ధైర్యముంటే దానికి సమాధానం చెప్పు – కడప గడ్డపై వైసీపీ అధినేతకు సీఎం చంద్రబాబు సవాల్

CM Chandrababu Challenges YSRCP Chief YS Jagan From Public Meeting in Proddatur, Kadapa

కడప గడ్డపై నుండి వైసీపీ అధినేత వైఎస్ జగన్‌కు బహిరంగ సవాల్ విసిరారు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు. ఈ మేరకు ఆయన నేడు కడప జిల్లా ప్రొద్దుటూరులో డిప్యూటీ సీఎం పవన్‌ కల్యాణ్‌ కలిసి ‘జల్‌జీవన్‌ మిషన్‌ 2.0–అమరజీవి జలధార’ పనులకు శ్రీకారం చుట్టిన సందర్భంగా పలు కీలక వ్యాఖ్యలు చేశారు. గ్రామీణ ప్రాంతాల్లో ఇంటింటికీ సురక్షిత తాగునీటిని అందించడమే లక్ష్యంగా చేపట్టిన ఈ కార్యక్రమానికి రూ.30,156 కోట్లకు పైగా అంచనా వ్యయం ఉంది. రాష్ట్రవ్యాప్తంగా 27.36 లక్షల కుటుంబాలకు కొత్తగా కుళాయి కనెక్షన్లు కల్పించేలా ప్రణాళిక రూపొందించారు.

‘విధ్వంసాన్ని సరిచేస్తాం’

అనంతరం జరిగిన సభలో చంద్రబాబు గత ప్రభుత్వ పాలనపై తీవ్ర విమర్శలు చేశారు. తన పాలనపై మాట్లాడుతూ.. “నేను 2019 సీఎంను కాదు.. 4.0 సీఎంను” అని వ్యాఖ్యానించారు. రాష్ట్రంలో జరిగిన విధ్వంసాన్ని సరిచేస్తామని ఎన్నికల సమయంలో ప్రజలకు హామీ ఇచ్చామని, ప్రస్తుతం ఆ దిశగా చర్యలు తీసుకుంటున్నామని చెప్పారు. గ్రామీణ మౌలిక వసతుల అభివృద్ధి కోసం ‘పల్లె పండుగ 3.0’ చేపట్టినట్లు తెలిపారు. ఇప్పటికే ఈ కార్యక్రమం కింద రూ.11,085 కోట్ల విలువైన పనులకు శ్రీకారం చుట్టినట్లు తాజా నివేదికలు పేర్కొన్నాయి.

రాయలసీమకు కొత్త దిశ

మదనపల్లెను హార్టికల్చర్‌ హబ్‌గా అభివృద్ధి చేయడం ద్వారా రాయలసీమకు కొత్త అవకాశాలు వస్తాయని సీఎం అన్నారు. రాష్ట్రంలోని ప్రతి కుటుంబానికి ఇల్లు కల్పించడమే ప్రభుత్వ లక్ష్యమని చెప్పారు. ‘కర్మయోగి’ ద్వారా ఉద్యోగుల్లో నైపుణ్యాలను పెంచుతామని, పాన్‌ IIT ద్వారా సాంకేతిక రంగాన్ని మరింత ముందుకు తీసుకెళ్తామని వెల్లడించారు. పాన్‌ IIT కౌన్సిల్‌ను అమరావతిలో ఏర్పాటు చేయనున్నట్లు తెలిపారు.

కడప అభివృద్ధిపై సవాల్‌

కడప అభివృద్ధిపై ప్రతిపక్ష నేతతో చర్చకు సిద్ధమని చంద్రబాబు సవాల్‌ చేశారు. కేంద్ర నిధుల వినియోగం, గత ప్రభుత్వ పనితీరుపైనా విమర్శలు చేశారు. గోదావరి–కావేరి నదుల అనుసంధానం తన లక్ష్యమని, నదుల అనుసంధానంతో పలు రాష్ట్రాల్లో సాగునీటి సమస్యలకు పరిష్కారం లభిస్తుందని పేర్కొన్నారు.

సమాధానం చెప్పే ధైర్యం ఉందా?

గత ప్రభుత్వ హయాంలో జరిగిన మద్యం కుంభకోణంలో అంతిమ లబ్ధిదారు ఆ పార్టీ అధినేతే అని, అన్ని వేళ్లు ఆయన వైపే చూపిస్తున్నాయని, దీనిపై సమాధానం చెప్పే ధైర్యం ఉందా? అని సీఎం చంద్రబాబు బహిరంగ సవాల్ విసిరారు. వివేకానందరెడ్డి హత్య కేసు, గత ప్రభుత్వ హయాంలో నియామకాలపై చంద్రబాబు పలు ఆరోపణలు చేశారు. ఈ కేసుల్లో వాస్తవాలు వెలుగులోకి రావాలని అన్నారు.

మాజీ మంత్రి వివేకానంద రెడ్డి హత్య కేసులో వాస్తవాలన్నీ నేడు ఒక్కొక్కటిగా బయటకు వస్తున్నాయని, ఈ కేసులో పూర్తి నిజాలు కక్కిస్తామని హెచ్చరించారు. అలాగే నాడు గ్రూప్‌1లోనూ అక్రమాలు జరిగాయని, దీనికి వారు శిఖ అనుభవించాల్సిందేనని సీఎం చంద్రబాబు స్పష్టం చేశారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here