్పటికే అందుబాటులో ఉన్న ఇతర అదనపు వయోపరిమితి సడలింపులు యథావిధిగా కొనసాగుతాయని అధికారులు తెలిపారు. దీంతో రానున్న ఉద్యోగ నియామకాల్లో వయోపరిమితి కారణంగా అవకాశాలు కోల్పోయే అభ్యర్థులకు ఈ నిర్ణయం కొంత ఊరటనివ్వనుంది.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here