నేను కూడా బటన్ నొక్కొచ్చు.. కానీ ప్రజల మధ్య ఉండాలనే వచ్చాను – సీఎం చంద్రబాబు

CM Chandrababu Distributes NTR Bharosa Pensions in Repalle

కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత 28వసారి పెన్షన్లను పంపిణీ చేస్తున్నామని ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు తెలిపారు. గురువారం నిర్వహించిన ‘పేదల సేవలో’ కార్యక్రమంలో పాల్గొన్న సీఎం.. లబ్ధిదారులకు పెన్షన్లు అందజేశారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ, ముఖ్యమంత్రి అంటే ప్రజల మధ్య ఉండే ‘కామన్‌ మ్యాన్‌’ అని పేర్కొన్నారు. తాను బటన్‌ నొక్కి కార్యక్రమాన్ని నిర్వహించవచ్చని, కానీ ప్రజల వద్దకు వచ్చి సేవ చేయడానికే ప్రాధాన్యం ఇస్తున్నానని చెప్పారు.

పేదల సేవే ప్రభుత్వ బాధ్యత

ప్రభుత్వ విధానాలను మార్చి పేదలకు ప్రయోజనం కల్పించడమే తన బాధ్యత అని సీఎం చంద్రబాబు అన్నారు. ప్రతి నెలా నాలుగుసార్లు ప్రజల వద్దకు వెళ్లి వారి సమస్యలను తెలుసుకుంటున్నామని చెప్పారు. భూసమస్యలను పరిష్కరించడం ద్వారా ప్రజలకు ఇబ్బందులు లేకుండా చర్యలు తీసుకుంటున్నామని తెలిపారు.

రూ.76 వేల కోట్ల పెన్షన్లు

ఆర్థిక ఇబ్బందులు ఉన్నప్పటికీ అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలను కొనసాగిస్తున్నామని సీఎం చెప్పారు. ఇప్పటివరకు పెన్షన్ల రూపంలో రూ.76 వేల కోట్లు ప్రజలకు అందించామని తెలిపారు. వృద్ధులు, దివ్యాంగులు, వితంతువులకు ఇబ్బందులు లేకుండా చర్యలు తీసుకుంటున్నామని పేర్కొన్నారు.

2024 ఎన్నికల్లో ప్రజలు కూటమికి 54 శాతం ఓట్లు, 94 శాతం సీట్లు ఇచ్చారని సీఎం చంద్రబాబు అన్నారు. గత ఐదేళ్ల పాలనలో రాష్ట్రం ఆర్థికంగా నష్టపోయిందని ఆయన ఆరోపించారు. ప్రస్తుతం రాష్ట్ర ఆర్థిక పరిస్థితి క్రమంగా మెరుగుపడుతోందని తెలిపారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here