మాజీ మంత్రి వైఎస్ వివేకానందరెడ్డి కేసులో కీలక మలుపు

YS Viveka Case ED Issues Summons To Kadapa MP YS Avinash Reddy

మాజీ మంత్రి వైఎస్‌ వివేకానందరెడ్డి తీవ్ర అనుమానాస్పద మృతి కేసులో కీలక పరిణామం చోటుచేసుకుంది. కడప ఎంపీ వైఎస్ అవినాష్ రెడ్డి (ఏ-7)కి ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) అధికారులు తాజాగా నోటీసులు జారీ చేశారు. ఈ వ్యవహారంలో కుదిరిన రూ.40 కోట్ల లావాదేవీలపై మనీలాండరింగ్ కోణంలో జరుగుతున్న దర్యాప్తులో భాగంగా ఈ నెల 14న తమ ఎదుట విచారణకు హాజరుకావాలని ఈడీ అధికారులు ఆదేశించారు. ఈ కేసులో ప్రధాన నిందితుల విచారణ పూర్తవడంతో ఈడీ దర్యాప్తు తుది దశకు చేరుకుందని సమాచారం.

రూ.40 కోట్ల మనీ ట్రయల్‌పై నిశిత ఆరా

ఈ కేసులో అప్రూవర్‌గా మారిన దస్తగిరి (ఏ-4) సహా ఎర్ర గంగిరెడ్డి (ఏ-1), సునీల్ యాదవ్ (ఏ-2), మరియు ఉమాశంకర్ రెడ్డి (ఏ-3)లను ఇప్పటికే ఈడీ అధికారులు విచారించి వాంగ్మూలాలు నమోదు చేశారు.

  • ముందస్తు చెల్లింపులు: ఘటనకు సంబంధించి రూ.40 కోట్ల డీల్ కుదిరిందని, అందులో రూ.5 కోట్ల అడ్వాన్స్ ఒప్పందం ప్రకారం రూ.1 కోటి చేతులు మారిందనడానికి బలమైన సాక్ష్యాధారాలను ఈడీ సేకరించింది.

  • నిధుల మూలాలు: సునీల్ యాదవ్‌కు రూ.కోటి నిధులు ఎక్కడి నుంచి వచ్చాయి, దస్తగిరికి రూ.75 లక్షలు అందించాలని సూచించినవారు ఎవరు అనే అంశాలపై అధికారులు స్పష్టత రాబట్టారు.

అవినాశ్, భాస్కర్ రెడ్డి పాత్రపై విచారణ

ముందుగా దస్తగిరి, సునీల్ యాదవ్ ఇచ్చిన స్టేట్‌మెంట్లను విశ్లేషించిన అధికారులు.. వాటి ఆధారంగా ఎర్ర గంగిరెడ్డి, ఉమాశంకర్ రెడ్డిలను ప్రశ్నించారు. బ్యాంకు లావాదేవీలు, సీసీటీవీ ఫుటేజ్ మరియు నగదు మార్పిడి ఆధారాలను వారి ముందు ఉంచి కీలక సమాచారాన్ని సేకరించారు. ఈ కీలక సాక్ష్యాధారాల ఆధారంగానే ఎంపీ అవినాష్ రెడ్డిని, ఆయన తండ్రి వైఎస్ భాస్కర్ రెడ్డి (ఏ-8)లను విచారించనున్నట్లు ఈడీ వర్గాలు వెల్లడించాయి.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here