ఆంధ్రప్రదేశ్ అభివృద్ధిలో భాగస్వామి అయ్యేందుకు రిలయన్స్ ఇండస్ట్రీస్ సిద్ధంగా ఉందని, తనను ‘ఆంధ్రా బిడ్డ’గా భావించి రాష్ట్ర పురోగతికి ఏ రకంగా దోహదపడాలో దిశానిర్దేశం చేయాలని రిలయన్స్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ అనంత్ అంబానీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడును కోరారు. తాజాగా మదనపల్లెలో నిర్వహించిన “గ్లోబల్ హార్టికల్చర్ హబ్ – రాయలసీమ రైజింగ్” శంకుస్థాపన కార్యక్రమంలో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొని మాట్లాడారు. తన ప్రసంగాన్ని ‘నమస్కారం’ అంటూ తెలుగులో ప్రారంభించి సభలోని వారిని విశేషంగా ఆకట్టుకున్నారు.
రూ. 1 లక్ష కోట్ల పెట్టుబడులు – ఏపీలో క్లీన్ ఎనర్జీ విప్లవం
ఆంధ్రప్రదేశ్లో క్లీన్ ఎనర్జీ, ఆల్టర్నేటివ్ ఇంధన రంగాలు మరియు వ్యవసాయాభివృద్ధి కోసం రిలయన్స్ ఇండస్ట్రీస్ తరఫున రూ. 1 లక్ష కోట్ల భారీ పెట్టుబడులు పెట్టనున్నట్లు అనంత్ అంబానీ ప్రకటించారు.
-
కంప్రెస్డ్ బయో గ్యాస్ (CBG) ప్లాంట్లు: రాష్ట్రంలో గుజరాత్ వెలుపల అతిపెద్ద క్లీన్ ఎనర్జీ ప్రాజెక్టుగా రూ. 65,000 కోట్ల అంచనా వ్యయంతో 500 బయో గ్యాస్ ప్లాంట్లను ఏర్పాటు చేయనున్నట్లు స్పష్టం చేశారు. దీనిద్వారా దాదాపు 2.5 లక్షల మందికి పైగా ఉపాధి అవకాశాలు లభిస్తాయని అనంత్ వెల్లడించారు.
-
రైతులకు అండగా జియో కృషి: జియో కృషి వేదిక, పశు సంవర్ధకం, ఉద్యానవన పరిశోధనల ద్వారా స్థానిక రైతులకు అత్యాధునిక సాంకేతికతను మరియు మార్కెట్ అవకాశాలను అందిస్తామని అంబానీ భరోసా ఇచ్చారు.
గ్రామీణ ప్రాంతాల సాధికారతకు ప్రాధాన్యం
భారతదేశ ఆత్మ గ్రామాలోనే ఉందన్న మహాత్మా గాంధీ మాటలను ఉటంకిస్తూ, ఆంధ్రప్రదేశ్ గ్రామీణ ప్రాంతాల యువతకు అవసరమైన నైపుణ్యాలు, సాంకేతికత అందించడం ద్వారా వారి సొంత ఊళ్లలోనే విజయవంతమైన పారిశ్రామికవేత్తలుగా తీర్చిదిద్దవచ్చని తెలిపారు. సీఎం చంద్రబాబు నాయుడు విజన్ మరియు కూటమి ప్రభుత్వంపై తమకు పూర్తి విశ్వాసం ఉందని, ఏపీని స్వయం సమృద్ధి దిశగా తీసుకెళ్లడంలో రిలయన్స్ ఎప్పుడూ ముందుంటుందని అనంత్ అంబానీ పునరుద్ఘాటించారు.




































