తిరుమల శ్రీవారి వార్షిక బ్రహ్మోత్సవాలు మంగళవారం వైభవంగా ప్రారంభం కానున్నాయి. సాయంత్రం 6:21 గంటల నుంచి 6:35 గంటల మధ్య మీన లగ్నంలో ఆలయంలో ధ్వజారోహణ కార్యక్రమాన్ని అర్చకులు నిర్వహించనున్నారు. గరుడ పతాకాన్ని ధ్వజస్తంభంపై ఎగురవేయడంతో తొమ్మిది రోజుల పాటు జరిగే బ్రహ్మోత్సవాలకు శ్రీకారం చుట్టనున్నారు. రాత్రి 9 గంటలకు పెద్దశేష వాహనంపై శ్రీదేవి, భూదేవి సమేత మలయప్ప స్వామి భక్తులకు దర్శనమివ్వనున్నారు. బ్రహ్మోత్సవాల్లో భాగంగా స్వామివారు మొత్తం 16 వాహనాలపై భక్తులకు దర్శనమివ్వనున్నారు.
ఈ సందర్భంగా ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు దంపతులు మంగళవారం తిరుమలకు చేరుకోనున్నారు. సాయంత్రం 6:30 గంటలకు కొండపైకి చేరుకున్న అనంతరం రాత్రి 7:40 గంటలకు బేడీ ఆంజనేయస్వామిని దర్శించుకుంటారు. అక్కడి నుంచి పట్టువస్త్రాలతో ఊరేగింపుగా శ్రీవారి ఆలయానికి చేరుకుని రాష్ట్ర ప్రభుత్వం తరఫున స్వామివారికి పట్టువస్త్రాలను సమర్పించనున్నారు. అనంతరం స్వామివారిని దర్శించుకోనున్నారు.
దర్శనం పూర్తైన తర్వాత రంగనాయకుల మండపంలో టీటీడీ రూపొందించిన 2027 సంవత్సర క్యాలెండర్లు, డైరీలను సీఎం చంద్రబాబు ఆవిష్కరించనున్నారు. రాత్రి 9 గంటలకు జరిగే పెద్దశేష వాహన సేవలో పాల్గొంటారు. అనంతరం దంపతులు తిరుమలలోనే బస చేయనున్నారు.
బుధవారం కూడా సీఎం చంద్రబాబు పలు కార్యక్రమాల్లో పాల్గొననున్నారు. ఉదయం 8:40 గంటలకు వైకుంఠం క్యూ కాంప్లెక్స్‌లో పిలిగ్రిమ్ ఎక్స్పీరియన్స్ సెంటర్‌ను ప్రారంభిస్తారు. 9:30 గంటలకు గోగర్భం డ్యామ్ సర్కిల్ వద్ద రిలయన్స్ సంస్థ విరాళంగా అందించిన 25 ఎలక్ట్రికల్ బస్సులను ప్రారంభించనున్నారు. ఉదయం 10 గంటలకు టీటీడీ ఆధునికీకరించిన మ్యూజియాన్ని ప్రారంభిస్తారు.
అనంతరం ఉదయం 11 గంటలకు పద్మావతి అతిథిగృహంలో టీటీడీ ఆధ్వర్యంలో కొనసాగుతున్న అభివృద్ధి పనులపై అధికారులతో సమీక్ష నిర్వహిస్తారు. కార్యక్రమాలు ముగిసిన తర్వాత మధ్యాహ్నం 12 గంటలకు తిరుమల నుంచి రోడ్డు మార్గంలో రేణిగుంట విమానాశ్రయానికి సీఎం చంద్రబాబు దంపతులు బయలుదేరనున్నారు.








































