ఆంధ్రప్రదేశ్ మాజీ ఉప ముఖ్యమంత్రి, ఏలూరు మాజీ ఎమ్మెల్యే ఆళ్ల కాళీకృష్ణ శ్రీనివాస్ (ఆళ్ల నాని) కన్నుమూశారు. 57 ఏళ్ల ఆయన మంగళవారం విశాఖపట్నంలోని ఓ ప్రైవేట్ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ తుదిశ్వాస విడిచారు. తీవ్ర గుండెపోటుకు గురైన ఆయనను కుటుంబ సభ్యులు హుటాహుటిన ఆసుపత్రికి తరలించగా.. వైద్యులు చికిత్స అందించినప్పటికీ పరిస్థితి విషమించడంతో మృతి చెందారు. ఆయన ఆకస్మిక మరణంతో ఏలూరు, పశ్చిమ గోదావరి జిల్లాలో విషాదం నెలకొంది. అభిమానులు, అనుచరులు తీవ్ర దిగ్భ్రాంతికి గురయ్యారు.
ఆళ్ల నాని కాంగ్రెస్ పార్టీ ద్వారా రాజకీయాల్లోకి ప్రవేశించారు. ఏలూరు నియోజకవర్గం నుంచి ఎమ్మెల్యేగా ఎన్నికై రాజకీయంగా గుర్తింపు పొందారు. అనంతరం వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీలో చేరారు. 2019 అసెంబ్లీ ఎన్నికల్లో ఏలూరు నుంచి విజయం సాధించి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి నేతృత్వంలోని ప్రభుత్వంలో కీలక బాధ్యతలు చేపట్టారు. జగన్ కేబినెట్‌లో ఐదుగురు ఉప ముఖ్యమంత్రుల్లో ఒకరిగా పనిచేయడంతో పాటు వైద్య, ఆరోగ్య శాఖ మంత్రిగా కూడా బాధ్యతలు నిర్వహించారు.
2024 అసెంబ్లీ ఎన్నికల్లో ఏలూరు నియోజకవర్గం నుంచి టీడీపీ అభ్యర్థి బడేటి రాధాకృష్ణ (చంటి) చేతిలో ఆళ్ల నాని ఓటమి పాలయ్యారు. ఎన్నికల అనంతరం చోటుచేసుకున్న రాజకీయ పరిణామాల నేపథ్యంలో ఆయన తెలుగుదేశం పార్టీలో చేరారు.
సీఎం చంద్రబాబు దిగ్భ్రాంతి
ఇక ఆళ్ల నాని హఠాన్మరణం పట్ల ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. 56 సంవత్సరాల పిన్న వయసులోనే ఆయన గుండెపోటుతో కన్నుమూయడం ఎంతో బాధాకరమని పేర్కొన్నారు. సోషల్ మీడియా వేదికగా స్పందించిన ఆయన, ఆళ్ల నాని ఆత్మకు శాంతి చేకూరాలని ఆ భగవంతుడిని ప్రార్థిస్తూ, వారి కుటుంబ సభ్యులకు తన ప్రగాఢ సానుభూతిని తెలియజేశారు.
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మాజీ ఉప ముఖ్యమంత్రి ఆళ్ల నాని గారి (కాళీ కృష్ణ శ్రీనివాస్) హఠాన్మరణం నాకు తీవ్ర దిగ్భ్రాంతి కలిగించింది. 56 సంవత్సరాల వయసులోనే గుండెపోటుతో ఆయన దూరమవ్వడం బాధాకరం. ఆయన కుటుంబానికి నా ప్రగాఢ సానుభూతి వ్యక్తం చేస్తున్నాను. ఆళ్ల నాని గారి ఆత్మకు శాంతిని… pic.twitter.com/IlA7QrLDXP
— N Chandrababu Naidu (@ncbn) September 15, 2026
మంత్రి నారా లోకేశ్ తీవ్ర విచారం
మరోవైపు రాష్ట్ర మంత్రి నారా లోకేశ్ కూడా ఆళ్ల నాని మృతి పట్ల తీవ్ర విచారం వ్యక్తం చేశారు. వివాదాలకు దూరంగా ఉంటూ, అందరితో ఎంతో స్నేహపూర్వకంగా మెలిగే మంచి నాయకుడిని కోల్పోవడం విచారకరమని కొనియాడారు. ఈ కష్ట సమయంలో వారి కుటుంబ సభ్యులకు భగవంతుడు ధైర్యాన్ని ప్రసాదించాలని కోరుకుంటూ ఎక్స్ ద్వారా తన సంతాపాన్ని ప్రకటించారు.
టీడీపీ నేత, మాజీ మంత్రి, ‘ఆళ్ల నాని’ గుండెపోటుతో మృతి చెందారనే సమాచారం తీవ్ర దిగ్భ్రాంతికి గురిచేసింది. వివాదాలకు దూరంగా, అందరితోనూ స్నేహపూర్వకంగా మెలిగే నాని గారి స్మృతిలో నివాళులర్పిస్తున్నాను. వారి కుటుంబ సభ్యులకు నా ప్రగాఢ సానుభూతి తెలియజేస్తున్నాను. pic.twitter.com/7Tz4DJga7q
— Lokesh Nara (@naralokesh) September 15, 2026
పశ్చిమ గోదావరి జిల్లా రాజకీయాల్లో సుదీర్ఘకాలం కీలక నేతగా కొనసాగిన ఆళ్ల నాని మృతితో రాజకీయ వర్గాల్లో విషాదం నెలకొంది. ఆయన మృతిపట్ల వివిధ రాజకీయ పార్టీల నాయకులు, ప్రజాప్రతినిధులు, ప్రముఖులు సంతాపం వ్యక్తం చేస్తున్నారు. కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలియజేస్తున్నారు.




































